మన దేశంలో యువజనుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యువ జనాభా పెరగడమంటే దేశంలో యువ భారతదేశంగా పరిణామం చెందుతోందన్న మాట. యువ జనాభా పెరగడమనేది దేశానికి ఒక సంపద లాంటిది. ఈ యువ జనాభాలో అత్యధిక భాగం ఇదివరకటి యువ జనాభా కంటే ఎంతో విద్యావంతులు కావడం, అనేక నైపుణ్యాలను నేర్చుకోవడం ఒక విధంగా అదృష్టమనే చెప్పాలి. జెండర్ వివక్షను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఇది చాలా గొప్ప విజయమనే భావించవచ్చు. ఇందులో కూడా చదువుకుంటున్న, సాంకేతికంగా అనేకానేక నైపుణ్యాలను ఒంటబట్టించుకుంటున్న యువతుల సంఖ్యే ఎక్కువ. వారిలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపన, ఏదో సాధించాలనే తాపత్రయం వంటివి ఇదివరకటి తరం కంటే చాలా ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. వీరికి ఆదర్శాలు, ఆశయాలున్నాయి. ఏ మార్గంలో ఏ విధంగా నడవాలో క్షుణ్ణంగా తెలుసు. జీవితం, జీవన విషయాల్లో వారికంటూ ఓ ప్రణాళిక ఉంది. ఈ ధోరణి, ఈ దృక్పథం దేశానికి ఒక సదవకాశం లాంటిది.
ఇక ప్రభుత్వాలు కూడా జెండర్ సమానత్వాన్ని సాధించాలనే ఏకైక లక్ష్యంతో సమాజంలో సరికొత్త మార్పునకు దోహదం చేసే అనేక పరిణామ, పరివర్తన చర్యలు తీసుకుని పకడ్బందీగా అమలు చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాలు, జీవనశైలి, జీవనం వంటి అంశాలలో యువతులు సాధికారికత సాధించడానికి అనేకానేక పథకాలు రూపొందించింది. బాలికల్లో విద్యను ప్రోత్సహించడానికి ‘బేటీ పడావో, బేటీ బచావో’ వంటి పథకాన్ని భారీ వ్యయంతో అమలు చేస్తోంది. యువతులకు వివిధ నైపుణ్యాలలో శిక్షణనిచ్చి, సాధికారికతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇవే కాకుండా మహిళా సాధికారికతే ఏకైక లక్ష్యంగా మరికొన్ని పథకాలను కూడా భారీగా అమలు చేయడం జరుగుతోంది. స్త్రీ పురుషుల మధ్య అంతరాలను తగ్గించడానికి, జండర్ వివక్షను రూపుమాపడానికి ప్రత్యేకంగా ‘జండర్ బడ్జెట్’ను ఏర్పాటు చేయడమే కాకుండా, దానికి కేటాయింపులను కూడా ఈ ఏడాది ఎంతగానో అధికం చేసింది. దేశాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించడానికి, వారి భాగస్వామ్యం పెరగడానికి, మన దేశంలోనే కాకుండా, ప్రపంచంలోనే వారికి ప్రాధాన్యం, ప్రాముఖ్యం పెంచడానికి నారీ శక్తి పేరుతో కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. నాలుగైదు ఏళ్ల క్రితం చేపట్టిన ఈ పథకాలన్నీ ఇప్పుడు సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి.
మహిళా శక్తికి పదను
ఇంత వరకూ వెలుగు చూడని, వెలికి రాని, నిద్రాణంగా ఉన్నమహిళా శక్తిని బయటకు తీసుకు రావడానికి భారతీయ పారిశ్రామిక సమాఖ్య (సి.ఐ.ఐ) కూడా 2013లోనే ‘ఇండియన్ విమెన్ నెట్‌వర్క్’ పేరుతో ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ నెట్‌వర్క్ ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలను కల్పించడమే కాకుండా, వివిధ అంశాలలో వారికి శిక్షణనిచ్చి, వారిలో నైపుణ్యాలు పెంచి, అర్హతలను పెంచి, వారిని సవాళ్లు ఎదుర్కొనేలా తీర్చిదిద్ది, వారు ఒక ఆర్థిక శక్తిగా ఎదగడానికి పెద్ద ఎత్తున కృషి ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ సమాఖ్యకు ఉన్న 23 శాఖల ద్వారా గత పదేళ్లుగా మహిళాభ్యున్నతికి అనేక కార్యక్రమాలను చేపడుతూ, ఆశించిన విధంగా సత్ఫలితాలను సాధిస్తూ, ఇది ఓ రికార్డు సృష్టిస్తోంది. మహిళల అనుభవాల నుంచే ఇది పాఠాలు నేర్చుకుంటోంది. ‘క్యాంపస్ నుంచి కెరీర్ దాకా’ అనే కార్యక్రమంద్వారా విద్యాసంస్థల్లోనే మహిళల్లోని శక్తియుక్తులను, ప్రతిభా పాటవాలను గుర్తించి, వారిని వారి అభిరుచులు, వారి పాటవాలకు తగ్గట్టుగా మధ్యస్థాయి వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దడం కూడా జరుగుతోంది. వీరి తీరుతెన్నులకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీల ద్వారా సేకరించి, వారి శిక్షణను కొనసాగిస్తూనే ఉండడం కూడా జరుగుతోంది.
