మానవ జీవక్రియ నియంత్రణకు అత్యవసరమైన థైరాయిడ్ గ్రంధి క్రియాశీలత, ఎదుగుదల, అభివృద్ధి, థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో శరీరానికి అయోడిన్ పలు రకాలుగా ఉపయోగపడుతుంది. శరీరంలో అయోడిన్ కొరత ఏర్పడితే పలు అయోడిన్ లోప రుగ్మతలు (అయోడిన్ డెఫిష్యన్సీ డిసీజెస్) కలుగుతాయి. అయోడిన్‌తో కూడిన ఆహారపదార్థాలను నిరంతరం సక్రమంగా తీసుకున్నట్లైతే, ఈ రుగ్మతలు నివారించబడుతూ సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందనే అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా 21 అక్టోబర్ రోజున ప్రపంచ అయోడిన్‌లోప రుగ్మతల నివారణ దినం(వరల్ అయోడిన్ డెఫిసియెన్సీ డిసార్డర్ ప్రివెన్షన్ డే) పాటించుట జరుగుతోంది. ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినం-2023 నినాదంగా అయోడిల్ వాడుతూ ఆరోగ్య పరిరక్షణ అందరికీ అయోడిన్ లోప నివారణ (నర్చరింగ్ హెల్త్ విత్ అయోడిన్ : డెఫిషియెన్సీ ప్రివెన్షన్ ఫర్ ఆల్) అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతోంది.
అయోడిన్ లోప నివారణ మార్గాలు
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, మిటమిన్లు, ఖనిజ లవణాలు, పీచుపదార్థాలు, నీరు సమపాళ్ళలో ఉన్న సమతుల పోషకాహారం తీసుకున్నట్లయితే పూర్తి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వల్ల పలు రోగాలు వస్తాయి. వీటిలో ఒక ముఖ్యమైన ఖనిజ లవణమైన అయోడిన్ వల్ల టి3 (ట్రై అయొడో థైరోనిన్), టి4 (థైరాక్సిన్) అనబడే థైరాయిడ్ హార్మోన్లు తయారు చేయబడతాయి. అయోడిన్ సహకారంతో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, సక్రమమైన జీవ క్రియ, ప్రొటీన్లు, కొవ్వుల జీవక్రియ, ఎముకల అభివృద్ధి, మెదడు ఎదుగుదల జరుగుతాయి.
అయోడిన్ లోప అనారోగ్యాలు
శరీరంలో అయోడిన్ లోపం ఫలితంగా గాయిటర్ (థైరాయిడ్ విస్తరణ), న్యూరోమస్కులర్ (నాడీకండర) బలహీనతలు, హైపోథైరాయిడి జమ్, వినికిడి బలహీనత, స్పీచ్ (మాట) బలహీ నత, బుద్ది మాంద్యం (ఇంటలిజెన్స్ స్థాయి తగ్గడం), చూపు మందగించడం, స్పాస్టిసిటీ, క్రెటి నిజమ్ లాంటి అయోడీన్ లోప రుగ్మతలు జనిస్తాయి. గర్భిణిలో అయోడిన్‌లోపం వల్ల శిశువు సమగ్రాభివృద్ధి ప్రభావితం అవుతుంది. శరీరంలో అయోడిన్ ఉత్పత్తి కాదు, కాబట్టి అయోడిన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే తప్పని సరియని గమనించాలి. ఒక ఆరోగ్యవంతుడికి రోజుకు సగటున 100 – 150 మైక్రోగ్రామ్‌ల అయోడిన్ అవసరం అవుతుంది. అయోడైజ్డ్ సాల్ట్, సముద్ర ఆహారం, పాలు, పెరుగు, బ్రెడ్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, అరటి పండ్లు, మాంసం, గుడ్లు, తృణధాన్యాలు లాంటి ఆహారంలో అయోడీన్ లభ్యమవుతుంది. నిత్యం అయోడీన్‌తో కూడిన ఉప్పును వాడడం ఉత్తమమైన మార్గమని గుర్తించాలి.
ప్రపంచ సమస్యగా అయోడిన్ లోపం
ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే వివరాల ప్రకారం ప్రపంచ జనాభాలో 1.5 బిలియన్ల (1/3 వంతు జనాభా) ప్రజలు అయోడీన్ లోపంతో బాధపడుతున్నారని తేలింది. ఇండియాలో 200 మిలియన్ల మంది (10శాతం జనాభా) అయోడీన్ లోప రుగ్మతల ప్రమాదంలో ఉన్నారని, 71 మిలియన్లు గాయిటర్ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. 1984లో భారత ప్రభుత్వం అయొడైజ్డ్ సాల్ట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ, 1993లో నాన్-అయొడైజ్డ్ ఉప్పు వాడకాన్ని నిషేధించింది. సామాన్య జనంలో అయోడిన్ లోపంతో వచ్చే ప్రమాదకర రుగ్మతల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రపంచ అయోడిన్‌లోప రుగ్మతల నివారణ దినాన్ని పాటించడం ఉద్యమంలా జరగాలి.
వ్యాధి చికిత్స కన్నా నివారణే మిన్నయని, అయోడీన్‌లోపం రాకుండా ముందే జాగ్రత్తపడాలని విశ్వ మానవాళికి అవగతం చేయడం మన కనీసబాధ్యత అని సత్వరమే తెలుసుకోవాలి. అయోడిన్ ప్రాముఖ్యతను వివరించడం, అయోడిన్ లోప రుగ్మతల లక్షణాల అవగాహన, అయోడిన్ సహిత ఆహారాన్ని తీసుకోవడం, అయోడిన్ లోపానికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయడంలాంటి అంశాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి. అయోడిన్ లోప రుగ్మతలు నివారించదగినవని, అయోడిన్ సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
- డా॥ బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037
(నేడు ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవం)