Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్World suicide prevention day: ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారమా ?

World suicide prevention day: ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారమా ?

ఏటా 10,00,000 మంది ఆత్మహత్యలకు పాల్పడి బలవంతంగా మరణిస్తున్నారు

ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పరీక్షలు తప్పడం,ప్రేమ ఫెయిల్యూర్ ఇవన్నీ ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయి. జీవన ప్రయాణంలో సుఖదుఖాలు సర్వసాధారణం. అయితే సున్నిత మనస్కులు వీటిని తట్టుకోలేరు. చిన్న వైఫల్యాన్ని కూడా భూతద్దంలో చూసుకుని తీవ్ర డిప్రెషన్‌కు గురవుతారు. ఒక బలహీన క్షణంలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.

- Advertisement -

ఆత్మహత్య మహా పాపం అంటారు పెద్దలు. పాపపుణ్యాల సంగతి పక్కన పెడితే కొంతకాలంగా యువతలో ఆత్మహత్యల ట్రెండ్ పెరుగుతోంది. చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.పరీక్ష తప్పడం, ప్రేమ విఫలమవడం, ఆర్థికంగా దెబ్బతినడం, నిత్య జీవితంలో ఒత్తిడి పెరగడం …ఇవన్నీ ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఏడాదికి 10 లక్షల మంది ఆత్మహత్య !
ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తీస్తే ఏడాదికి పది లక్షల మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో యువతీయువకులు ఎక్కువగా ఉంటున్నారు. అలాగే చిన్నప్పటి నుంచి ఎవరితోనూ కలవకుండా, ఇంట్రావర్ట్‌లుగా ఉండేవారు ఆత్మహత్యలు చేసుకుంటున్న జాబితాలో ఎక్కువగా కనిపిస్తుంటారు. జీవితమన్నాక గెలుపోటములు సహజం. అన్ని రోజులూ మనవి కావు. ఒక్కోసారి హేమాహేమీలకు కూడా కాలం ఎదురు తిరుగుతుంది. ఇంట్లో సమస్యలు చుట్టుముడతాయి. ఉద్యోగంలో కష్టాలు పెరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. జీవన ప్రయాణంలో ఇవన్నీ సర్వసాధారణం. అయితే సున్నిత మనస్కులు వీటిని తట్టుకోలేరు. చిన్న వైఫల్యాన్ని కూడా భూతద్దంలో చూసుకుని తీవ్ర డిప్రెషన్‌కు గురవుతారు. ఒక్కోసారి కొన్ని రోజుల పాటు డిప్రెషన్‌లో ఉంటారు. ఆ తరువాత డిప్రెషన్‌ నుంచి బయటపడతారు. అయితే కొంతమంది ఒత్తిడి ఏమాత్రం తట్టుకోలేరు. ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకుంటారు. కన్నవారికి, కుటుంబసభ్యులకు శోకాన్ని మిగులుస్తారు. ప్రమాదాలతో మరణించేవారికన్నా బలవన్మరణాలకు పాల్పడుతున్నవారి సంఖ్యే ఎక్కువ అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు
ప్రపంచపటంపై ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలోనూ ఆత్మహత్యలు ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తీస్తే భారత్ 22వ స్థానంలో ఉందంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. దేశవ్యాప్తంగా ఆత్మహత్యల లెక్కలు తీస్తే తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. భారతదేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ తరువాతి స్థానాల్లో తమిళనాడు, కేరళ, చత్తీసగఢ్‌ ఉన్నాయి. అక్షరాస్యతా శాతం తక్కువగా ఉన్న బీహార్‌ రాష్ట్రంలో ఆత్మహత్యలు కూడా తక్కువగానే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్న వారిలో రైతులు ఉండటం అత్యంత బాధాకరం. మనదేశంలో వ్యవసాయం జూదంలా మారింది. రైతులు ఆరుగాలం కష్టపడ్డా పంట ఇంటికి చేరేంతవరకు గ్యారంటీ ఉండదు. కోతల సమయంలో భారీ వర్షాలు పడి పండిన పంట అంతా నీటిపాలవుతుంటుంది. దీంతో సేద్యానికి పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి అన్నదాతలకు ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.