‘తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోతుంది‘ అన్న సామెతను అక్షరాలా నిజం చేస్తూ అతి తక్కువ ధరకే సేవలందిస్తున్న తపాలాకు, గ్రామీణ ప్రజలకు మధ్య అనుబంధం శతాబ్దాల నాటిది. ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. చరిత్రను తిరిగి చూస్తేలోకి ‘మెసెంజర్ల‘ రూపంలో తపాలా సర్వీసులుండేవి. వీళ్లు నడిచి లేదా గుర్రాల మీద వెళ్లి రాత ప్రతుల్ని అటూ ఇటూ చేరవేసేవారు. 1600 – 1700 సంవత్సరాలలో అనేక దేశాలవారు జాతీయ తపాలా వ్యవస్థలను నెలకొల్పుకొని ఆయా దేశాల నడుమ తపాలా సౌకర్యాల్ని అందించు కునేందుకు ‘ద్వైపాక్షిక ఒప్పందాలు‘ చేసుకున్నారు. 1800 సంవత్సరం నాటికి ఇలా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నవారు
భారీగా తేలారు. దీంతో అంతర్జాతీయ తపాలా పంపిణీ క్లిష్టంగా, అసంపూర్తిగా, అసమర్ధ వంతంగా మారి పోయింది.
అమెరికాకు చెందిన పోస్ట్ మాస్టర్ జనరల్ మాంట్ గోమెరి బ్లెయిర్ 1863 లో 15 యూరోపియన్ దేశాలు, అమెరికన్ దేశాల ప్రతినిధులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఈ సదస్సులో అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులపై పరస్పర ఒప్పందాల కోసం ప్రతినిధులు అనేక సాధారణ సూత్రాలను వెల్లడించారు. కానీ ఒక అంతర్జాతీయ ఒప్పందం మాత్రం కుదరలేదు. 1874 లో నార్త్ జర్మన్ కాన్ ఫెడరేషన్‌కు చెందిన ఓ సీనియర్ పోస్టల్ అధికారి హెయిన్ రిచ్ బనీ స్టీఫెన్ స్విట్జర్లాండ్ లోని బెర్నెలో 22 దేశాల ప్రతినిధులతో ఒక సదస్సు ఏర్పాటు చేశాడు. ఆ ఏడాది అక్టోబరు తొమ్మిదో తేదీన ప్రతినిధులు ‘బెర్నె ఒప్పందం‘పై సంతకాలు చేసి జనరల్ పోస్టల్ యూనియన్‌ను నెలకొల్పారు.
ఈ యూనియన్‌లో సభ్యదేశాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. యూనియన్ పేరు 1878 లో ‘యూనివర్సల్ పోస్టల్ యూనియన్” గా మారింది. ఇది 1948 లో ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక ఏజెన్సీగా రూపాంతరం చెందింది. 1969 లో అక్టోబరు 1 నుంచి నవంబరు 16 వ తేదీ వరకు జపాన్ టోక్యోలో 16 వ యూనివర్షల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో ప్రతినిధులు అక్టోబరు 9 వ తేదీన ‘వరల్డ్ పోస్టల్ డే‘ ని నిర్వహించాలని తీర్మానించారు. అప్పటి నుండి, తపాలా సేవల అవసరాన్ని గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 9 న ఈ ప్రపంచ తపాలా దినోత్సవమును జరుపుకుంటున్నారు. ‘దినాదినాభివృద్ధి చెంది, రోజువారీ ప్రజల జీవితాలు మరియు వ్యాపారాలలో తపాలాశాఖ పోషించే పాత్రను గూర్చి ప్రజల్లో అవగాహనను రేకెత్తించడం మరియు దేశాల ఆర్ధిక, సామాజిక అభివృద్దిలో తపాలా శాఖ ఔన్నత్యాన్ని తెల్పడం కోసం ఈ రోజును జరుపుకుంటారు. ఒక చిన్న పాయగా మొదలైన తపాలా విధానం తరువాత అన్ని దేశాలకు వేగంగా పాకిపోయింది. 