Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్World Adivasi Day: ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోని ఆదివాసీలు

World Adivasi Day: ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోని ఆదివాసీలు

అభివృద్ధిలో ఆదివాసీలు ఎందుకు వెనుకబడుతున్నారు?

ఆదివాసీలు… ఎక్కడో కొండకోనల్లో బతుకుతుంటారు. ప్రకృతితో మమేకమైన బతుకులు వారివి. డోలు చప్పుళ్లు, నృత్యాలు, గుస్సాడి వేషధారణల మేళవింపు ఆదివాసీల జీవన శైలి.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆదివాసీల జీవితాల్లో చెప్పుకోదగిన అభివృద్ధి అంటూ ఏమీ కనిపిం చదు. దేశవ్యాప్తంగా వేలాది గిరిజన గ్రామాలు కనీస వసతులకు దూరంగానే ఉన్నాయి. భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూహాలు గిరిజన తెగలు. ప్రతి సమూహానికి సామాజికపరంగా, సాంస్కృతిపరంగా అనేక ప్రత్యేకతలున్నాయి. గిరిజన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆచారాలు, వేసుకునే దుస్తులు… అంతా మైదాన ప్రాంతాల్లోని ప్రజలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోని 90కి పైగా దేశాలలో ఆదివాసీలు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల జనాభా దాదాపు 37 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలందరూ ఒక తెగకు చెందినవారు కాదు.
అడవిబిడ్డల్లో దాదాపు 5000 విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి. వీరందరికీ కలిపి దాదాపు ఏడు వేల భాషలు ఉన్నాయి. చాలా వాటికి లిపి ఉండదు. మనదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలో ఆదివాసీలున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. జార్ఖండ్‌ మొత్తం జనాభాలో గిరిజనులే 28 శాతం మంది ఉన్నారు. అలా అని, అందరూ ఒకే తెగకు చెందిన ఆదివాసీలు కారు. సంతాల్‌, బంజారా, బిహోర్‌, చెరో, గోండ్‌ ఖోండ్‌ లోహ్రా వంటి 32 విభిన్న గిరిజన తెగలు జార్ఖండ్‌లో ఉన్నాయి. వీటిలో సంస్కృతి వారిదే. ఎవరి ఆచార వ్యవహారాలు వారివే. అయితే ఈ తేడాలు ఎలా ఉన్నా ఆదివాసీలది భిన్నత్వంతో ఏకత్వం.
అభివృద్ధిలో వెనుకబడ్డ ఆదివాసీలు
భారతదేశంలో ఆదివాసీలు ఇప్పటికీ బాగా వెనుకబడి ఉన్నారు. అభివృద్ది ఫలాలకు దూరంగా ఉన్నారు. ఆది వాసీల హక్కులకు పూచీకత్తుగా ఉండాల్సిన పాలకులు ఆ బాధ్యతను విస్మరించారు. అభివృద్ది పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో గిరిపుత్రుల హక్కులు కొట్టుకుపోతున్నాయి. అడవి బిడ్డల ఉనికి కోసం రూపొందించిన ఒన్‌ ఆఫ్‌ సెవెంటీ చట్టాన్ని, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇంతటి కీలకమైన చట్టాన్ని పక్కన పడేశారన్న విమర్శలున్నాయి. అడవులపై ఆదివాసీలు క్రమక్రమంగా పట్టు కోల్పోతున్నారు. పుట్టి పెరిగిన అడవికే గిరిపుత్రులు పరాయివారవుతున్నారు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అడవి బిడ్డల భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో 1982 ఆగస్టు తొమ్మిదిన ఐక్య రాజ్యసమితిలో ఆదివాసీలకు సంబంధించి ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపుగా 140 దేశాలు పాల్గొన్నాయి. ఆదివాసీల హక్కులను కాపాడాలని ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. అలాగే గిరిపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించాలన్న డిమాండ్‌ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. సమితి సమావేశానికి హాజరైన దాదాపు అన్ని దేశాలు ఈ డిమాండ్‌కు ఓకే అన్నాయి. ఈ పరిస్థితుల్లో, 1994 లో అమెరికాలో తొలిసారిగా గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది, ఆగస్టు తొమ్మిదో తేదీన వరల్డ్‌ ట్రైబల్‌ డేను నిర్వహించుకునే ఆనవాయితీ మొదలైంది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1994 ఏడాదిని మొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీల సంవత్సరంగా ప్రకటించింది.
ప్రాజెక్టుల్లో కొట్టుకుపోతున్న గిరిపుత్రుల హక్కులు
