Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్జయహో ! ఓయూ సాహిత్య వేదిక

జయహో ! ఓయూ సాహిత్య వేదిక

ఎలాంటి ఎంట్రీ ఫీజులు లేవు

“ఈ సృష్టిలో బలమైన సంకల్పంతో తలపెట్టిన ఏ కార్యమైనా అఖండ విజయం సాధిస్తుంది”,
అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం “ఓయూ సాహిత్యవేదిక.
‘ఓయూ సాహిత్య వేదిక’ ఆవిర్భావ చరిత్ర:
కవితా దుందుభిలో పాల్గొన్న ‘ఓయూ సాహిత్య వేదిక’ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన డాక్టర్ శివరాత్రి సుధాకర్ గారు సాహిత్య వేదిక ఏర్పాటు చేయడానికి దోహదం చేసిన పరిస్థితులను వివరించారు. గ్రామీణ శ్రామిక కుటుంబాల నుంచి వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో M.A తెలుగు చదువుతున్న రోజులలో సాహిత్య సంబంధమైన వాతావరణము ఏది వారికి కనిపించకపోవడంతో, సాహిత్యానికి సంబంధించిన చర్చలు నిరంతరం చేసేవారు. ఈ సాహిత్య చర్చలో భాగంగా నాళేశ్వరం శంకరం, సలంద్ర, గుంటూరు ఏసుపాదం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి నందిని సిద్ధారెడ్డి వంటి మేధావులు ఏర్పాటు చేసిన ‘ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్’ ను ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రస్తావించారు .
1970 నుంచి 80 దశాబ్దంలో సాహిత్య చరిత్ర మలుపు తిప్పిన ఆ కాలాన్ని గొప్పగా అర్థం చేసుకొని ఆనాటి సాహిత్య సమాజం అధ్యయనం చేశారు ఏమి రాయాలి, ఏమి మాట్లాడాలి, సమాజ గమనంలో తమ పాత్ర ఏమిటని ఒక నిర్ణయానికి వచ్చారు.1970 నుంచి 80 మధ్య కాలంలో వచ్చిన కవిత్వాన్ని ‘ ఈతరం యుద్ధ కవిత ‘ అనే కవితా సంపుటిని సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారి సంపాదకత్వంలో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఈ కవితా సంకలనంలో 1971 నుంచి 1980 మధ్యకాలంలో రాసిన పత్రికలలో వచ్చిన కవిత్వాలను గ్రంథాలయాల వెంట తిరిగి, నాణ్యమైన చరిత్రను నమోదు చేసిన ప్రజల పోరాటాలతో కలిసి నడిచిన కవిత్వాన్ని ‘ ఈ తరం యుద్ధ కవిత’ పేరుతో ముద్రించారు.

- Advertisement -

ఈ కవితా సంపుటిలో దాదాపు 31 కవితల్ని 30 మంది కవులు రాశారు. ‘ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్
సర్కిల్’ ఏర్పాటు సభ్యులలో ఒకరు గా ఉన్న ‘సలంద్ర’ రాసిన సమగ్ర సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ‘ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్’ వదిలి వెళ్లిన సాహిత్య స్ఫూర్తితో తెలుగు శాఖ ప్రొఫెసర్ చింతకింది కాసిం గారి దిశా నిర్దేశంతో ఓయూ సాహిత్య వేదికను ఏర్పాటు చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న 2017 సంవత్సరము లోనే డిసెంబర్ 5వ తేదీన ‘ఓయూ సాహిత్య వేదిక’ తొలి ఆవిర్భావ సభ ‘ వంద కలాలు వంద గళాలు ‘ అనే పేరుతో ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ 57 లో ఈ ఆవిర్భావ సభను నిర్వహించారు. సెమినార్ హాల్ మొత్తం నిండి హాలు బయట కూడా వంద మందికి పైగా నిలబడ్డారు. ఈ సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చదువుకొని 2017 నాటికి జీవించి ఉన్న దాదాపు వంద మంది కవులు, కళాకారులు, విమర్శకులు, రచయితలు, బుద్ధి జీవులందరిని ఆహ్వానించి వారికి ఆర్ట్స్ కాలేజీకి, తెలుగు శాఖతో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు కూడా అందించాలని ఆనాడే సాహిత్య చర్చలు చేయాలనిఆలోచనకు బీజం పడింది.