Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Wrestlers: కుస్తీ వీరుల న్యాయ పోరాటం

Wrestlers: కుస్తీ వీరుల న్యాయ పోరాటం

కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, భారత రెజ్లింగ్‌ సమాఖ్యల మీద దేశంలోని ఉన్నత స్థాయి కుస్తీవీరులు ధ్వజమెత్తడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. తమకు ఈ మంత్రిత్వ శాఖ మీదా, సమాఖ్య మీదా నమ్మకం పోయినట్టు వారు ప్రకటించడం వారి మనస్తాపాన్ని చెప్పకనే చెబుతోంది. బజరంగ్‌ పూనియా, సాక్షీ మాలిక్‌, వినేశ్‌ ఫోగత్‌ వంటి అగ్రశ్రేణి కుస్తీ వీరులు ధర్నాకు దిగి, తమకు మంత్రిత్వ శాఖద్వారా, సమాఖ్య ద్వారా తీరని అన్యాయం జరుగుతున్నట్టు ప్రకటించారు. తాము తమ ఆవేదనను తెలియజేసుకోవడానికి ఈ శాఖ అధికారులకు, సమాఖ్య అధికారులకు ఫోన్లు చేస్తున్నా వారి నుంచి స్పందన లభించడం లేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదులను విచారించడానికి మంత్రిత్వ శాఖ నియమించిన ఓవర్‌సైట్‌ కమిటీ (ఓ.సి) నివేదిక విషయంలో కూడా తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని వారు తెలిపారు. ఒకసారి ధర్నాచేసి మంత్రిత్వ శాఖ హామీని పురస్కరించుకుని ధర్నాను విరమించిన ఈ కుస్తీవీరులు గత ఆదివారం నుంచి మళ్లీ ధర్నాకు, ఆందోళనకు దిగారు.
భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మీద గత జనవరిలో ఈ మహిళా మల్లయుద్ధ యోధులు ఫిర్యాదు చేశారు. ఆయన తమ మీదలైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వారు క్రీడా మంత్రిత్వ శాఖకు మొరపెట్టుకున్నారు. దాంతో క్రీడా మంత్రిత్వ శాఖ ఓవర్‌సైట్‌ కమిటీని వేసి విచారణకు ఆదేశించింది. శరణ్‌ సింగ్‌ ఉత్తర ప్రదేశ్‌ బీజేపీకి చెందిన సీనియర్‌ నాయకుడు. శరణ్‌ సింగ్‌పై తాము వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు తమ కేసును నమోదు చేసుకోలేదని వారు ఆరోపించారు. పోలీసులు ఆయనపై ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయలేదని వారన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ వారు సుప్రీంకోర్టుకు కూడా విజ్ఞప్తి చేశారు. తాము రెజ్లర్లను కలుసుకుని వారి డిమాండ్లను విన్నామని, ఓవర్‌సైట్‌ కమిటీ నివేదిక పరిశీలనలో ఉండగా రెజ్లర్లు తమ ధర్నాను కొనసాగించడంలో అర్థం లేదని క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు వ్యాఖ్యానించారు. అయితే, ఈ కుస్తీవీరులు ధర్నాకు దిగడం సమర్థనీయంగానే కనిపిస్తోంది.
క్రీడాకారులకు శిక్షణనివ్వడంతో పాటు, వారి బాగోగులను అజమాయిషీచేసే క్రీడా మంత్రిత్వ శాఖ, రెజ్లింగ్‌ సమాఖ్య, స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలలో ఏ ఒక్కటీ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదు. అంతేకాదు, ఇవేవీ క్రీడాకారుల విషయంలో స్నేహపూర్వకంగా వ్యవహరించడం లేదు. మహిళా క్రీడాకారులనుంచి తరచూ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, వాటి విషయంలో సానుకూలంగా వ్యవహరించడమన్నది జరగడం లేదు. రెజ్లర్ల ఫిర్యాదులపై ఓవర్‌సైట్‌ కమిటీ విచారణ సాగిస్తున్న సమయంలో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను పదవీ బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా క్రీడాకారులు కోరినప్పటికీ క్రీడా మంత్రిత్వ శాఖ వారి విజ్ఞప్తిని పెడచెవిన పెట్టింది. ఈ కమిటీ విచారణ వ్యవహారంలో శరణ్‌ సింగ్‌ కల్పించుకుంటున్నట్టు క్రీడాకారులు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ కమిటీ విచారణ కూడా శరణ్‌ సింగ్‌కు అనుకూలంగా జరిగినట్టు క్రీడాకారులు భావిస్తున్నారు. క్రీడాకారుల పట్ల సానుభూతితో వ్యవహరించి, వారి పక్షాన నిలబడవలసిన క్రీడా మంత్రిత్వ శాఖ, రెజ్లర్ల సమాఖ్య మొదటి నుంచీ క్రీడాకారులకు ప్రతికూలంగా వ్యవహరించడం వారికి ఇబ్బందికరంగా, సమస్యాత్మకంగా తయారైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News