1800 నాటికి ప్రపంచ తపాలా వ్యవస్థ ఏర్పడింది. కాగా 1837లో మనదేశంలో తపాలా వ్యవస్థ ప్రారంభమైంది. ‘భారత తపాలా శాఖ‘ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం అక్టోబర్ 1, 1854న ఏర్పాటు చేసింది. తపాలా బిళ్ళ (పోస్టల్ స్టాంప్) అప్పటి సింధ్ (ఇప్పటి పాకిస్తాన్) ప్రాంతంలో తొలుత వాడుకలోకి వచ్చింది. పోస్టల్ వ్యవస్థ సక్రమంగా ఏర్పాటు కాకముందే భారత్‌లో మొదటిసారి ‘వారెన్ హెస్టింగ్స్” కోల్‌కత కార్యాలయంలో 1774లో ‘మొదట తపాలా కార్యాలయాన్ని‘ తెరిచారు. ప్రపంచంలోని తపాలా శాఖలన్నింటిలో భారత తపాలా రారాజు లాంటిది. భారత దేశంలో మార్చి 31,2015 నాటికి 1,54,939 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 1,39,222(89.86%) గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న తపాలా కార్యాలయాలు 23,344 మాత్రమే. చిన్ననాటి నుండి పాఠశాల రోజుల్లో రాసిన హెడ్‌మాస్టర్‌కు సెలవు చీటీ నుంచి కాలేజీ రోజుల్లో ఖర్చుల కోసం తల్లిదండ్రులకు రాసే ఉత్తరం, స్నేహితులతో సత్సంబంధాలు పాదుకొల్పేందుకు, అనంతరం జీవితానికో అర్థం తెచ్చిపెట్టే ఉద్యోగం కోసం చేసే దరఖాస్తుకు అంటించే తపాలా బిళ్ళలు… ఇలా ఎన్నెన్నో విషయాలు జీవితాలతో ముడివేసుకున్నాయి. ఉత్తరం అందుకోవడం, రహస్యంగా విప్పి చదువు కోవడం, ఎవరైనా వస్తుంటే దిండు కింద దాచుకోవడం ప్రేమికులకు ఖర్చులేని ఓ మధురానుభూతి. దూరంగా సైన్యంలోనో, మరో ఉద్యోగంలోనో ఉన్న భర్తో, కోడుకో ఉత్తరం రాస్తాడనీ, క్షేమ సమాచారం చెబుతాడనీ వీధి వంక చూస్తూ గడిపే కాలం ఇంకా మధురమైనది. తరతరాలుగా తమ జీవన స్రవంతిలో ఈ తపాలా ఉత్తరం పట్ల తమకు గల మమకారాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా స్త్రీ, పురుష బేధం పాటించకుండా ప్రతి ఒక్కరూ చాటుకున్నారు. అయితే సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఉత్తరాలు రాసుకునే తరం అంతరించి పోయింది. ఇంటికి వచ్చిన ఉత్తరాలను పొడవాటి ఇనుప కమ్మీకి గుచ్చిఉంచడం. అవసర మైనపుడు మళ్లీ తీసి చదువుకోవడం రెండు మూడు దాశాబ్దాల క్రితం ప్రతి ఇంటా ఉండేది. ఆడపిల్ల చదివి ఊళ్లేలాలా & ఉత్తరాలు చదువుకో గలదు చాలు అన్న కాలం కూడా అదే & రోజులు మారి, కంప్యూటర్, మొబైల్ ఫోన్లు, అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన నేటికాలంలో ఉత్తరాలు రాయటం దాదాపు లేదనే చెప్పాలి. ఇపుడు పోస్ట్ అంటే బ్యాంకు నుంచి, సెల్ ఫోన్ కంపెనీల నుంచీ వచ్చే పార్శల్లు, బిల్లులు, డేటా వివరాలు మాత్రమే. కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ ఖర్చుతో సమాచారాలు అందేవి. వందల, వేల మైళ్లు ప్రయాణం చేసి వచ్చే ఆ తోక లేని పిట్ట కోసం ఆతృతగా ఎదురు చూసి ‘పోస్ట్” అన్న కేక వినగానే ఉరుకులు, పరుగులతో అందుకునే ఉత్తరాల్లొ ఎన్నో విశేషాలు , అనేక కమ్మని కబుర్లు, కెరీర్ కు బాటలు… మంచి ఉత్తరం అందుకున్పప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. అలాగే మనియార్డర్లు.. సంతోషంతో పోస్ట్ మ్యాన్ కు ఈనాం ఇచ్చే ఆనవాయితీ నెలకొని పోయింది. గతంలో సమాచార మార్పిడికి, క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే (ఉత్తరం) ప్రధాన ఆధారం. పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధార పడేవారు. సమాచార రంగంలో రానురాను విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఉత్తరం ప్రాధాన్యం తగ్గుతున్న నేపథ్యంలో మార్పులను అంది పుచ్చుకుంటూ మనుగడను కొనసాగిస్తూనే ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది భారత తపాలశాఖ. పావురాల ద్వారా బట్వాడా నుంచి.. స్పీడు పోస్టు.. ఈ-మెయిల్ ఇలా దూసుకెళ్తున్న భారత తపాలా వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని మూటగట్టుకుంది. ఉత్తర ప్రత్యుత్తరాల వారధులుగా అశేష సేవలందిస్తున్న ఈ విభాగం ప్రస్థానం ‘ఇంతింతై వటుడింతై‘ అన్నట్లు సాగింది. ప్రయివేటు రంగం నుంచి వచ్చిన పోటీని తట్టుకొని నిలబడుతోంది. రెండో అతి పెద్ద వ్యవస్థ తపాలశాఖ గతంలో ఉత్తరాలు బట్వాడాకే పరిమితం కాగా కాలక్రమంలో అనేక సేవల్లోకి మారింది. ప్రస్తుతం దేశంలో సుమారు ఆరు లక్షల మంది
తపాలా సిబ్బంది 1.10 లక్షల కార్యాలయాలతో సేవలందిస్తోంది. దేశంలో రైల్వే తర్వాత ఇదే అతి పెద్ద వ్యవస్థ. స్పీడు పోస్టు కోసం మనదేశంలో 180 కేంద్రాలున్నాయి. 100కు పైగా దేశాలకు ఈ సౌకర్యం ఉంది. ప్రపంచంలో ఏమూల నుంచైనా ‘ఇ పోస్టు‘ చేస్తే క్షణాల్లో ఎంపిక చేసిన పట్టణాల్లో పోస్టుమన్ ద్వారా ఇంటికి అందుతుంది. బంగారు నాణాలు, ఫారెన్ ఎక్ఛేంజ్ కరెన్సీ మార్చుకోవడం లాంటి అనేక సౌకర్యాలు అందిస్తుంది. బిల్ మెయిల్ సర్వీసు. పెద్దపెద్ద సంస్థలు, ఫ్యాక్టరీలు తమ సంస్థ ఆర్థిక నివేదికలు, బిల్లులు, ఇతరత్రా చేరవేత, గ్రామీణ మార్కెటింగ్ విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టిన మేఘదూత్ పోస్టుకార్డు, మరో
ఎక్స్‌ప్రెస్ పార్సిల్ పోస్టు..2006లో ఇన్‌స్టెంట్ మనీ ఆర్డర్ సర్వీసు ఇలా సౌకర్యాలను మెరుగు పరుస్తోంది.
కాలగమనంలో వచ్చిన మార్పులు దీనిపై పెనుప్రభావం చూపాయి. సెల్ ఫోన్లూ, కంప్యూటర్లూ, ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక కార్డు అవసరం తగ్గి, ఇ-మెయిల్స్ చాలా వరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోషిస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఇప్పటికీ పోస్టు కార్డునే వినియోగిస్తున్నారు.
- రామకిష్టయ్య సంగన భట్ల
9440595494
(నేడు ప్రపంచ తపాలా దినోత్సవం)