శివరాత్రి. సుధాకర్, బర్ల.మహేందర్ , అమాలాశ్రీ , బత్తుల.లింగయ్య, గోపాగల్ల.ప్రతాప్ ఈ ఐదుగురు కలిసి ‘ఓయూ సాహిత్య వేదిక’ను స్థాపించారు. ఈ సాహిత్య వేదిక స్థాపనలో కర్త, కర్మ, క్రియ, ప్రొఫెసర్ చింతకింది కాసిం సార్. వీరి ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య సమావేశాలు చర్చలు, కవితా గోస్టులు నిర్వహించారు. వీరి తర్వాత ‘ఓయూ సాహిత్య వేదిక’ను ఇమ్మిడి.మహేందర్ చేపట్టి పలు కార్యక్రమాలను జరిపారు. తదనంతరం 2022-2023 విద్యా సంవత్సరంలో నూతనంగా వచ్చిన తెలుగు పరిశోధక విద్యార్థులు ఈ బాధ్యతలను చేపట్టారు. ‘ఓయూ సాహిత్య వేదిక’ ప్రస్తుత అధ్యక్షుడు బొడ్డుపల్లి.అఖిల్. సభ్యులుగా బూడిద.ఆంజనేయులు, జబ్బు. మధు, కురుమయ్య యాదవ్, ప్రవీణ్ కుమార్,గుర్జకుంట స్వరాజ్,పల్లె.సతీష్,తీగల.లావణ్య, శాంతి, లక్ష్మి , మారేపల్లి లక్ష్మణ్, రామ్, జయప్రకాశ్, మహేష్, సోమనాథ్ మరియు M.A తెలుగు విద్యార్థుల ఆధ్వర్యంలో పలు తెలుగు సాహిత్య కార్యక్రమాలలో భాగంగా ఇటీవలే ‘కవితా సింగిడి’, ‘నాకు నచ్చిన కవిత’ అనే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.
ఓయూ సాహిత్య వేదిక ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పరిశోధక విద్యార్థులు, M.A తెలుగు విద్యార్థులు కలిసి 14 డిసెంబర్ 2023 గురువారం రోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ‘కవితా దుందుభి’ సాహిత్య సభ కన్నుల పండుగగా నిర్వహించారు. తెలుగు శాఖ విద్యార్థులు అందరు కలిసి చాలా శ్రద్ధతో సభ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను చేసారు. ఆర్ట్స్ కళాశాల ముఖద్వారం నుంచి మొదలుకొని తెలుగు శాఖ వరకు అదేవిధంగా సభను నిర్వహించే 133 సెమినార్ హాల్ వరకు రంగు రంగుల ముగ్గులతో, పూలమాలలతో అలంకరించి వేదికను సిద్ధం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఓయూ సాహిత్య వేదిక నిర్వహిస్తున్న ఆరోవ వార్షికోత్సవంలో ప్రధాన ఎజెండాగా’ తెలుగు సాహిత్యంలో మానవీయ విలువలు’ అనే థీమ్ ఆధారంగా పద్యం, పాట,వచన కవిత్వం అనే మూడు ప్రక్రియలలో పేరు ప్రఖ్యాతి గాంచిన ప్రముఖులను ఆహ్వానించారు.స్వాగతోపన్యాసం తెలుగు పరిశోధక విద్యార్థిని కుమారి తీగల లావణ్య ప్రారంభించి సభయొక్క ప్రాముఖ్యతను వివరించి ముందుగా సభాధ్యక్షులు తెలుగు శాఖాధిపతి ప్రొఫెసర్ చింతకింది కాసీం గారిని, తరువాత గౌరవాధ్యక్షులు ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ చింతా గణేష్ గారిని, మిగతా అతిథులందరిని వరుసగా వేదిక మీదికి ఆహ్వానించి ధన్యవాదాలు చెప్పి మైక్ సభాధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం సర్ కి అందించింది లావణ్య.

