Wednesday, July 3, 2024
Homeఓపన్ పేజ్Yadagiri Narasimha Swamy: యాదగిరి నరసింహ శతకాలు - ఒక పరిశీలన

Yadagiri Narasimha Swamy: యాదగిరి నరసింహ శతకాలు – ఒక పరిశీలన

రెండవ తిరుపతిగా పేరొందిన శ్రీ యాదగిరి నరసింహ క్షేత్రం

తెలంగాణలో ప్రసిద్ధమైన క్షేత్రాలలో శ్రీ యాదగిరి క్షేత్రం ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోనే రెండవ తిరుపతిగా పేరొందిన శ్రీ యాదగిరి నరసింహ క్షేత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మకుటాయమానంగా విరాజిల్లుతూ ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టింది. అలాంటి ఈ జిల్లాలో దాదాపు 30 నరసింహ క్షేత్రాలున్నాయి. అవి 1) యాదగిరిగుట్ట 2) పెద్దిరెడ్డిగూడెం 3) ఇబ్రహీంపూర్‌ 4) మగ్దుంపల్లి 5) వెంకటాపురం 6) బిజిలాపూర్‌ 7) వేముల కొండ వద్ద వెంకటాపూర్‌ 8) కక్కిరేణి 9) ఎరుగట్లపల్లి 10) మదనాపూర్‌ 11) తుంగపాటి గౌరారం 12) సారంపేట 13) సైకనూరు 14) వాడపల్లి 15) కొంపల్లి 16) శాపల్లి 17) మేళ్ళదుప్పలపల్లి 18) నందాపూర్‌ 19) కందగట్ల 20) ఉర్లగొండ 21) శిరికొండ 22) గొట్టిపర్తి 23) కుక్కడం 24) తుంగతుర్తి 25) అర్వపల్లి 26) చందుపట్ల 27) రేపాల 28) సిరిసెనగండ్ల 29) మట్టపల్లి ప్రాంతాలలో దర్శనమిస్తాయి.
యాదగిరిగుట్టలోని నవనారసింహుల్లో ముఖ్యమైన పంచ నారసిం హులు ఉన్నారు. నారసింహ నవకారే పంచ రూపస్య వైభవమ్‌ ద్రష్టుమిచ్చామి హేనాధ ప్రకాశం కురు మే ప్రభో‘ అని పలికిన యాదర్షి తపఃఫలంబు నకు మెచ్చి స్వామి ఐదు రూపాల్లో ప్రత్యక్షమవుతాడు. ప్రప్రధమంగా ఉగ్రనారసింహ రూపంలో దర్శనమిస్తాడు స్వామి, రెండవ అవతారం జ్వాలా నరసింహస్వామి రూపం తర్వాత యోగానంద స్వామి రూపంగా గండ బేరుండ రూపంగా లక్ష్మీనరసింహస్వామి రూపంగా అవతరించి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. యాదర్షికి ఈ విధంగా క్షేత్రం పంచ నరసింహు లుగా ప్రసిద్ధి కెక్కింది.
తెలుగు సాహిత్యంలో శతకం ఒక శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ. కవి తన భావాలను, అనుభవాలను ఛందోబద్ధంగా ప్రకటించే అలవాటును అలవర్చుకున్నప్పుడు తప్పనిసరిగా శతకం రాయగలడు. శతకంలో ఉన్న స్వేచ్ఛ మరే ఇతర ప్రక్రియలోను కవికి లేదు. భక్తినీ, ముక్తినీ, దూషణ, భూషనాధులను, ఆత్మాను భూతిని, అవేదనను, భావనావైవిధ్యాన్ని కవి శతక రచన ద్వారా వ్యక్తం చేస్తాడు. యాదగిరి క్షేత్రంలో వెలసిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మహత్మ్యములను వర్ణిస్తూ ఎందరో కవులు వంద లాది శతకాలు రచించారు. కేవలం భక్తితో రచనలు చేసిన వారు కొందరైతే, మరికొందరు తమ బాధలను నివారించి నందుకు, తమ రోగాలు మాన్పించి నందుకు తమ కోరిక లు తీర్చినందుకు రచనలు చేశారు.
‘ముక్తికి మార్గం భక్తి‘ అని పెద్దలంటారు. ఆ భక్తి సాత్విక, రాజస, అర్త, అర్ధార్ధి, అహేతుక, రాగాత్మకాలుగా తొమ్మిది విధాలుగా భక్తులు ఉంటారని విజ్ఞులు చెప్పారు. ఆ భక్తియే భక్తుల హృదయమనెడు వీణియపై తరంగితమై స్పందించి కవితా వాహినిగా రచనా రూపంగా పరిణ మిస్తుంది.
