Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Working hours: పని గంటలు పెంచగలమా?

Working hours: పని గంటలు పెంచగలమా?

వారానికి 70 గంటల పని

వారానికి 70 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉందంటూ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌. నారాయణ మూర్తి చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశంలో ఉత్పాదకతను పెంచడమే కాకుండా, అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలతో సమానంగా ఎదగడానికి పని గంటలను 70కి పెంచాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా 30ల ప్రాయంలో ఉన్నవారికి ఈ పనివేళలను వర్తింపజేయాల్సి ఉంటుందంటూ ఈ 77 ఏళ్ల అపర కుబేరుడు ఒకటి రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేశారు. దేశంలోని వివిధ బడా వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఎక్కువ మంది మూర్తితో ఏకీభవించడం గమనించాల్సిన విషయం.
భారతదేశం వంటి అతిపెద్ద దేశానికి, వర్ధమాన దేశానికి అయిదు రోజుల పని సంస్కృతి ఏమాత్రం సరిపడదని జె.ఎస్‌.డబ్ల్యు గ్రూపు సంస్థల చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజుకు దాదాపు 16 గంటలు పనిచేయడాన్ని ఆయన ఉదాహరణగా చూపించారు. అయితే, కొన్ని వర్గాలు ఈ అభిప్రాయాలతో ఏమాత్రం ఏకీభవించడం లేదు. ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు ఇందుకు తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తున్నారు. యువతీ యువకుల్లో కూడా గుండె సంబంధమైన వ్యాధులు ప్రబలుతుండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఉద్యోగులను వేధించడానికి, వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి ఇదొక రకమైన ఎత్తుగడ అని కూడా కొందరు అభివర్ణించారు. మహిళా ఉద్యోగులపై ఇప్పటికే భారం పెరిగిపోతోందని, ఇంటా బయటా చాకిరీతో మహిళలు విసిగి వేసారిపోతున్నారని, నిజానికి వారు వారానికి 70 గంటల కంటే ఎక్కువే పనిచేస్తున్నారని ఎడెల్‌ వైస్‌ మ్యూచువల్‌ ఫండ్ సి.ఇ.ఓ రాధికా గుప్తా ధ్వజమెత్తారు. ఇందుకు మహిళలకు సరైన గుర్తింపు కూడా లేదని ఆమె విమర్శించారు.
నారాయణ మూర్తి ఈ 70 గంటల పనివేళలను సూచించడాన్ని బట్టి, కార్పొరేట్‌ సంస్థలు మాత్రమే ఈ విధమైన ఆలోచన చేస్తున్నట్టుగా భావించాల్సిన అవసరం లేదు. ఆయన భారతీయుల ఉత్పాదన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సూచన చేయడం జరిగింది. ప్రపంచంలో భారతదేశ ఉత్పాదక సామర్థ్యం అతి తక్కువగా ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌.ఓ) అందజేసిన సమాచారం ప్రకారం, భారతదేశంలోని కార్మికుల ఉత్పాదక శక్తి (గంటకు జి.డి.పిని లెక్కగడితే) 8.47 డాలర్లు మాత్రమే. ఇది జపాన్‌ దేశంలో 39.6 డాలర్లకు పైగా ఉంది. భారతదేశం గనుక అగ్రరాజ్యాలతో పోటీపడాలన్న పక్షంలో ఈ ఉత్పాదక శక్తి జపాన్‌ కంటే ఎక్కువగా పెరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నారాయణ మూర్తి సూచనను తప్పుగా అర్థం చేసుకోవడం భావ్యం కాదు. ఉత్పాదక శక్తి పెరగడం వల్ల స్వయం ఉపాధికి కూడా అవకాశాలు పెరుగుతాయన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఉత్పాదక సామర్థ్యం పెరగడం వల్ల ఆర్థికాభివృద్ధి మరింతగా సాధ్యమవుతుంది. ఆర్థికాభివృద్ది మందగమనంతో ముందుకు సాగడానికి ప్రధాన కారణం ఉత్పాదక శక్తి తగ్గి ఉండడమే.
అయితే, కేవలం పని వేళలను, పని గంటలను పెంచినంత మాత్రాన దేశంలో ఆర్థికాభివృద్ధి జరిగి పోతుందని, అగ్రరాజ్యాలతో సమానంగా భారత్‌ కూడా పరుగులు పెడుతుందని భావించడం కూడా మంచిది కాదు. ఒక్కోసారి ఇది ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దేశంలో అవ్యవస్థీకృత రంగానికి చెందిన వారిలో 80 శాతానికి పైగా కార్మికులు, శ్రామికులు అతి దుర్భర, అధ్వాన పరిస్థితుల్లో కూడా 70 గంటకు మించి పనిచేయడం జరుగుతోంది. భారతదేశం అగ్ర రాజ్యంగా ఎదగడానికి ఈ అవ్యవస్థీకృత రంగం కార్మికుల సేవలు కూడా ఎంతగానో ఉపయోగ పడుతున్నాయన్నది విస్మరించలేని విషయం. దేశం ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా, అగ్రరాజ్యాలతో పోటీపడాలన్నా అనేకానేక ఆర్థిక, కార్మిక సంస్కరణలు అవసరం.
కేంద్ర ప్రభుత్వానికి ఆ సంగతి క్షుణ్ణంగా అర్థమైంది. కొత్త సంస్కరణలను రూపొందించే ప్రయత్నం చురుకుగా జరుగుతోంది. కార్మికులకు సంబంధించి కొత్త నియమ నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చే ఉద్దేశంలో ఉంది. కార్మిక భద్రతను, యోగక్షేమాలను, పనితీరును, పనికి సంబంధించిన పరిస్థితులను, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పనిని ఒకే వ్యక్తి చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని, నైపుణ్య వంతులైన ఉద్యోగులను తయారు చేయడం వల్ల ఉత్పాదకత తప్పకుండా పెరుగుతుంది. భారతదేశానికి ఇదే చాలా అవసరం అని గ్రహించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News