సభాధ్యక్షులు ప్రొఫెసర్.చింతకింది కాసిం గారు గౌరవ అధ్యక్షులుగా విచ్చేసిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారిని కోరారు.‘సాహితీ దుందుభి’ సభకు గౌరవ అతిథిగా హాజరైన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత గణేష్ గారు మాట్లాడుతూ తెలుగు శాఖ ప్రొఫెసర్లకు, పరిశోధక విద్యార్థులకు, పీజీ విద్యార్థులకు, అవును కళాకారులు రచయితలకు, శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల గొప్పదనాన్ని వివరిస్తూ తెలుగు శాఖ నుంచి వచ్చిన గొప్ప గొప్ప కవులను గొప్పదనాన్ని వివరించారు. రాబోయే కాలంలో ఈ ఓయూ సాహిత్య వేదికకు జాతీయ, అంతర్జాతీయ, గుర్తింపు రావాలి అని కోరుకున్నారు. ఇప్పటినుంచి ఓయూ సాహిత్య వేదిక కనీసం నెలలో ఒక సమావేశమైనా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో ఉండే క్రియేటివిటీ, క్రియేటివ్ థాట్స్ అనేవి నిరూపించుకునేందుకు ఓయూ సాహిత్య వేదిక గొప్ప వేదిక కావాలి అని ఆకాంక్షించారు. తరువాత ఒక్కో సాహిత్య ప్రక్రియతో సాహితి దుందుభీ మారుమ్రోగి పోయింది.
1.పద్య పరిమళం:-
సభాధ్యక్షులు ప్రొఫెసర్ కాసీం సార్ సభను మొదటగా పద్య ప్రక్రియను తీసుకుని అక్కిరాజు సుందర రామకృష్ణ గారితో ప్రారంభించారు. అక్కిరాజు గారు మంచి వేషధారణతో సభను అలంకరించారు. తన పద్యాలను గానామృతం చేయడానికి వయోలిన్ వాయిద్యమును జోడించి బహు రమ్యంగా జాషువా గొప్పతనాన్ని గూర్చి చెప్పి ఒక జాషువా పద్యాన్ని గానం చేశారు. భక్త చింతామణి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపిస్తూ, బిల్వమంగళుడికి చింతామణికి మధ్య సాగిన ప్రధాన ఘట్టంలోని పద్యాలకు మానవీయ విలువలను జోడించి చెబుతూ కృష్ణ తత్వాన్ని వివరించారు.చింతల థామిని గుఱ్ఱం జాషువా గారి పద్యాలను అత్యంత ఆర్ద్రంగా నాటకీయంగా గాత్రంలో హెచ్చుతగ్గులు పాటిస్తూ ఆలపించింది. థామినీ పద్యగానం తో సభ మొత్తం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. ప్రముఖ రంగస్థల నటుడు, కవి, రచయిత మీసాల లక్ష్మణ్ గారు తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే శ్రీనాధుని’ వచియుంతు వేములవాడ భీమన భంగి’ అనే పద్యాన్ని, రామరాజభూషణుడి పద్యం లలనాజనా పాంగవలన ……. అనే పద్యం , భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు నేర్పించే పద్యం ‘ మడులు కానే కావు అనే పద్యాలతో ప్రేక్షకులకు వీనుల విందును చేస్తూ మధురమైన గానామృతం పంచాడు.తలారి డాకన్న గారు మహాభారతం లో నర్తనశాల యేనుంగునెక్కి………….పద్యాన్ని ఆలపించి సభను మైమరపించారు.
