Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్World Environmental Health Day: పర్యావరణ ఆరోగ్యమే మానవాళికి మహాభాగ్యం

World Environmental Health Day: పర్యావరణ ఆరోగ్యమే మానవాళికి మహాభాగ్యం

ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని ప్రతిరోజు పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి

ఇటీవల కాలంలో హవాయి అడవులలో కార్చిచ్చు, లిబియా, ఉత్తర భారత దేశ రాష్ట్రాలలో వరదలు, కొన్ని ఆఫ్రికా దేశాల్లో కరువు కాటకాలకు కారణం మన పర్యావరణంలో వచ్చే అసమతుల్యతలే అని ఒప్పుకోక తప్పదు. భూమి మీద ఉండే జీవ, నిర్జీవుల సమాహారాన్నే పర్యావరణం అని అంటారు. పర్యావరణంలో మానవుడు ఒక భాగం మాత్రమే. మన చుట్టూ ఉండే పర్యావరణం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన శారీరక , మానసిక ఆరోగ్యం అంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. పర్యావరణ ఆరోగ్యం అంటే నేల, జల, వాయువుల్లో ఉండే మిశ్రమాలు కాలుష్యం లేకుండా ఉండడమే. ఒక ప్రాంతం యొక్క పర్యావరణ ఆరోగ్యము ఆ ప్రాంతం యొక్క కాలుష్య స్థాయి, జీవావరణంలో వైవిధ్యం, పరిశుభ్రమైన త్రాగునీరు అందుబాటు, పారిశుద్ధ్య పరిస్థితులు, వ్యవసాయ ఉత్పాదకత మీద ఆధారపడి ఉంటుంది. పర్యావరణ ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌ 26వ తేదీన అన్నీ దేశాలు ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతాయి. అంతర్జాతీయ పర్యావరణ ఆరోగ్య సమాఖ్య ( ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్విరాన్మెంటల్‌ హెల్త్‌ – ఐ.ఎఫ్‌. ఈ.హెచ్‌ ) ఆధ్వర్యంలో 2011 వ సంవత్సరము నుండి ఈ దినాన్ని పాటిస్తున్నారు. ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని ప్రతిరోజు పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి అనేది ఈ సంవత్సరం థీమ్‌. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం ఒక కోటి అరవై లక్షలకు పైగా ప్రజలు మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత పది సంవత్సరాల నుండి చూస్తే వాతావరణంలో వేడి పెరుగుతూ వస్తుంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెంటిగ్రేడ్‌ పెరిగింది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ పెరిగాయి. ఆర్కిటిక్‌ ప్రాంతంలో శాశ్వతమంచు కరుగుతూ వస్తుంది. పట్టణీకరణ, పంటలు, పశువుల పెంపకానికి, కాగితాలు తయారు చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక కోటి హెక్టార్లకు పైగా అటవీ నిర్మూలన జరుగుతుంది. ఇది భూతాపానికి కారణం అవు తుంది. వాయు కాలుష్యం వలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 42 లక్షల నుంచి 70 లక్షల వరకు ప్రజలు మరణిస్తున్నారు. ప్రతి పది మందిలో తొమ్మిది మంది అధిక స్థాయి కాలుష్య కారకాల ఉన్న గాలిని పీల్చుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. వాతావరణంలోని మార్పులు సూక్ష్మజీవుల మనుగడను కూడా ప్రభావితం చేయడమే కాకుండా వైరస్ల వ్యాప్తిని సులభతరం చేయడానికి దోహదపడుతుంది. జల కాలుష్యం వలన సముద్రం యొక్క నీటిమట్టం సంవ త్సరానికి సగటున 3.2 మిల్లీ మీటర్లు పెరుగుతున్న కారణంగా సముద్ర తీర ప్రాంతం ముంపునకు గురై అక్కడ నివాసం ఉండే సుమారు 34 నుండి 48 కోట్ల ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వలసలు వెళ్లడం వలన వారు వెళ్లే ప్రాంతాల్లో జనాభా పెరగడమే కాకుండా అక్కడ ఉండే వనరులు అధిక వినియోగానికి గురవుతున్నాయి. అంతేకాక సముద్రాలలో నివసించే చేపలు, క్షీరదాలు, సరీసృపాలు, ఉభయ చరాల జనాభా పరిమాణము 1970 మరియు 2016 సంవత్సరాల మధ్యలో సగటున 68 శాతం క్షీణించాయని ప్రపంచ వన్య ప్రాణి నిధి తెలిపింది. వరదలు, తుఫానుల వలన నేల కోతకు గురవుతుంది. రసాయనక ఎరువుల వాడటం, మితి మీరిన గనుల త్రవ్వకం నేల కాలుష్యానికి కారణాలవుతున్నాయి. యేల్‌, కొలంబియా విశ్వవిద్యాలయాలు 180 దేశాల పర్యావరణ పనితీరుకు సంబంధించి ఎన్విరాన్మెంటల్‌ పెర్ఫార్మన్స్‌ ఇండెక్స్‌ను విడుదల చేశాయి. ఈ జాబితాలో 77.90 స్కోర్‌తో డెన్మార్క్‌ మొదటి స్థానంలో నిల వగా, యునైటెడ్‌ కింగ్డమ్‌, ఫిన్లాండ మాల్టా, స్వీడన్‌ దేశాలు తర్వాత నాలుగు స్థానాలలో నిలిచాయి. ఈ జాబితాలో ఇండియా 180 వ స్థానంలో ఉంది. పర్యావరణ ఆరోగ్యానికి మనం చెయ్యాల్సిన పనులు… వాహనాలకు వాడే పెట్రోలులో ఇథనాల్‌ శాతం పెంచాలి. విద్యుత్‌ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. హరిత వాయువులు విడుదల చేసే పరిశ్రమలను మూసివేయాలి. నిబంధనలు పాటించని వారిపై చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలి. కార్బన్‌ పన్నులు విధించాలి. పంటలలో రసాయనక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రీయ పద్దతులలో వ్యవసాయాన్ని చేపట్టాలి. అటవీ నిర్మూలనను అడ్డుకోవాలి. అక్రమ మైనింగ్‌ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి. కాగితం నుండి డిజిటల్‌ కు మారాలి. సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్లను నిషేధించాలి. నీటి కాలుష్యాన్ని ఆపాలి. నదుల అనుసంధానం చేయడం వలన వరదల ప్రభా వాన్ని తగ్గించవచ్చు. ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజలలో చైతన్యం కలిగించాలి. పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యమై మనందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

- Advertisement -

– జనక మోహన రావు దుంగ

8247045230

(నేడు ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News