జి-20 అధ్యక్ష స్థానాన్ని అధిరోహించడాన్ని పురస్కరించుకుని మన దేశం అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రవేశం, ప్రమేయం, భాగస్వామ్యం కల్పించడానికి గట్టి నిర్ణయం తీసుకుంది.మహిళలకు సరైన భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని గత ఏడాది బాలీలో జరిగిన జి-20 సమావవేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ స్ఫూర్తితోనే దేశంలోని ప్రతి సంస్థా పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు ఇవ్వడంతో పాటు, విదేశాలలో ఉద్యోగాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. మన దేశం మహిళాభ్యున్నతికి, దేశాభివృద్ధిలో మహిళా భాగస్వామ్యానికి పూర్తిగా కట్టుబడి ఉంది. పరిశ్రమలు, కంపెనీలు, కర్మాగారాలు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, చిన్న వ్యాపారాలు, భారీ వ్యాపారాలు వగైరాలన్నిటిలోనూ ఇకపై తప్పనిసరిగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇదే కేంద్ర ప్రభుత్వ విధానం. మహిళా సాధికారికత, సమానత్వం అనే రెండు సూత్రాలే తమ విధానమని కేంద్రం పదే పదే చెబుతోంది.
పెరుగుతున్న సాధికారికత
మహిళలు తమకు నచ్చిన రంగాలను ఎంపిక చేసుకోవడానికి, తమకు నప్పిన అంశాలలో శిక్షణ పొందడానికి, తమకు వీలైన విధంగా చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగానూ తోడ్పాటునందిస్తోంది. వాస్తవానికి అనేక టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే పురుషుల కంటే యువతులకు ఉద్యోగాలలో, ప్రాజెక్టులలో, నాయకత్వంలో, ప్రమోషన్లలో ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభం అయిపోయింది. ఇక డిజిటలీకరణ, కొత్త టెక్నాలజీల కారణంగా ఇప్పటికే జెండర్ వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది. ఇదంతా మహిళలకు ప్రత్యేకంగా సహాయం చేయడంగా భావించకుండా, వారిలోని శక్తియుక్తులను బయటికి తీసి సద్వినియోగం చేసుకోవడంగా ప్రభుత్వం భావిస్తోంది. సవాళ్లతో కూడిన కెరీర్‌లకు మహిళలను ఎంపిక చేయడమనేది ఇప్పుడు అనేక కార్పొరేట్ సంస్థలో ఒక ప్రధాన సూత్రం అయిపోయింది. అంతేకాదు, వారిని ఉద్యోగార్థులుగా పరిగణించడం అనేది ఏనాడో మటుమాయం అయిపోయింది. వారిలో నిరుద్యోగంఅనేది ఉండకూడదనేది అటు ప్రభుత్వం, ఇటు సి.ఐ.ఐ ప్రధాన ధ్యేయంగా మారిపోయింది.
ఇక మహిళలకు తగ్గట్టుగా పని తీరును మార్చడం, తద్వారా ఉత్తమ ఫలితాలను పొందడం కూడా కార్పొరేట్ సంస్థలో ఆనవాయితీగా మారిపోయింది. వారి నైపుణ్యాలు, వారి విద్యార్హతలు, వారి అవసరాలే ప్రాతిపదికగా కొత్త ఉద్యోగాలను, డిజిటల్ కార్యక్రమాలను రూపొందించడం ప్రారంభం అయింది. సేవా రంగ పరిశ్రమలు బాగా వృద్ధి చెందుతుండడంతో యువతుల నైపుణ్యాలకు, వారి అవసరాలకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇక మహిళా భాగస్వామ్యం ఫలితాలు ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతిఫలిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మన దేశం వివిధ దేశాలలో వాణిజ్య, పారిశ్రామిక, కార్పొరేట్, మార్కెటింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంటున్న కొద్దీ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. కొత్త అవకాశాలకు తగ్గట్టుగామహిళలుతమను తాము నైపుణ్యాలలో, టెక్నాలజీలలో అతి వేగంగా అప్‌డేట్ చేసుకుంటుండడాన్ని బట్టి, మహిళలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారనే విషయం తేటతెల్లమవుతోంది. ఇక ఇప్పటికే కింది స్థాయి నుంచి పైస్థాయివరకు సుమారు 13.70 లక్షల మంది ప్రజా ప్రతినిధులు మహిళా సాధికారికతకు అద్దం పడుతుండడమే కాకుండా, ప్రభుత్వాలు మహిళాభ్యున్నతికి కొత్త పథకాలను చేపట్టడంలో కూడా చేయూతనందిస్తున్నారు. మహిళలకు అవకాశాలు పెంచడంతో పాటు, వారిపట్ల సమాజంలో ఇంకా కొనసాగుతున్న పక్షపాత దృక్పథంలో, చులకనా భావంలో కూడా మార్పు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పురుషాధిక్య సమాజం కూడా మరింతగా మార్పు చెందాల్సిన, సంస్కారవంతం కావాల్సిన అవసరం ఉంది.
ఎస్.ఎస్. సంజీవరావు