Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Women: మహిళల పరువు, గౌరవానికి ప్రాధాన్యం

Women: మహిళల పరువు, గౌరవానికి ప్రాధాన్యం

ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం

తమకు పిల్లలు కావాలా, వద్దా అని నిర్ణయించుకునే అధికారం మహిళలకు ఉండాలని, అది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలన్నిటికీ కేంద్ర బిందువని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించడానికి కారణం ఉంది. సుమారు 25 వారాల గర్భంతో ఉన్న ఒక మహిళ తనకు గర్భస్రావం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని పిటిషన్‌ పెట్టుకున్నప్పుడు గుజరాత్‌ హైకోర్టు దీన్ని తిరస్కరించడం, పైగా 12 రోజులు ఆలస్యంగా తీర్పు ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆమె అభ్యర్థన విషయంలో సుప్రీంకోర్టు త్వరిత గతిన స్పందించింది. మెడికల్‌ బోర్డుతో సమీక్ష చేయించింది. సుమారు 27 వారాల తన గర్భాన్ని తొలగించుకోవడానికి ఆమెకు అనుమతి మంజూరు చేసింది.
ఈ పిటిషన్‌ ను పరిశీలించి, పరిష్కరించడంలో హైకోర్టు చేసిన ఆలస్యాన్ని సుప్రీంకోర్టు గట్టిగా ప్రశ్నించి, వివరణ కోరింది. ఆమె పిటిషన్‌ను తిరస్కరించడానికి కారణమేమిటో తెలియజేయాలని కూడా ఆదేశించింది. నిజానికి, అమెరికా వంటి అగ్రరాజ్యాలతో పోలిస్తే భారతదేశంలోని గర్బస్రావ చట్టాలు ఎంతో ప్రగతిశీలంగా ఉన్నాయి. ఆచరణలో మాత్రం వైద్యులు, సమాజం, న్యాయవ్యవస్థ వీలైనన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టిస్తున్నాయి. అమెరికాలో ఏ చట్టం విషయంలోనూ ఇన్ని సమస్యలు ఉండే అవకాశం లేదు. ఎవరైనా చట్టబద్ధంగా, సురక్షితంగా గర్భస్రావం చేయించుకోవచ్చు. గుజరాత్‌ మహిళకు సంబంధించిన కేసు విషయానికి వస్తే, పెళ్లి పేరుతో ఒక వ్యక్తి ఈ మహిళపై అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం కంటే ఆమె గర్భస్రావం చేయించుకునే విషయంలో అటు సమాజం, ఇటు వైద్యులు సృష్టించిన సమస్యలు ఆమెను మానసికంగా విపరీతంగా కుంగదీయడం జరిగింది.
ఆమె గర్భస్రావానికి సంబంధించి పిటిషన్‌ వేసినప్పుడు, ఆమె శిశువుకు జన్మనిస్తుందా లేక గర్భస్రావం చేయించుకుంటుందా అని వివరణ కోరుతూ హైకోర్టు ఆమెకు నోటీసు పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “అత్యాచారానికి గురైన మహిళ ఎలా గర్భాన్ని ఉంచుకుంటుంది” అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే, ఎక్కువ మంది బంధువులు, మిత్రులు, ఇతర ప్రజలు దీన్ని ఒక నైతిక కోణం నుంచి మాత్రమే పరిశీలించారు. ఆమె తన గర్భాన్ని కొనసాగించాలని, కడుపులోని శిశువును చంపడం భావ్యం కాదని, ఇది ఆమె ఆరోగ్యానికి కూడా మంచిది కాదని ఆమెకు హితవు చెప్పడం జరిగింది.
ఇటువంటి కీలక అంశాలలో దేశంలోని చట్టాలు ప్రాథమిక దశలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. నైతిక కోణం మాట అటుంచి, ఒక అన్యాయమైన, చట్టవిరుద్ధమైన వ్యవహారం జరిగినప్పుడు గర్భాన్ని తీసివేయాలనుకోవడం సహజమని, దీని విషయంలో మహిళకు స్వేచ్ఛ ఉంటుందని, ఇది మహిళల ఆత్మగౌరవానికి, పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పురుషాధిక్య సమాజంలో మహిళకు తన శరీరం మీద కూడా తనకు హక్కు ఉండదు. తన ఆత్మగౌరవంతో సమాజానికి సంబంధం ఉండదు. చట్టాలను సైతం అడ్డుకోవడం జరుగుతుంది. నీతి నియమాలనేవి వ్యక్తిగత వ్యవహారాలని, వాటిని ఇతరులపై రుద్దడం భావ్యం కాదని న్యాయవ్యవస్థకు సంబంధించినవారికి, వైద్య రంగానికి సంబంధించినవారికి గట్టిగా బోధించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News