World Food Day 2025: గాదెలు నిండుగా ఉన్నాయి… గొంతులు మాత్రం ఎండుకుపోతున్నాయి. ఈ వాక్యం ఒక అలంకారం కాదు, ఇది నేటి ప్రపంచపు నగ్న సత్యం. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన అత్యంత క్రూరమైన వైరుధ్యం.
“ఆకలి కేకల ఆరణ్యం నుంచే ఉద్భవిస్తుంది విప్లవాగ్ని“
ప్రపంచ ఆహార దినోత్సవం నాడు, దాతృత్వం గురించి, చారిటీల గురించి మాట్లాడటం, రోగికి జబ్బు మూల కారణాన్ని చెప్పకుండా, పైన పూత పూయడం లాంటిది. మనం ఆకలి గురించి కాదు, దోపిడీ గురించి మాట్లాడాలి. ఆహార కొరత గురించి కాదు, ఆహారాన్ని నియంత్రించే దోపిడీ వర్గాల గురించి మాట్లాడాలి. ఆకలి అనేది ప్రకృతి వైపరీత్యం కాదు, అది రాజ్యం, పెట్టుబడి చేతిలో పీడిత ప్రజలపై ప్రయోగించే ఒక శక్తివంతమైన ఆయుధం. అది ఒక వర్గపోరాట సాధనం.
చరిత్ర నెత్తుటి పుటల్లో.. రాజ్యం సృష్టించిన కరువులు : చరిత్రను పాలకవర్గాలు తమకు అనుకూలంగా రాసుకుంటాయి. కరువులను ప్రకృతి వైపరీత్యాలుగా, జనాభా పెరుగుదల ఫలితాలుగా చిత్రీకరిస్తాయి. కానీ నిజం వేరు.
బెంగాల్ మహాక్షామం (1943): ఇది కరువు కాదు, అది బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేసిన హత్య. బెంగాల్‌లో ఆహారం ఉంది, కానీ ఆ ఆహారాన్ని యుద్ధ అవసరాల కోసం సైన్యానికి తరలించారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచి, సామాన్యుడికి అన్నం దొరక్కుండా చేశారు. 30 లక్షల మంది మరణం, బ్రిటిష్ పెట్టుబడి లాభాల పునాదుల కింద సమాధి చేయబడింది. అది “failure of entitlement” అని అమర్త్య సేన్ వంటి మేధావులు సున్నితంగా చెబితే, అది పచ్చి దోపిడీ, వ్యవస్థీకృత నరమేధం అని మేము చెబుతాం.
స్టాలిన్ హోలోడోమోర్ (ఉక్రెయిన్, 1932-33): సోషలిజం పేరుతో స్టాలిన్ చేసిన ఘోర తప్పిదాలకు ఇది నిలువుటద్దం. వ్యవసాయ సమిష్టీకరణను వ్యతిరేకించిన రైతుల (కులాక్స్) తిరుగుబాటును అణచివేయడానికి, వారిని శత్రువులుగా ప్రకటించి, వారి నుంచి ఆహారాన్ని బలవంతంగా లాక్కున్నారు. ఇది కేవలం ఆర్థిక విధాన వైఫల్యం కాదు, ఒక వర్గాన్ని నిర్మూలించడానికి, వారి రాజకీయ ప్రతిఘటనను అణచివేయడానికి రాజ్యం ప్రయోగించిన క్రూరమైన హింస.
ఈ చారిత్రక ఉదంతాలు ఒకే సత్యాన్ని చెబుతున్నాయి: రాజ్యం ఎప్పుడూ తటస్థంగా ఉండదు. అది ఎల్లప్పుడూ పాలకవర్గ ప్రయోజనాలనే కాపాడుతుంది. ఆహార సరఫరాను నియంత్రించడం ద్వారా, ప్రజల జీవన్మరణాలను శాసించే శక్తిని రాజ్యం తన చేతుల్లో ఉంచుకుంటుంది.
నేటి సామ్రాజ్యవాద రూపాలు: సూడాన్, గాజా : ఆ పాత వ్యూహాలే నేడు కొత్త రూపాల్లో, మరింత క్రూరంగా మన కళ్ల ముందే ఆవిష్కృతమవుతున్నాయి.
సూడాన్ (డార్ఫూర్): ఇక్కడ జరుగుతున్నది అంతర్యుద్ధం కాదు, అది వనరుల కోసం, ఆధిపత్యం కోసం జరుగుతున్న సామ్రాజ్యవాద శక్తుల ప్రాక్సీ యుద్ధం. సైనిక దళాలు, ప్రత్యర్థి వర్గాల ప్రజలను లొంగదీసుకోవడానికి ఆకలిని ఒక యుద్ధ తంత్రంగా ఉపయోగిస్తున్నాయి. పంట పొలాలను తగలబెట్టడం, ధాన్యాగారాలను నాశనం చేయడం, మానవతా సహాయాన్ని అడ్డుకోవడం… ఇవన్నీ ప్రజల ప్రతిఘటనా శక్తిని దెబ్బతీసే పక్కా ప్రణాళిక.
