Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్World Senior citizen's day: పెద్దలను ముద్దుగా చూద్దాం

World Senior citizen’s day: పెద్దలను ముద్దుగా చూద్దాం

పెద్దవారి బాధ్యత వారి వారసులదే

ప్రపంచ సీనియర్‌ సిటిజన్‌ దినాన్ని ప్రతీ సంవత్సరం ఆగస్ట్‌ 21 వ తేదీన జరుపుకుంటారు. ఇది 1991 నుండి జరుపుకుంటున్నారు. ప్రపంచ సీనియర్‌ సిటిజన్స్‌ డే చరిత్ర 1988 నాటిది. దీనిని అధికారికంగా అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రకటించారు. మన చరిత్రలో, వృద్ధులు మన కుటుంబాలను, దేశం కోసం చాలా సాధించారు. జీవితాంతం వారు సాధించిన అన్నింటికీ మరియు వారు సాధించడం కొనసాగించినందుకు మనము వృద్ధులకు రుణపడి ఉంటాము. వృద్ధుల ఆరోగ్యం మరియు వారి హక్కుల దుర్విని యోగం గురించి ఆలోచింప జేశే రోజు. సమాజా నికి వీరు చేసిన సేవలను గుర్తించే రోజు కూడా. వృద్ధులను ప్రభావితం చేసే కారకాలు మరియు సమస్యలపై అవగాహన పెంచడానికి ఈ రోజు ఉద్దేశించ బడింది. వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదర ణకు, వేధింపులకు గురవ్వుతారా…? అనే ప్రశ్నకి, కాదు అనే సమాధానం సూటిగా చెప్పలేము. ఎందుకంటే నేటి సమాజంలో కొంతమంది వలన, కుటుంబాలలో కొందరి వలన, వృద్ధులు బాధితులు అవుతున్నారు. మన దేశంలో సామాన్యంగా అరవై యేళ్ళ వయస్సు దాటిన వారిని వృధ్ధులుగా పరిగణిస్తారు. వృద్ధాప్యం అనేది జీవసంబంధమైన, సహజమైన ప్రక్రయ. ఇది జీవిత చక్రంలో ఒక క్లిష్టమైన దశ అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఈ దశలో శారీరకంగా, మానసికం గానూ ఆరోగ్యసమస్యలు పెరుగుతాయి. సంపాదించే స్థాయి తగ్గుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 7.5 శాతం ( 77 మిలియన్ల) మంది ఉంటే 2011 సంవత్సరానికి 8.6 శాతం (104 మిలి యన్ల) మందికి ఎగబాకింది. జాతీయ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం నివేదిక 2021 సంవత్సరానికి 133.32 మిలియన్లు ఉండొచ్చని తెలిపింది. వృద్ధాప్యంలో ఎక్కువ మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. తన జీవిత భాగస్వాములు లేదా వారసులు తమని జాగ్రత్తగా చూసు కుంటారో లేదో అని భావిస్తారు. అభద్రత, జీవితం పట్ల విశ్వాసం లేకపోవడం వలన నిరాశకు గురవుతున్నారు. జీవిత చరమాంకలో ప్రశాంతంగా ఉండాలని వీరు కోరుకుంటారు. కానీ వృద్ధులు వారి యొక్క కుటుంబంలో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వృద్ధుల్లో కొందరు వారి కుటుంబ సభ్యులుచే అవమానానికి, వేధింపులకు గురవుతున్నారు.