‘పరమ దైవమునకు నరసింహునకు ప్రభావం అమే యమని ఆదిరాజు వీరభద్రరావు తెలిపారు. అలాగే ఆయనే ‘సుందర కందరంలో లక్ష్మీ సమేతులై భక్తజన విధేయుడై అయి నిత్య పూజలందుతున్న వైద్య నరసింహుడని పేర్కొ న్నారు. శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని గూర్చి అనేక శతకాలు రచించిన వారిలో ముందుగా పేర్కొన దగిన వారు నిడికొండ బలరామ శర్మ. వీరు ఈ దేవస్థాన ఆస్థానకవి. నల్లగొండకు సమీపంలో ఉన్న నకిరేకల్‌ మండ లంలోని మంగలపల్లి ఈయన జన్మస్థలం. వీరు యాదగిరి క్షేత్రంలో స్వామి సేవ చేసి ఆ స్వామి క్షేత్ర గొప్పదనాన్ని భక్తులకు తన రచనల ద్వారా తెలిసి ధన్యులైనారు. నలభై సంవత్సరాలుగా తన జీవితం స్వామి సేవకే అంకితమిచ్చి స్వామిచే ప్రబోధితుడైనాడు. ఈ కవి రచించిన యాదగిరి నృసింహశతకం 1940లో ముద్రించబడింది. ఇందులో 101 సీస పద్యాలున్నాయి. ‘పరమపదవాస శ్రీయాదగిరి నివాస. భవ్య లక్ష్మీ నృసింహ ప్రభావ దంహ’ అనే మకు టంతో కూడిన పద్యాలు మనోహరమైన శైలిలో ప్రసాద గుణ భూయిష్టంగా శోభిల్లాయి. యాదగిరి గుట్ట గొప్పత నాన్ని ఈ క్రింది పద్యంలో కవి చక్కగా వర్ణించారు.
తాపత్రయాలెల్ల తరిమివేసెడు గుట్ట యాపత్తులను పెక్కులణచు గుట్ట ఘనమైన కీర్తిచే గ్రాలుచుండెడు గుట్ట ధనమదాంధుల తలల్‌ తన్ను గుట్ట ప్రారబ్ద కర్మముల్‌ బడ గొట్టగల గుట్ట భక్తవతంసులన్‌ బ్రోచు గుట్ట నరకూప శ్రేణి నరికట్ట గల గుట్ట గురిగల్గు వారలన్‌ గూల్చు గుట్ట పేద సాదల వేలెడి పెద్ద గుట్ట వేద మత ఘోషచే సదా వెల్గు గుట్ట కట్టుబోతుల విద్యల గాల్చు గుట్ట ధరణిపై యాదగిరి గుట్ట ధర్మపుట్ట.
యాదగిరి క్షేత్రంలో వెలసిన లక్ష్మీనరసిహస్వామిని గూర్చి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కవులెందరో శతక స్తోత్రాది కవితా పుష్పార్చన చేసి ధన్యులైనారు. మరింగంటి కవుల వంశానికి చెందిన ప్రముఖ కవి మరింగంటి సింగ రాచార్యుల తర్వాత చెప్పుకోదగినవారు మరింగంటి అప్ప లా చార్యులు. వీరు 120 కంద పద్యాలతో యాదగిరి నర సింహ శతకాన్ని రచించారు. ఈ శతక రచనాకాలం క్రీ. శ. 1700 తర్వాత అని తెలుస్తుంది. ఈ శతకమునందు నర సింహ వైభవం, అవతార ప్రశస్తి ముఖ్యాంశాలు. యాదగిరి స్వామిని సేవించినట్లయితే సమస్త బాధలు నశిస్తాయని, ఆయన రోగుల పాలిట కల్పతరువు అని పేర్కొన్నారు. మరింగంటి కవుల వంశానికి చెందిన మరో కవి మరిం గంటి వేంకట (ఐదవ) నరసింహాచార్యుల కుమారుడైన మరింగంటి పురుషోత్తమాచార్యులు ‘యాదగిరి లక్ష్మీ నర సింహ ప్రభు అనే మకుటంతో 108 శార్దూల మత్తేభాలతో శతకం రచించారు. ఈ శతకం 1970లో అచ్చయింది. యాదగిరిగుట్టకు చెందిన మరో కవి ఈగ బుచ్చిదాసు యాదగిరివాస నరహరి సాధు పోష అనే మకుటంతో శ్రీ యాదగిరి నరహరి శతకం రచించారు. అలాగే ముడుంబై వరదాచార్యుల ‘నృసింహశతకం’ మరింగంటి వేంకట రామానుజాచార్యుల యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, పైడిమర్రి వేంకట సుబ్బారావు సింగపూరీ నృకేసరీ శతకం కొలనుపాకకు చెందిన తిరువాయిపేట వేంకటకవి రచిం చిన యాద గిరీంద్రశతకం‘ యాదగిరి నృసింహ శతకాలు. మెరుగు వెంకటదాసు శ్రీన్న కేసరీ శతకం, యాదగిరి గుట్టకు చెందిన గోవర్ధనం పురుషోత్తమాచార్యులు రచిం చిన యాదగిరి నృకేసరీ శతకం, భువనగిరి రామదాసు లక్ష్మి నృసింహ శతకం, 18వ శతాబ్దానికి చెందిన తాడిపర్తి లక్ష్మణదాసు రచించిన నృసింహ శతకం, మరింగంటి వేంకట నరసింహాచార్యుల యాదగిరి లక్ష్మీనృసింహ శత కం, గాదె రామచంద్రరావు అర్వపల్లి నృసింహ శతకం, విద్వత్కవి ఎన్‌. నరసింహాచార్యులు రచించిన ‘యాదగిరి నరసింహ శతకం బచ్చెళ్ళపాటి వెంకట రామారావు నృ కేసరీ శతకం, సాధు వెంకట నారాయణస్వామి యాదగి రీంద్ర శతకాలే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెం దిన అనేక మంది కవులు పండితులు శ్రీయాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వైభవమును గూర్చి శతక కావ్యాలు రచించి స్వామి భక్తిని మరింత ఇనుమడింప చేశారు.

- Advertisement -

-కాటేపల్లి అర్చన
9573518292

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News