గాజా (పాలస్తీనా): ఇక్కడ ఆహారం, దశాబ్దాలుగా జియోనిస్ట్ ఆక్రమణతో, సామ్రాజ్యవాద అణచివేతతో పెనవేసుకుపోయింది. ఇది కేవలం ఆహార దిగ్బంధనం కాదు, అది పాలస్తీనియన్ల అస్తిత్వంపై, వారి ప్రతిఘటనపై జరుగుతున్న దాడి. వ్యవసాయ భూములపై బాంబులు వేయడం, నీటి వనరులను ధ్వంసం చేయడం, తరతరాలుగా జీవనాధారమైన జైటూన్ (ఆలివ్) తోటలను పెకిలించడం, మత్స్యకారులను వారి సముద్ర జలాల్లోకి వెళ్లకుండా ఆంక్షలు విధించడం… ఇవన్నీ వారి ఆహార సార్వభౌమాధికారాన్ని నిర్మూలించే ప్రయత్నాలే. “ఇది కేవలం ఆకలి కాదు, ఒక జాతి తమకు తాముగా ఆహారాన్ని పండించుకునే, సేకరించుకునే, తినిపించుకునే సామర్థ్యాన్ని వ్యవస్థీకృతంగా నాశనం చేయడం.”
సమృద్ధిలో పేదరికం: పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం : ఆహారాన్ని ఆయుధంగా వాడటం కేవలం యుద్ధ క్షేత్రాలకే పరిమితం కాదు. ధాన్యాగారాలు నిండి పొర్లుతున్న మన దేశం వంటి దేశాల్లోనూ, కోట్లాది మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇది ‘సమృద్ధిలో పేదరికం’ (Paradox of Plenty) అనే వింత వైరుధ్యం.
పంపిణీలో లోపం కాదు, దోపిడీలో నైపుణ్యం: సమస్య ఉత్పత్తిలో లేదు, పంపిణీ వ్యవస్థలో ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లోని లొసుగులు, అవినీతి, దళారీ వ్యవస్థ, లాభాపేక్షతో పనిచేసే మార్కెట్లు.. ఇవన్నీ ఆహారానికి, ఆకలితో ఉన్నవారికి మధ్య అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి.
హరిత విప్లవం – కొత్త బానిసత్వం: 1960లలో హరిత విప్లవం మనల్ని ఆహార కొరత నుంచి గట్టెక్కించింది. కానీ, అదే సమయంలో అది రైతును హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల కంపెనీలకు బానిసను చేసింది. రైతు విత్తన సార్వభౌమాధికారాన్ని కోల్పోయాడు. ఇది కూడా ఒక రకమైన నియంత్రణే.
నేటి పోరాటం: ఇటీవల మనం చూసిన రైతు ఉద్యమాలు కూడా ఈ ఆధిపత్య పోరులో భాగమే. తమ పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే హక్కు, తమ భూమిపై అధికారం కోసం రైతులు చేస్తున్న పోరాటం, ఆహార సార్వభౌమాధికారం కోసం చేస్తున్న పోరాటమే. FCI గోదాములలో లక్షలాది టన్నుల ధాన్యం పురుగుల పాలవుతుంటే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మన దేశం అట్టడుగున ఉండటం, ఈ వ్యవస్థీకృత వైఫల్యానికి నిలువుటద్దం.
ఆహారం హక్కుగా మారే వరకు : “ఆకలి అనేది అనివార్యం కాదు. అది యుద్ధం, విధానాలు, నిర్లక్ష్యం ద్వారా పాలకులు తీసుకునే ఓ రాజకీయ నిర్ణయం.” “చేతులు కలుపుదాం” అనేది ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవం నినాదం. కానీ, అసమానతల పునాదులపై నిజమైన సహకారం సాధ్యం కాదు. ఆకలిని నిర్మూలించాలంటే, దానిని సృష్టిస్తున్న రాజకీయ, వ్యవస్థీకృత శక్తులను ఎదుర్కోవాలి. సూడాన్, గాజాలలో జరుగుతున్నది మానవతా ప్రమాదాలు కావు, ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న కరువులని ప్రపంచం గుర్తించాలి. ఆహారాన్ని దాతృత్వ సమస్యగా కాకుండా, న్యాయానికి, మానవ హక్కులకు సంబంధించిన అంశంగా చూడాలి.
చిన్న రైతులు, మత్స్యకారులు, స్థానిక ఆహార వ్యవస్థలను కాపాడుకోవాలి. భూ హక్కులను పరిరక్షించాలి. వాణిజ్య, సహాయక విధానాలు అసమానతలను పెంచేవిగా ఉండకూడదు. ఫ్రెంచ్ విప్లవానికి రొట్టె ముక్క నిప్పురవ్వ అయినట్లు, అరబ్ స్ప్రింగ్‌ను ఆహార ధరలు మండించినట్లు, నేటి సంక్షోభాలు మనకు ఒకటే గుర్తుచేస్తున్నాయి: ప్రజలకు ఆహారాన్ని నిరాకరించినప్పుడు, ప్రభుత్వాల స్థిరత్వమే కూలిపోతుంది. ఆహారం అనేది కొందరి అదృష్టం కాదు, అది ప్రతి ఒక్కరి హక్కుగా మారినప్పుడే, నిజమైన ‘మంచి భవిష్యత్తు’ సాధ్యమవుతుంది. రొట్టె ముక్క అధికారానికి ఆయుధంగా ఉన్నంత కాలం, ప్రపంచంలో శాంతి అసాధ్యం. అన్నం హక్కుగా మారినప్పుడే, మానవత్వం బతుకుతుంది.


