Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్World hunger politics: ఆకలిపై అవిశ్రాంత పోరాటం

World hunger politics: ఆకలిపై అవిశ్రాంత పోరాటం

ఈమధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘గ్లోబల్ హంగర్ వాచ్’ నివేదిక భారత్ తో సహా వివిధ దేశాలలో అనేక ప్రశ్నలు, సందేహాలు ఉత్పన్నం చేయడంతో పాటు సంచలనం కూడా సృష్టించింది. ఇందులో మన దేశానికి సంబంధించినంత వరకు, దేశంలో ఆకలి, పౌష్టికాహార లోపం, ఆహార కొరత, నకిలీలు, కల్తీల విషయంలో ప్రభుత్వాలు చెబుతున్నదొకటి, జరుగుతున్నదొకటి అనే అనుమానం కలిగే విధంగా ఆ నివేదిక అనేక వివరాలు అందించింది. భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీగా అభివృద్ధి చెందుతోంది. కోవిడ్ సమయంలో భారతదేశ ప్రజలనే కాక, అనేక ఇతర దేశాల ప్రజలను కూడా ఆదుకున్న మాట కూడా నిజమే. యు.పి.ఐ వంటి టెక్నాలజీ సంబంధిత ఆవిష్కరణల్లో కూడా ముందుండి, ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంది. ఇక చైనాకు ధీటుగా విదేశీ పెట్టుబడులను కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. ఇటువంటి దేశం ఆకలి సూచీలో మాత్రం అట్టడుగున ఉండడంలో అర్థం ఉందా?

- Advertisement -

భారదేశంలో పేదలెవరు? వారి స్థితిగతులేమిటి? దేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నా పేదల పరిస్థితిలో ఆశించినంత మార్పు రాకపోవడానికి కారణమేమిటి? ఇటువంటి ప్రశ్నలపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో పేదలెవరు అనేది తెలుసుకోవడం లేదా అంచనా వేయడం మాత్రం అంతుబట్టని విషయం. ఇదివరకు మనుషులు తీసుకునే ఆహారాన్ని కేలరీలలో లెక్కగట్టేవాళ్లు. సుమారు 2,400 కేలరీలు అవసరమని లెక్క కట్టి, వాటి మూల్యం ఇన్ని రూపాయలని లెక్కించడం అర్థరహితమని తేలిపోయింది. కేలరీలు మారిపోయాయి. రూపాయి విలువా మారి పోయింది. పైగా మనుషులు పూర్తిగా కేలరీల మీదే ఆధారపడి బతకడం లేదు. వాళ్లకు కూడుతో పాటు గుడ్డ, గూడు కూడా అవసరమే. అందువల్ల కేలరీలతో పేదరికాన్ని గణించడం సరైన విధానం కాదు.

రోజుకు కనీసం 1.90 డాలర్ల ఆదాయం అయినా ఉండాలని ప్రపంచ బ్యాంకు ఒకప్పుడు నిర్దేశించింది. అంటే, భారతదేశ నగదు ప్రకారం అది రోజుకు 160 రూపాయలన్నమాట (ఇంట్లో నలుగురుంటే 640 రూపాయాలు). నెలకు 19,200 రూపాయలు. సంవత్సరానికి 2.3 లక్షల రూపాయలు. నిజానికి ఇటువంటి విషయాల్లో ప్రపంచానికంతటికీ ఒకే కొలబద్ధను ఉపయోగించటం సమంజసం కాదు. రూపాయి విలువ, డాలర్ విలువ మారిపోతుంటాయి. వాటి విలువలో హెచ్చతగ్గులుంటాయి. ఇక ఆదాయ పన్నును బట్టి పేదల పరిస్థితిని గణించడం కూడా అశాస్త్రీయమే. ఆదాయ పన్నును చెల్లించేవారి సంఖ్య చాలా తక్కువ. పైగా మనదేశంలో గ్రామాల్లో పన్నులు చెల్లించడమనేది ఉండదు. అందువల్ల మన దేశంలో పేదలను బలహీనవర్గాలని, అట్టడుగు వర్గాలని గుర్తించి వారి కోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతోంది. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి, ఇటువంటి పేదలను మందులతోనూ, నగదు బదిలీలతోనూ ఆదుకుంది. పేదల కనీస అవసరాలను అర్థం చేసుకుని, వారికి సకాలంలో అండగా నిలబడడం నిజంగా ప్రశంసనీయ విషయమే. అయితే, ఈ కార్యక్రమంలో విద్యకు, ఆరోగ్యానికి, గుడ్డకు, గూడుకు స్థానం లేకుండా పోయింది.

సమన్వయం, సహకారం

కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద 80 కోట్ల మంది బలహీన వర్గాలను కోవిడ్ సమయంలో ఆదుకుందని ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు సైతం అంగీకరించాయి. సుమారు 139 కోట్ల మంది ప్రజల్లో 80 కోట్ల మంది పేదలనున్నారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టయింది.

మరో విషయమేమిటంటే, ఈ ఏడాది ఆఖరు వరకూ ఈ సహాయ కార్యక్రమాలన్నిటినీ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించుకుంది. అంటే, దేశంలోని పేదల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కాక, సుమారు 14 కోట్ల మందిని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆదుకోవడం జరుగుతోంది. మొత్తం మీద దేశంలో 30 శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారన్నది తేలిపోయింది. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద కేంద్రం ఏటా సుమారు 70,000 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం మీద వ్యయం చేస్తోందంటే గ్రామాల్లో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దేశంలో నెలకు 10 వేల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పట్టణ పేదల గురించి చెప్పనక్కర లేదు.

పేదరికాన్ని మదింపు చేస్తున్నది కేవలం కుటుంబంలో ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకునే. ఇంట్లో నలుగురుంటే అటువంటి పేదల జీవన స్థితిగతులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ పేదలు, పట్టణ పేదల కోసం ఎన్ని పథకాలను రూపొందించినా, ఎన్ని కార్యక్రమాలను చేపడుతున్నా ఇటుంటి పేదల సంఖ్య ఆయేటికాయేడు పెరుగుతుండడం నిజంగా విచిత్రమైన విషయం. టెక్నాలజీ కారణంగా పేదలకు నేరుగా సహాయం అందుతున్నా, లీకేజీలను అడ్డుకోవడం గగనమైపోతోంది. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటంటే, ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేయక తప్పదు. ప్రభుత్వం సంక్షేమ రాజ్యంగా కూడా మారాల్సిన అవసరం ఉంది.

సంపద సృష్టితో పాటు, ఉపాధి సృష్టి మీద కూడా మరింత తీవ్రంగా దృష్టి కేంద్రీకరించాలి. వ్యవసాయాన్ని వాణిజ్యంగా మార్చాలి. అందుకు అనుగుణంగా చట్టాలు చేయాలి. వాస్తవానికి ఇటువంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పాత్ర, కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి రంగం అత్యున్నత లక్ష్యాలతో , పోటీ తత్వంతో ముందుకు పరుగులు పెట్టాలి. దీనివల్ల అటు పట్టణాల్లోనూ, ఇటు గ్రామాల్లోనూ ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ లక్ష్యంతో ముందుకు సాగాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం, సహకారం ఏర్పడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News