Saturday, November 15, 2025
HomeTop StoriesWorld Pneumonia Day 2025: చిన్నారుల ఊపిరి తీస్తున్న 'న్యుమోనియా'.. వైద్యంతో పాటు జాగ్రత్తలూ కీలకమే.!

World Pneumonia Day 2025: చిన్నారుల ఊపిరి తీస్తున్న ‘న్యుమోనియా’.. వైద్యంతో పాటు జాగ్రత్తలూ కీలకమే.!

World Pneumonia Day 2025 ‘Child Survival’ Theme: నవంబర్‌ 12, ప్రపంచ న్యుమోనియా దినోత్సవం(World Pneumonia Day). ప్రతి సంవత్సరం ఈ తేదీన ఓ ప్రత్యేకమైన థీమ్‌తో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(WHO) ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ వ్యాధి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది కూడా ఓ ముఖ్య ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమైంది. ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తూ.. ఈ రోగం ప్రతి యేటా తగ్గుముఖం పట్టేందుకు కృషి చేస్తోంది. అసలు ఈ న్యుమోనియా ఎలా సోకుతుంది. దీని వల్ల కలిగే అనర్థాలేంటి.. ‘వరల్డ్‌ న్యుమోనియా డే’ సందర్భంగా ఈ రోజు ప్రత్యేక కథనం..

- Advertisement -

ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, వృద్ధులను పట్టిపీడిస్తున్న అంటువ్యాధి న్యుమోనియా. ఐదేళ్ల లోపు చిన్నారుల ఉసురు తీసుకుంటున్న ఈ వ్యాధి.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులను సైతం ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ప్రబలుతున్న న్యుమోనియా.. పేద, మధ్య తరగతి కుటుంబాలపై కోలుకోలేని ప్రభావం చూపిస్తోంది. 

Also Read: https://teluguprabha.net/health-fitness/benefits-of-wake-up-in-the-morning/

న్యుమోనియా ఎలా సోకుతుంది.?

న్యుమోనియా.. బాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా ఊపిరితిత్తులకు ఇది సోకుతుంది. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి దగ్గు లేదా తుమ్ము ద్వారా గాలి నుంచి సులభంగా వ్యాపిస్తాయి. తద్వారా తెల్ల రక్తకణాలను నిర్వీర్యం చేస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లల్లో, వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా.. వారు న్యుమోనియా బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఏటా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 14 లక్షల మంది చిన్నారులు న్యుమోనియా కారణంగా మరణిస్తున్నారు. ఇక, యూనిసెఫ్‌ గణాంకాల ప్రకారం ప్రతి 39 సెకన్లకు ఒక పసికందు న్యుమోనియాతో చనిపోతున్నట్లు వెల్లడైంది. కొవిడ్‌- 19 ప్రభావంతో న్యుమోనియో కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. 

లక్షణాలు ఇవే..

న్యుమెనియా ఒక శ్వాసకోశ వ్యాధి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉంటుంది. అయితే మరికొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. న్యుమోనియాతో బాధపడేవారు ప్రధానంగా ఈ సమస్యలు ఎదుర్కొంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, గుండె వేగంగా కొట్టుకోవడం, జ్వరం, వణుకు, విపరీతంగా చెమటలు, దగ్గు, ఛాతి నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు తీవ్రతరమైతే న్యుమోనియా బారినపడినట్లే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Also Read: https://teluguprabha.net/health-fitness/iil-new-zealand-pristine-biologicals-10-years-vaccine-supply/

2025- Child Survival- WHO

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ‘Child Survival’(చిన్నారులను కాపాడుకుందాం) థీమ్‌తో ప్రపంచ ఆరోగ్య సంస్థ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. పిల్లల్లో న్యుమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ థీమ్‌ను తీసుకువచ్చింది. రోగులకు టీకాలు, ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు, సకాలంలో చికిత్స ద్వారా అవగాహన పెంచడం వంటి ప్రాముఖ్యతను వివరిస్తుంది. Every Breath Counts కూటమి, WHO, UNICEF వంటి సంస్థలు ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. 

కొవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా కేసులు పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నుంచి ప్రత్యేకమైన థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. 

2024: Every Breath Counts: Stop Pneumonia in Its Track(ప్రతి శ్వాస ముఖ్యం: న్యుమోనియాను ఆరంభంలోనే ఆపేద్దాం)

World Pneumonia day 2023: Championing the fight to stop pneumonia(న్యుమోనియా నిర్మూలనా పోరాటంలో విజయం సాధించడం)

World Pneumonia day 2022: Pneumonia Affects Everyone(వయసుతో సంబంధం లేకుండా అందరిపై న్యుమోనియా ప్రభావం)

World Pneumonia day 2021: Stop Pneumonia/Every Breath Counts(ప్రతి శ్వాస కీలకం- న్యుమోనియాను నిర్మూలిద్దాం)

World Pneumonia day 2020: Let’s increase access to medical oxygen(వైద్య ఆక్సిజన్ లభ్యతను పెంచుకుందాం.)

చలికాలం, వర్షాకాలంలో వాతావరణంలో పొగమంచు, తేమ శాతం అధికంగా ఉండటం కారణంగా చిన్నారులు, వృద్ధుల్లో ఈ వ్యాధి త్వరగా సోకే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో వారిని కాపాడుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు కీలకమైన సూచనలు చేసింది. చిన్నారులు, వృద్ధుల పట్ల కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా న్యుమోనియా సోకకుండా కాపాడుకోవచ్చని సూచిస్తోంది. ఈ కాలంలో చిన్న పిల్లల శరీరం వెచ్చగా ఉండటానికి స్వెట్టర్లు వేయాలి. చెవులకు వెచ్చదనం కోసం టోపీ పెట్టాలని.. వీలైతే కాళ్లకు, చేతులకు సాక్సులు, గ్లౌవ్స్‌ ధరిస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. 

చిన్నారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాలు తాగే నెలల వయసున్న శిశువులను కన్నతల్లి పొత్తిళ్లలో పడుకోబెడితే బిడ్డకు కాస్త వెచ్చతనం అందుతుంది. ఉదయం నీరెండలో కొద్ది సేపు ఉంచితే ప్రయోజనం చేకూరుతుంది. చిన్నారులతో ఉదయం వేళల్లో ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. చిన్నారులకు అవసరమైన టీకాలను నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా ఇప్పించాలి. చిన్నపాటి జ్వరం వచ్చినా.. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

వృద్ధులపై ప్రభావం

ఇక వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగా వారు తప్పనిసరిగా ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి. ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా తరచూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకుంటూ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad