Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్World refugee day: జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం

World refugee day: జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం

శరణార్థులను ఆదుకుందాం

ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి ఏట జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని శరణార్థుల గురించి అవగాహన కలిపించడం ఈ రోజు లక్ష్యం. “శరణార్థులను స్వాగతించే ప్రపంచం కోసం శరణార్థులకు సంఘీభావంపై దృష్టి పెట్టాలి” అనే నినాదాన్ని ఈసంవత్సరం ఇతివృత్తంగా తీసుకున్నారు.ఇతర అంతర్జాతీయ దినోత్సవాల మాదిరిగా ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుపుకునే రోజు కాదు. శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు, అమానవీయ పరిస్థితులు, వాటి వెనుక ఉన్న కారణాలు, వీటన్నిటిని గురించి ప్రపంచ మానవ సమాజానికి తెలియజేసి అవగాహన కల్పించేందుకు ఈ రోజును వినియోగించుకుంటారు. యుద్ధం, హింస కారణంగా వారివారి స్వస్థలం నుండి పారిపోయి వచ్చిన వారిని ఆదరించి వారికి బతుకుదెరువు చూపెట్టాలని ప్రజలకు తెలుపుతారు.

- Advertisement -

శరణార్థులు అంటే ఎవరు:
స్వదేశంలో వేధింపులు లేదా హాని భయం కారణంగా మరొక దేశంలో రక్షణ కోరుకునే వ్యక్తులను శరణార్థులు అంటారు. యుద్ధం, అణచివేత, ప్రకృతి వైపరీత్యాలు వాతావరణ మార్పులు లాంటివి శరణార్థులుగా మారడానికి కారణాలు. 1951లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలోని యుధ్ధ సంబంధిత శరణార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో ప్రకృతి విపత్తుల వలన కూడా మరో దేశానికి వెళ్లిపోయిన వారిని కూడా శరణార్థులుగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. భూకంపాలు, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా ప్రజలను పారిపోయేలా చేస్తాయి. ఇటువంటి వారిని పర్యావరణ శరణార్థులనంటారు.

ప్రస్తుతం వీరి సంఖ్య:
2023 సం.చివరి నాటికి ప్రపంచ శరణార్థుల సంఖ్య 4.34 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది కంటే ఏడు శాతం ఎక్కువ. ఈ పెరుగుదలకు సూడాన్ మరియు ఉక్రెయిన్ దేశాలలో కొనసాగుతున్న సంఘర్షణలే కారణం. దశాబ్దం క్రితంతో పోలిస్తే శరణార్థుల సంఖ్య మూడు రెట్లు పెరిగారు. వీరిలో ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలకు చెందినవారు అధికంగా ఉన్నారు. 75 శాతం మంది శరణార్థులు తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని శరణార్థుల్లో 85 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారే. అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి చాలా మంది శరణార్థులు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఉదాహరణకు, ఆఫ్ఘనిస్తాన్‌లోని సంఘర్షణ నుండి శరణార్థులు తరచుగా పాకిస్తాన్, ఇరాన్ లేదా ఐరోపాకు వెళ్తున్నారు.

2023కి ముందు:
రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షల మంది శరణార్థులు ఉన్నారు. 1980సం.కి వీరి సంఖ్య ఒక కోటికి చేరింది. 1980లలో ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియాలో జరిగిన యుద్ధాల కారణంగా 1990 నాటికి రెండు కోట్లకు పెరిగింది. తదుపరి రెండు దశాబ్దాలలో వీరి సంఖ్య స్థిరంగా ఉంది. అయితే 2001లో ఆఫ్ఘనిస్తాన్ మరియు 2003లో ఇరాక్‌పై యునైటెడ్ స్టేట్స్ దండయాత్ర , దక్షిణ సూడాన్ మరియు సిరియాలో అంతర్యుద్ధాలతో పాటు 2021 చివరి నాటికి శరణార్థుల సంఖ్య మూడు కోట్లకు మించిపోయింది.
మొత్తం శరణార్థులలో 72 శాతం కేవలం ఐదు దేశాల నుండి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ (64 లక్షలు), సిరియా (64 లక్షలు), వెనిజులా (61 లక్షలు), ఉక్రెయిన్ (60 లక్షలు) మరియు పాలస్తీనాలు (60 లక్షలు) ఈ ఐదు దేశాలు. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఇరాన్ (38 లక్షలు), టర్కీ (33 లక్షలు), కొలంబియా (29 లక్షలు), జర్మనీ (26 లక్షలు) మరియు పాకిస్తాన్ (20 లక్షలు) దేశాలలో ఎక్కువగా ఉన్నారు. గత దశాబ్దంలో టర్కీ మినహా ఈ ప్రధాన అతిధేయ దేశాలలో శరణార్థుల సంఖ్య పెరిగింది. ఇరాన్ మరియు పాకిస్తాన్‌లోని దాదాపు శరణార్థులందరూ ఆఫ్ఘన్‌లు కాగా, టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు. చాలా మంది శరణార్థులు తమ దేశానికి సమీపంలోనే ఉన్నారు. 69 శాతం మంది వారి పొరుగు దేశాలలో ఆతిధ్యం పొందుతున్నారు. శరణార్థుల మూల దేశాలకు సరిహద్దు లేని ఏకైక ప్రధాన ఆతిథ్య దేశం జర్మనీ. 2023 సంవత్సరం చివరి నాటికి జర్మనీలో అత్యధిక మంది శరణార్థులు ఉక్రెయిన్ (11 లక్షలు), సిరియా (7,05,800), ఆఫ్ఘనిస్తాన్ (2,55,100) మరియు ఇరాక్ (146,500) నుండి వచ్చారు.

శరణార్థుల ఇబ్బందులు:
శరణార్థులు వారి దేశం నుండి పారిపోయే సందర్భాలలో అత్యాచారం, హింస, కిడ్నాప్, ఏకపక్ష నిర్బంధం, దోపిడీ మరియు మానవ అక్రమ రవాణా లాంటి అనేక ప్రమాదాలకు లోనవుతున్నారు. కొంత మంది మరణించారు కూడా. 2021 నుండి 2023 సం.ల మధ్య సహారా ఎడారిని దాటుతున్నప్పుడు 950 మంది మరణించారు. అయినప్పటికీ వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. అదే సమయంలో తరలింపులో ఉన్న 7,600 మంది మధ్యధరా సముద్రంలో తప్పిపోవడమో లేదా మరణించడమో జరిగింది. శరణార్థులు ప్రస్తుతం వారు ఉంటున్న దేశాలలో ఆర్థిక సమస్యలు, అన్ని రకాల వనరులు అందుబాటులో లేకపోవడం, ఉపాధి కొరకు అన్వేషణ, స్థానిక ప్రజల నుండి మద్దతు లేకపోవడం, సాంస్కృతిక విబేధాలు, ఒంటరితనం, చట్టాన్ని అమలు చేసే వారి నుండి వేధింపులు, సామాజిక స్థితిని కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు.

పరిష్కారాలు:
అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అన్ని దేశాలు వీరిని చెరదేయాలి. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించకుండా సౌకర్యాలను కల్పించాలి. స్థానిక ఇబ్బందుల నుండి రక్షించాలి. మానవత్వంతో వ్యవహరించాలి.

జనక మోహన రావు దుంగ
అధ్యాపకుడు
8247045230

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News