2. పాటల ప్రవాహం:-
పాటమ్మ రాంబాబు పాట పుట్టుపూర్వోత్తరాలను వివరిస్తూ అంబేద్కర్ పాటలోని కొన్ని లైన్లను పాడినారు, సంబరం వేసినప్పుడు బాధలు కలిగినప్పుడు ఆ భావోద్వేగాల నుంచి పుట్టేదే పాట అంటూ పాట ద్వారా కొత్త చరిత్రనే రాయాలి అన్నారు. పాట తన భవిష్యత్తుకు దారి చూపేదిగా ఉంటుందంటూ, తాను పాడిన కొన్ని ప్రసిద్ధ పాటలను పాడి వినిపించారు ‘అవకాశాలు అందక పోయిన ఆపకు నీ పయనం అనుక్షణం నీలో జరగాలి మేథోమథనం అంటూ పాటల్లో ఉన్న స్ఫూర్తిని తెలియజేశాడు.రేలారే గంగ పాట యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ తాను పాట వైపు రావడానికి తోడ్పడిన సంఘటనను గుర్తు చేస్తూ రేలారే ప్రోగ్రాంకి ఎన్నికైన విధానాన్ని అదేవిధంగా కోవిడ్ సోకి తాను హాస్పిటల్ పాలైనప్పుడు పాటనే తనను బ్రతికించిన సంఘటనలు కొన్ని వివరించి ‘ పుట్ట మీద పాలపిట్ట జాజిమొగులాలి’ అనే పాటను పాడుతూ ఉర్రూతలూగించారు. తులసి గారి నరసింహ మానవీయ విలువలకు సంబంధించిన పాట
‘అన్నలారా తమ్ములారా…….అంటూ పాడిన పాట ప్రతి ఒక్కరిని ఆనందింప చేసింది. చుక్కా రాం నర్సయ్య విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మానవత్వం మనిషి యొక్క విలువలను గుర్తు చేశాడు. రాగం అనేది ఈ సృష్టిలో అమ్మ పడే పురిటి నొప్పుల బాధను మించిన రాగం తీయగలిగేటువంటి గాయకుడు ఉంటే నాకు మరణం వచ్చే లోపు ఒక్కసారి వాని కాళ్లు మొక్కాలని ఉంది అన్నారు. తాను పాడిన ప్రసిద్ధ పాట’ నాయనా ఉండలేక రాస్తేనే ఓ అక్షరం అనే పాటను పాడారు. ఏ సాహిత్య కారులైన మానవ జీవితం లేకుండా ఏ పాట, కవిత్వము రాయలేరని తెలిపాడు. తన ప్రసంగం ద్వారా రెండు ముఖ్య విషయాలు తెలిపారు.భాష ద్వారా ఆధిపత్య భావజాలాన్ని మన మెదడులోకి ఎలా ఇంజెక్టు చేస్తారో, ప్రతి
ఒక్కరికి అర్థమయ్యేలా వివరించారు.
సభాధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం గారు పాట గురించి చెబుతూ పాటలోని పదబంధాలు మనకు తెలియని భావజాలాన్ని మనలో ఎలా చొప్పిస్తాయో కళ్యాణ రావు గారు రాసిన ఒక మాట గుర్తు చేశారు ‘మా అయ్య అలిన దాన్ని/ వాని అయ్య రాసిండు/ రాత రాజు అయ్యింది/ అల్లిక అంటరానిదయింది’. ఈ మాటకు సభ మొత్తం దద్దరిల్లేలా చప్పట్లు వేశారు. పాటను ఎలా అల్లాలి, దానిలోని అర్థము, భావము, ప్రతి ఒక్కరికి తమ పాటల ద్వారా అద్భుతంగా వివరించారు.పాట యొక్క గొప్పతనాటి వివరిస్తూ ప్రొఫెసర్ కాసిం సార్ మరొక పాట సుక్కా బొట్టు బెట్టుకోని చంద్రన్న /సూరుకింద నిలబడితే చంద్రన్న /వాడు జూసే సూపులకు చంద్రన్న / సుక్కా బొట్టు సెదిరిపాయెరో చంద్రన్న అనే పాట పాడుతుంటే విద్యార్థులంతా చప్పట్లతో
తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
3. వచన కవిత్వ ఒరవడి:-
నందిని సిధారెడ్డి గారు సాహిత్యం మానవీయ విలువలు అనే అంశంలో వచన కవిత్వం, పాటలో ఉన్న సృజనాత్మకతను వివరించి చెప్పారు. ఈ సందర్భంగా సభకు వచన కవితా పితామహుడైన కుందుర్తి ఆంజనేయులు గారి వచన కవిత్వం గుర్తుచేసి, వారి మనవరాలు కుందుర్తి కవితను సభకు పరిచయం చేశారు. వచన కవిత్వంలోని నిరాడంబరతను వివరిస్తూ శ్రీశ్రీ కవిత్వాన్ని గుర్తు చేశారు. హృదయంలో కలిగే భావోద్వేగంతో మాత్రమే వచన కవిత్వానికి కనెక్ట్ అవ్వొచ్చు అని తెలిపారు. వచన కవిత్వంలోని సాహిత్యం అనేది ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించి, ఆలోచనలతో కూడిన ఆవేశాన్ని కలిగిస్తుంది. కవిత్వంలో భావవ్యక్తీకరణ చేసే సందర్భంలో భాషలోని పదాలు ఆకర్షించే విధంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పుడే హృదయాలను తాకే కవిత్వం వెలువడుతుంది అది కలకాలం నిలిచి ఉంటుంది. ప్రసిద్ధమైన కొన్ని వచన కవితలోని పదబంధాలను కోడ్ చేస్తూ వినిపించారు. నాగేటి సాలల్లో నా తెలంగాణ, ఒక్క పువ్వు ఒక్క నవ్వు అనే పాటలలో ఉన్న మాధుర్యాన్ని తన మాటల ద్వారా దర్శింపజేశారు.