రైతులేకాదు ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎక్కువగా కనిపిస్తున్నారు. మెడిసిన్ పీజీ కోర్సులు చదువుతున్న వారు కూడా పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్న భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సీనియర్ల ర్యాగింగ్‌కు భయపడి మెడికోలు బలవన్మరణాలకు పాల్పడ్డ సంఘటనలు ఇటీవల అందరం చూశాం. మెడికోలే కాదు ఆర్థికమాంద్యం చుట్టుముట్టిన నేపథ్యంలో భారత్‌ సహా అనేక దేశాల్లో టెక్ కంపెనీలు మూతపడ్డాయి. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగం పోయిందన్న బాధతో సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన పలువురు ఇటీవలికాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ముందుగానే గుర్తించడం సాధ్యమా ?
కాస్తంత జాగ్రత్తగా పరిశీలిస్తే ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారిని ముందుగా గుర్తించడం సాధ్యమేనంటున్నారు డాక్టర్లు. ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంతంగా గంటలు, రోజులు గడపడం, డిప్రెషన్ లక్షణాలు, ప్రతి చిన్నదానికీ చిరాకు పడటం,నిద్రపోకుండా తెల్లార్లు జాగారం చేయడం….ఇవన్నీ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలే అంటున్నారు డాక్టర్లు. ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే , చుట్టూ ఉన్న వారు వెంటనే అప్రమత్తమవ్వాలి. సదరు వ్యక్తితో మరింత స్నేహపూర్వకంగా మెలగాలి. వారితో ఓపికగా మాట్లాడాలి. సమస్య ఏమిటో తెలుసుకోగలగాలి. వీలైతే పరిష్కారం చూపించాలి. మీకు మేమున్నామనే భరోసా కల్పించాలి. బతుకుపై ఆశ కల్పించాలి. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి అంగీకరిస్తే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. మనదేశంలో మానసిన వైద్యుడి దగ్గరకు వెళ్లాలంటే ఎక్కువ మంది నామోషీగా ఫీలవుతారు.భారత్ ఒక్కటే కాదు….దాదాపుగా అన్ని ఆసియాదేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పిచ్చి బాగా ముదిరిన వారినే సైకియాట్రిస్ట్‌ల దగ్గరకు తీసుకెళతారని అనుకుంటారు. అన్ని శారీరక సమస్యలకు చికిత్స కోసం డాక్టర్ల దగ్గరకు వెళ్లినట్లే మానసిక సమస్యలకు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లడం సర్వసాధారణం అనుకోవాలి. మౌలికంగా మనిషి, తనను తాను ప్రేమించుకోగలగాలి. జీవితంపై సానుకూల వైఖరితో బతకడం నేర్చుకోవాలి. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించాలి. సంగీతం, సాహిత్యం, డ్యాన్స్, చిత్రలేఖనం, పెయింటింగ్ వంటివాటిపై ఆసక్తి పెంచుకోవాలి.అంతిమంగా జీవితమన్నాక కష్టనష్టాలు సాధారణమేననే పాజిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకుసాగడం అలవాటు చేసుకోవాలి.

చాలాసార్లు ఆత్మహత్యలకు పెద్ద పెద్ద కారణాలు ఉండవు.ఓ చిన్న కారణం కూడా ఆత్మహత్యకు పురిగొలుపుతుంది. కాస్తంత ఆవేదన, ఆక్రోశం, చిరాకు ఇవన్నీ బలవన్మరణాలకు కారణాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అర్థాంతరంగా బతుకు చాలిద్దామనుకున్నవారిలో జీవితంపై ఆశలు కల్పించడమే ఈ ఆత్మహత్యల నివారణ దినోత్సవ ప్రధాన లక్ష్యం.

( సెప్టెంబర్ 10- ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా )

ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ , 63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News