Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Youth-parenting and end result: ఉడుకు రక్తం-చెడు మార్గం ఇదీ యువత జీవితం

Youth-parenting and end result: ఉడుకు రక్తం-చెడు మార్గం ఇదీ యువత జీవితం

బాధ్యతంతా బాలల పెంపకంలోనే!

కౌమారం దశ బహు విచిత్రమైంది. వయసు చేసే అల్లరి తల్లిదండ్రులను ఎదిరించి పంతం నెరవేర్చుకునేలా చేసేది ఈ దశే. ఇంట్లో లభించే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ యువత పాశ్చాత్య పోకడల వైపు పయనిస్తూ పెడదోవ పట్టేది ఈ వయసులోనే. సెల్ఫోన్ లలో, కంప్యూటర్లలో అశ్లీల కార్యక్రమాలను వీక్షించడం, వీడియో గేమ్లు ఆడటం, చాటింగ్ చేయడం, సెల్ఫోన్లతో గంటల తరబడి మాట్లాడడం, దూమ, మద్యపానం లాంటి దురలవాట్లకు ఆకర్షితులవుతున్న టీనేజీ యూత్ పై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

దుంపతెంచే పాకెట్ మనీ

నేటి తరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్ మనీ ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు. దీంతో వారు జల్సాలకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా ఖరీదైన సెల్ ఫోన్లు, బైక్లు ల్యాప్టాప్ లు కొనిస్తుండడంతో వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

ఆకర్షణకు బందీ..

టీనేజి యువతీ యువకులు ఆకర్షణకు బందీ అవుతున్నారు. ప్రేమ, స్నేహమో తెలియని పరిస్థితి నెలకొంది. స్నేహానికి ప్రేమకు మధ్య అంతరాన్ని గుర్తించడం లేదు. టీనేజీ భావనలను అధిగమించలేకపోవడం, సినిమాలు, టీవీల ప్రభావం ఇంటి వద్ద సమస్యలు తదితర కారణాలతో ప్రేమలో పడుతున్నారు. ప్రేమే లోకం జీవితం అన్నట్టుగా మునిగిపోతున్నారు. దీంతో చదువు పెడదారిన పడుతోంది. గతంలో విద్యార్థులు చదువు, కెరీర్ కు సంబంధించిన విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. ప్రేమలో విఫలమైతే ఉన్మాదులుగా మారుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ టీనేజ్ వయసులోనే ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇంటర్ నుండే..

సిగరెట్, బీరు తాగడం హీరోయిజంగా, ఫ్యాషన్ గా, స్టైల్ స్టేట్మెంట్, ట్రెండింగ్ హాబీగా, వీకెండ్ కల్చర్ గా భావిస్తున్నారు. నేటితరం యువత ఇంటర్ నుంచి వాటిని అలవాటు చేసుకుంటున్నారు. గుట్కాపై నిషేధం ఉన్నా యువత గుట్కాకు ఎలా బానిసలు అవుతున్నారన్నది ఆందోళన కలిగించే మరో విషయం. ముఖ్యంగా సిగరెట్ అనే వ్యసనం అబ్బాయిలు-అమ్మాయిల్లో చాలా కామన్ గా మారిపోయింది. సరదాగా దమ్ము లాగటం కాలేజీ లైఫ్ లో రొటీన్ గా మారిందంటే అతిశయోక్తి కాదు.

ఇంటర్నెట్ తో..

చాలామందికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే మానసిక జిజ్ఞాస ఉత్సుకతంగా మారుతుంది. హైస్కూల్ వయస్సు మొదలయ్యే ప్రాయంలోనే అధికంగా ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఏమాత్రం అప్రమత్తత లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే. నెట్ తో అనుసంధానం కాగానే అప్రయత్నంగానే ప్రత్యక్షమయ్యే అవాంఛనీయ ప్రకటనలు, చిత్రాలు, మనస్సును కలుషితం చేస్తుంది. 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే ప్రారంభించాల్సిన ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ఖాతాను తప్పుడు జనన తేదీలతో ఆరంభిస్తున్నారు. యాప్స్ ద్వారా సునాయాసంగా విషయాలను, చిత్రాలను, దృశ్యాలను పంచుకుంటున్నారు. యూట్యూబ్లో మంచి-చెడు రెండూ సమ పాళ్లలో ఉంది.

వ్యసనంగా సెల్ఫోన్..

నేడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ వ్యసనంగా మారింది. బైక్ నడుపుతూ రోడ్డు దాటుతూ, రైలు పట్టాలు దాటుతూ సెల్ఫోన్లో మాట్లాడటం సాధారణంగా మారింది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గంటల తరబడి మాట్లాడడం వల్ల సమయం వృధా అవుతుంది. ఇటీవల కాలంలో సెల్ఫీలతో కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. హెడ్ ఫోన్స్ తో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

కుర్రాళ్ళు జాగ్రత్త..

