Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Women empowerment is a dream? సాధికారికత సుదూర స్వప్నమేనా?

Women empowerment is a dream? సాధికారికత సుదూర స్వప్నమేనా?

ఆమె అడుగడుగునా నిరూపించుకోవాలి

మహిళలు సగం ఫలితాన్ని సాధించాలన్నా రెట్టింపు పని చేయాల్సి ఉంటుందనేది ప్రస్తుతం రాజకీయ రంగంలో ఒక సూక్తిగా మారిపోయింది. నిజానికి ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది. పురుషులు సాధిస్తున్న ఫలితాలలో సగం ఫలితాన్ని సాధించాలన్నా మహిళలు పురుషుల కంటే రెట్టింపు కష్టపడాల్సి ఉంటుందని ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో రుజువు అవుతూనే ఉంది. తన పురుష సహోద్యోగి కంటే ఎక్కువగా తాను సమర్థురాలినని, ప్రతిభావంతురాలినని, ఆధారపడదగిన వ్యక్తిని ఆమె అడుగడుగునా నిరూపించుకోవాల్సి వస్తోంది. ఇది వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన విషయం మాత్రమే. ఇక ఆమె వీటితో పాటు, ఇంటి బరువు బాధ్యతలను, పిల్లల పెంపకాన్ని, పెద్దల బాగోగులను కూడా సమర్థవంతంగా చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఇంటా బాధ్యతలను ఆమె సమర్థవంతంగా, సంతృప్తికరంగా నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను నెరవేరుస్తున్నప్పుడు ఆమె ఎక్కడా అధికారాన్ని గానీ, అహంకారాన్ని గానీ ప్రదర్శించకూడదు. ఎవరినీ భయపెట్టకూడదు. తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. అందరితో సర్దుకుపోతుండాలి. సహనంతో వ్యవహరించాలి. కోపతాపాలు ప్రదర్శించకూడదు. ఈ బాధ్యతలనన్నిటినీ ఒంటరిగానే నిర్వర్తించాలి. ఎందుకంటే ఆమెకు విజయం లేదా సాఫల్యం అనేది కత్తి మీద సాము లాంటిది. ఏమాత్రం తప్పటడుగు వేసినా, ఫలితం చేజారిపోతుంది. ఈ పురుషాధిక్య సమాజంలో ఆమె తన స్త్రీత్వాన్ని కాపాడుకోవడాన్ని మాత్రం మరచిపోకూడదు. ఏది ఏమైనా, వైఫల్యం లేదా అపజయమనేది ఆమె పురుషులకన్నా సగం తప్పులకే ఆమెకు సిద్ధించే అవకాశం ఉంది.
సాధారణ రంగాల్లోనే ఆమె పరిస్థితి ఈ విధంగా ఉంటే రాజకీయ రంగం గురించి ఇక చెప్పేదేముంది? రాజకీయ రంగంలో దాదాపు పురుషులకే పరిమితం అయిన అధికారం చేపట్టడమనే లక్ష్యాన్ని సాధించడానికి స్త్రీలకు ఆమోదయోగ్యమయిన పరిధిలో, స్త్రీత్వానికి అంకితమైన పరిమితుల్లో, అంటే జయలలిత మాదిరిగా ఒక తల్లిగా, మమతా బెనర్జీ మాదిరిగా ఒక అక్కగా మాత్రమే ప్రయత్నించాల్సి ఉంటుంది. రాజకీయాల్లో పురుషులు చేసే పొరపాట్లు, చేసే తప్పిదాలను పొరపాటునో, గ్రహపాటునో మహిళలు గనుక చేస్తే వారి రాజకీయ జీవితం అక్కడితో అంతమైపోయినట్టే లెక్క. పొరపాటున ఒక ఇ-మెయిల్‌ పంపినందుకు హిల్లరీ క్లింటన్‌ రాజకీయ జీవితం ఎలా సమాప్తమైందో అందరికీ గుర్తుండే ఉంటుంది. రాజకీయ రంగంలో మహిళలు ఎక్కువ కాలం కొనసాగడమనేది చాలా కష్టసాధ్యమైన విషయం.
ఇది ఇలా ఉండగా, పి.ఆర్‌.ఎస్‌ లేజిస్లేటివ్‌ రిసెర్చ్‌ ప్రకారం, రాజకీయ సంబంధమైన జయాపజయాల్లో, ముఖ్యంగా ఎన్నికల్లో విజయం సాధించడంలో పురుషులకు, మహిళలకు మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. పని తీరులోనే కొద్దిగా తేడా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, చట్టసభల్లో మహిళల హాజరు శాతం పురుషులతో పోలిస్తే కాస్తంత తక్కువగా ఉంటుంది. ఇక చట్టసభల్లో చర్చల్లో పాల్గొనే విషయంలో కూడా మహిళలు పురుషుల కంటే కాస్తంత వెనుకబడి ఉంటున్నారు. ఉదాహరణకు, సగటున పురుషులు 42 పర్యాయాలు చర్చల్లో పాల్గొంటే మహిళలు 35 పర్యాయాలు చర్చల్లో పాల్గొనడం జరుగుతోంది. కొన్ని అంశాలు మాత్రమే మహిళలకు అనువుగా ఉంటాయి. కొన్ని సమస్యల విషయంలో మాత్రమే మహిళలు ధారాళంగా మాట్లాడగలుగుతారు. మహిళలు సాధించలేనిది ఏదీ లేదని పురుష నాయకులు తరచూ చెబుతూ ఉంటారు కానీ, ఆచరణలో ఇది సాధ్యమైన విషయంగా కనిపించడం లేదు. మహిళలు ఏది సాధించాలన్నా ఆటంకాలు, అవరోధాలు బాగా ఎక్కువగా ఉంటాయన్నది కాదనలేని వాస్తవం. మహువా మొయిత్రా వంటి సంపన్నులు, వాగ్ధాటి కలిగిన, జనాకర్షణ కలిగిన మహిళలు కూడా తాము అర్ధరాత్రి వేళ ఎవరికి ఫోన్లు చేస్తున్నది చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలను కేవలం రిజర్వేషన్ల ద్వారా పరిష్కరించలేం. సమాజం మారితే తప్ప, పురుషుల్లో మార్పు వస్తే తప్ప, మహిళలు తాము చేరవలసిన గమ్యాన్ని పురుషులతో సమానంగా, చేరుకోవడం కష్టమే అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News