ఆదివాసీల హక్కులకు మన రాజ్యాంగం పూచీకత్తుగా నిలుస్తోంది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో గిరిపుత్రుల హక్కులను పొందుపరిచారు. ఐదో షెడ్యూల్‌ను అనుసరించి, గిరిజనుల హక్కులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చారు. 1950లో ఐదో షెడ్యూల్‌ ప్రాంతాలను గుర్తించి, రాష్ట్రపతి వాటిని నోటిఫై చేశారు. అయి తే దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గిరిజన కుటుంబాలు ఉండి కూడా, ఐదో షెడ్యూల్‌ జాబితాలోకి రాని గిరిజన గ్రామాలు వేలాదిగా ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ ఇవాళ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆనకట్టల నిర్మాణం, వన్యప్రాణి సంరక్షణ పార్కులు, రిజర్వ్‌ ఫారెస్ట్‌, అభివృద్ధి పేరుతో ఎడాపెడా అడవుల నరికివేత…. ఇలాంటివి జరిగినప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండాలన్న స్పష్టతను రాజ్యాంగంలో పేర్కొన్నారు. అయితే వీటిని పట్టించుకునే తీరికా, ఓపికా పాలకులకు లేకుండా పోయాయి. ఆదివాసీ ప్రాంతాల సంక్షేమం కోసం ప్రతి ఏడాది సలహా మండళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని తీర్మానాలు పంపుతుంటాయి. అయితే, ఆ తీర్మానాలు డస్ట్‌బిన్‌లకే పరిమితమవుతున్నాయి. ఆదివాసీల సాగులో ఉన్న అటవీ భూములకు హక్కుల విషయంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దే పేరుతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006ను ప్రభుత్వాలు రూపొందించాయి. ఆ తరువాత, ఆది వాసీ గ్రామసభలకు స్వీయ పరిపాలనా హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన పంచాయితీ రాజ్‌ షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ చట్టం…పెసా 1996లో అమల్లోకి వచ్చింది. అయితే ఇన్ని పకడ్బందీ చట్టాలున్నా, అవి అమలుకు నోచుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆదివాసీలపై పాలకులకు ఉన్న చిన్నచూపే. మనదేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒక వైపు విచ్చలవిడిగా అడవులను నరికి వేస్తుంటారు. మరో వైపు హరితహారం పేరుతో కాసిన్ని మొక్కలు నాటుతుంటారు. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత చాలా కాలంగా యధేచ్ఛగా సాగుతుంది. ఏడాదికేడాది అడవుల విస్తీర్ణం తరిగిపోతోంది. అడవుల నరికివేత ప్రభావం, మొట్టమొదట పడేది ఆదివాసీలపైనే. అడవులనే నమ్ముకుని బతికే గిరిపుత్రులు కాలక్రమంలో నిర్వాసితులవుతారు. వేరే చోట, ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వాలు పెద్ద పెద్ద హామీలు ఇస్తుంటాయి. అయితే ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులైన ఆదివాసీలకు పక్కా ఇళ్లు కట్టించే ఇచ్చేటప్పటికి ఏళ్లూ పూళ్లూ పడుతున్నాయి. చెట్ల నరికివేతపై పర్యావరణ వేత్తలు చాలా సార్లు ప్రభుత్వాలను హెచ్చరించారు. ఎన్వి రాన్‌ మెంటల్‌ బ్యాలెన్స్‌ లేకపోతే వాతావరణంలో సంభవించే పెనుమార్పులను వివరించారు. అభివృద్ధితో ముడిపెట్టి చెట్లను నరికివేయడం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పారు. అయినా పర్యావరణంపై ప్రభుత్వాల వైఖరిలో పెద్దగా మార్పు రాలేదు. తెగి పడుతున్న చెట్ల సంఖ్యను చూస్తుంటే సమాజం అభివృద్ధి పేరిట వినాశనం వైపు పరుగు తీస్తున్నట్లుగా ఉందని అని పర్యావరణ వేత్తలు అంటున్నారు. అడవుల నరికివేత పట్ల పాలకుల వైఖరి మారకపోవడంపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పోడు భూముల వివాదానికి ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. పోడు భూముల సమస్యను గుర్తించాలంటే, ముందుగా గిరిపుత్రులు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో సర్వే నిర్వహించాలి. అయితే సర్వే జరగకపోవడంతో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌ జిల్లాల్లోని అడవుల్లో పోడు రైతులు, ఫారెస్ట్‌ ఆఫీసర్ల మధ్య తరచూ యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఆదివాసీల జీవన స్థాయిని పెంచడానికి పాలకులు చేయాల్సింది ఎంతో ఉంది. ముందుగా రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో పొందుపరచిన ఆదివాసీల హక్కులను పక్కాగా అమలు చేయాలి. గిరిజనుల స్వయంపాలన, విద్యా, ఆర్థిక సాధికారత సాధనకు పాలకులు చిత్తశుద్ధితో పనిచేయాలి. అప్పుడే ఆడవిబిడ్డలకు న్యాయం చేసినవారవుతారు.
ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌

  • 63001 74320
    (నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News