- Advertisement -

ఎలాంటి వేధింపులంటే…
భౌతికంగా వారిని కొట్టడం, తిట్టడం, నిద్ర కోసం మత్తు మందులు ఇవ్వడం, మానసికంగా వారి ప్రవర్తనను నియంత్రించడం, ఒంటరిగా ఉంచడం, ఎవరూ వారితో మాట్లాడకపోవడం, ఆర్థికంగా వారియొక్క డబ్బులు దొంగలించడం , ఆస్తులను తెలియకుండా విక్రయించడం లేదా దుర్వినియోగం చేయడం, సరైన ఆహారాన్ని ఇవ్వక పోవడం, పరిశుభ్రమైన గదులు కేటాయించకపోవడం, సరైన వైద్య సదుపాయాలు కల్పిం చక పోవడం, సమ్మతి లేకుండా లైంగికంగా వేదించడం, వారి బట్టలలో మూత్ర విసర్జన చేస్తే తడిసిన దుస్తుల్లోనే ఉంచి వస్త్రాలు మార్చకపోవడం , రోజువారీ వ్యవహారాల్లో వారి మాటలకు గౌరవం ఇవ్వకపోవడం, ఉద్దేశ్య పూర్వకంగానే వారికి అసౌకర్యం కల్గించడం, అవసరమైన మందులు పూర్తిగా లేదా పాక్షికంగా అందించికపోవడం మొదలైనవి.
దీనికి గల కారణాలు..
ప్రధాన కారణం వృద్ధులు ఇంతకు ముందులా సంపాదన కలిగిలేకపోవడం. చిన్న కుటుంబాలు వలన అందరూ ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళడం వలన వృద్ధులను పట్టించుకోలేపోతున్నారు. కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత స్వాతంత్రానికి వృద్దులు అడ్డు వస్తారనే భావన కల్గిఉండడం, కుటుంబ సభ్యులు వారియొక్క పనులలో ఒత్తడి వలన, వృద్ధులతో గడపడానికి సమయం దొరకకపోవడం, తగినంత ఆర్థిక పరిపుష్టి లేకపోవడం, వృధ్దుల యొక్క మానసిక స్థితిని తెలుసుకో లేకపోవడం మొదలైనవి.
పరిష్కార మార్గాలు..
ముందుగా వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారా.? లేదా..? తెలుసుకోవాలి. స్నేహితులతో చర్చించాలి. వారితో గడపడానికి కొంచెం సమయం ఐనా కేటాయించి వారు ఒంటరి కాదనే భావనను కల్గించాలి. వారి మాటలను గౌరవించాలి. కుటుంబ సభ్యులందరూ సెలవు దినాలలో కలిసి భోజనం చేయాలి. వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. తగిన వైద్య సదుపాయాలు కల్పించాలి. వారికి ఇష్టమైన ఆహారాన్ని అందివ్వాలి. విహార యాత్రలకి వారిని కూడా తీసుకు వెళ్ళాలి. తప్పనిసరైనప్పుడు మాత్రమే వృద్ధాశ్రమానికి పంపించాలి. పంపించిన కూడా వీలైనప్పుడల్లా కలవాలి. లేదా ఫోన్లో వారి యోగక్షేమాలులని తెలుసుకోవాలి. వారు ఒంటరి కాదు… మేమున్నాం అనే భావనని కల్గించాలి. ప్రతీ ఒక్కరం ఎప్పటికైనా వృద్ధులు అవుతాం అనే విషయాన్ని గుర్తెరగాలి. వారు వయసులో ఉన్నప్పుడు శ్రమించడం వలనే ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామని తెలుసుకోవాలి.
ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు
వృద్ధులు నిర్లక్ష్యానికి గురవ్వకుండా ఉండడా నికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. పించనలని అందజేస్తున్నారు. చాలా చట్టాలు తీసుకువచ్చారు. కోర్టులు కూడా తల్లిదండ్రుల బాధ్యత వారి వారసులదే అని తీర్పులు కూడా ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఎల్డర్‌ లైన్‌ పేరుతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేసే హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 14567 ని అందుబాటులో ఉంచింది. ఇందులో వృద్ధులకు సహాయం మరియు మద్దతు ఇచ్చే సమాచారాన్ని అందిస్తుంది. వృధ్దాశ్రమాలు, ఆసుపత్రులు, వైద్యు ల వివరాలు అందిస్తుంది. వృద్ధులకు మార్గదర్శకత్వం, చట్టపరమైన సమస్యలు విని పరిష్కరించడానికి సహాయ పడుతుంది. పెన్షన్‌కి సంబందించిన సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే నిరాశ్రయులైన వృద్ధులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరి యు ఆహారము, ఔషదాలు వంటి జీవిత ప్రాథమిక అవసరాలను అందిస్తుంది. వృద్ధులకు సంబందించిన భావోద్వేగ మద్దతును అందిస్తుంది. ఏది ఏమైనా వృద్ధులు ఎంతో అనుభవజ్ఞులు. వారి అనుభవాలను ఉపయోగించుకొని వారి జీవిత చరమాంకాన్ని ఆనందంగా సంతృప్తిగా ఉండేటట్లు చూడవలసిన బాధ్యత మనందరిది.

  • డి జె మోహన రావు
    9440485824
    (నేడు ప్రపంచ సీనియర్స్‌ డే)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News