అతివేగంగా వెళ్లేందుకు సరిపోయే వాహనాల కొనుగోలువైపే యువత మొగ్గుచూపుతున్నారు. ఖరీదైన బైక్ లపై మోజు గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా ప్రమాదాల బారిన పడుతున్న యువత సంఖ్య మరింతగా పెరుగుతోంది. అయితే తమ పిల్లలకు బైక్లను సమకూరుస్తున్న తల్లిదండ్రుల పైనే చాలా బాధ్యత ఉందనే విషయాన్ని గమనించాలి. చేతికొచ్చిన పిల్లలు మృత్యువాత పడితే కడుపుకోత బాధ గురించి పిల్లలకు తెలియజేయాలి. బైకులు కొనిచ్చినప్పటికీ వాటి నిర్వహణపై తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి..

మద్యానికి బానిసలుగా..

యుక్త వయసు ఉన్నవారు ఆల్కహాల్కు బానిసవుతున్నారు. కొన్నిచోట్ల యువకులు మద్యం కోసం ప్రత్యేక బడ్జెట్ను తయారు చేసుకుంటున్నారు. తమ పాకెట్ మనీలో 70% వరకు ఆల్కహాల్ కే ఖర్చు పెడుతున్నారు. మద్యానికి డబ్బులు లేని సమయంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కేసులు సంఖ్య ఉన్నట్టుండి పెరుగుతుండటం, సైబర్ క్రైమ్ కేసుల వెనకున్నది ఇలా జల్సా చేసే యువ జల్సా రాయుళ్లే కావటం తల్లిదండ్రులంతా గుర్తించాల్సిన విషయం. ఇక మద్యం మత్తులో వాహనాలు ప్రమాదాలకు బలయ్యే యువ జనాభా మనదేశంలో చాలా ఎక్కువ. మైనర్లు చాలా చిన్న వయసులోనే మద్యానికి బానిసలు కావటం విచిత్రమైన విషయంగా మారింది. ఈ మైనర్లు పెద్ద సంఖ్యలో పబ్బుల్లో పార్టీలు చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవటం స్టేటస్ సింబల్ గా మారిపోయింది.

నైతిక విలువలకు ప్రాధాన్యం

విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండి నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలి. మానవత్వం గురించి చెప్పాలి. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండేలా చూడాలి. చదువు, కెరీర్ పైన దృష్టి సారించేలా చూడాలి. తల్లిదండ్రులతో అభిప్రాయాలు పంచుకునేలా స్వేచ్ఛగా వెల్లడించాలి. సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. జీవితమంటే సరదాలు, షికారులే కాదని కనువిప్పు ప్రయోగాత్మకంగా కల్పించేలా పిల్లల పెంపకం ఉండాలి. యువత తమకు నచ్చిన లక్షాలు నిర్దేశించుకుని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. ప్రేమే జీవితం కాదు.. జీవితంలో ప్రేమ ఓ భాగం మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణ-ప్రేమ మధ్య జీవితాన్ని తగలబెట్టుకోవద్దని ఇంట్లో పెద్దలే తెలియజేయాలి.

తల్లిదండ్రుల బాధ్యత పెరగాలి..

విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. విద్యార్థులను కేవలం ఉద్యోగాలు సంపాదించి యంత్రాలు గానే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు. వారి ప్రవర్తన ఏ విధంగా ఉందని కనిపెడుతుండాలి. విద్యతో పాటు నైతిక విలువలు మానవత్వం సామాజిక బాధ్యతలు నేర్పాలి.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి..

“మారుతున్న సమాజంలో తల్లిదండ్రులు సంపాదన మీద చూపుతున్న శ్రద్ధ కుటుంబంపై చూపడం లేదు. ప్రధానంగా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలి. మానవీయ విలువలను తెలియజేయాలి. పిల్లలకు ఆత్మీయత అనురాగాలు అనుబంధాలను పెంపొందేలా అర్పించాలి”.

-సాయిబాబు, ఎస్ఐ
ముల్కనూర్

యాంత్రికంగా మానవ సంబంధాలు

“ప్రస్తుతం తల్లిదండ్రులకు సంపాదనపై ఉన్న ధ్యాసం కుటుంబంపై ఉండడం లేదు. ఆలుమగల మధ్య సంబంధాలు యాంత్రికంగా మారడంతో అనుబంధం ఆత్మీయత, అనురాగం దూరమవుతున్నాయి. వీటి ప్రభావం పిల్లలపై పడుతుంది. పిల్లలు పాశ్చాత్య పోకడలు పట్టకుండా చూడాల్సింది తల్లిదండ్రులదే, వ్యక్తిత్వ వికాసం నైతిక విలువలపై అవగాహన కల్పించాలి”.

తాళ్ల వీరేశం, ఉపాధ్యాయులు ఆదర్శ పాఠశాల, ముల్కనూర్

నైతిక విలువలు, అనుబంధాలు, జీవితంపై ఉండాల్సిన అవగాహన వంటి విషయాలపై బాల్యంలోనే బలమైన పునాదులు నిర్మిస్తే మైనర్ల భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. ఇది యువతకే కాదు వారి తల్లిదండ్రులు, స్నేహితులకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుందనేది అమ్మాయిలు, అబ్బాయిలు మరవరాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News