గోరటి వెంకన్న గారు వచన కవిత్వం, పాట గొప్పతనాన్ని వివరించారు.గాయకుడు జస్రాజు గురించి అతని టాలెంట్ గురించి చెప్పారు. కవిత్వంలోని రసనిష్టను కవిత్వంలో ఉపయోగించే భాష యొక్క పదబంధాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ కంటికి కనిపించే వాటిని ఉన్నది ఉన్నట్లుగా తెలియజెప్పటమే వచన కవిత్వం అన్నారు. కాళ్ళకూరి నారాయణరావు గారి మానవత్వ విలువలకు సంబంధించిన కవిత్వాన్ని వివరించారు. కబీరు యొక్క దోహాల గొప్పతనం, తాను రాసిన అంబేద్కర్ పాట యొక్క గొప్పతనాన్ని, గద్దర్ పాటల లో ఉన్న మానవతా విలువలను గురించి తెలియజేశాడు. కవులకు, రచయితలకు ఉండాల్సిన లక్షణాలు మానవ విలువలు మనిషి అంతరంగాన్ని బాహ్య ప్రకృతికి మధ్య తనలో జరిగే ఘర్షణలు తనను తాను
వ్యక్తీకరించుకోవడమే కవిత్వమైన పాటైనా గానమైన చేయగలిగిన గొప్ప పని అంటూ వివరించారు. కవులు, రచయితలు ఎప్పటికీ ‘బ్రష్ట యోగులే’ అన్నాడు.
తగుళ్ల గోపాల్ సాధారణ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉంటూనే ‘దండ కడియం’ అనే కవిత్వాన్ని రచించి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని పొందాడు. తన జీవితములో మానవీయపద్యంగా నిలిచిన వచన కవిత్వంలో తాను చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లి సమయంలో, మేకల కాడికి వెళ్లి తనను చదివించిన తన అక్క గురించి ఒక అద్భుతమైన కవిత్వం మరియు వీధి వెంట పండ్లమ్ముకునే ఒక ముసలావిడ పైన రాసిన ‘తక్కెడ బాట్లు’ అనే కవిత్వాలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకాయి.

షాజహాన గారు ముస్లిం మైనారిటీ వాద కవిత్వంలో ఉన్న మానవీయ విలువల గురించి వివరిస్తూ, తాను పరిశోధన చేసిన ముస్లిం మైనారిటీ వాదాన్ని గురించి కొంత వివరించారు. శరణ్య ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ ఇంగ్లీషు విద్యార్థిని శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానం లోని కవితా ఓ కవితా అనే కవిత్వాన్ని ధారాళంగా ఊపిరి సలపకుండా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే విధంగా కవితా ప్రవాహాన్ని వెల్లువలా ప్రవహింపజేసింది. ఈ కవిత్వం చెపుతున్నంతసేపు హాలు మొత్తం నిశ్శబ్దంగా వింటూ తన్మయం చెందారు. రాచకొండ రమేష్ మానవీయ విలువలకు సంబంధించిన అమ్మ అనే కవితను మరియు బహుజన కవిత్వాన్ని వినిపించారు. డాక్టర్ చంద్రయ్య ‘పసి దాన్ని ఏనుగు అంబారి ఎక్కించినప్పుడు’అనే కవిత్వాన్ని వినిపించారు. డాక్టర్ ఉదయభాను కవిత్వములో ఉపయోగించే నూతన పదబంధాలను గురించి వివరించారు. ‘ఊర కుక్క’ అనే కవిత మరియు తెలంగాణ ఉద్యమ సమయంలో అప్రయత్నంగా అనే కవితలను వినిపించారు. పేర్ల రాము ‘లోపలి సముద్రం’ అనే కవిత ద్వారా తల్లి యొక్క గొప్పతనాన్ని భారతమాత యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ మహిళలను మానవీయ కోణంలో ఎలా చూడవచ్చు తన కవిత ద్వారా వివరించారు.
ఓయూ సాహిత్య వేదిక ప్రస్తుత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు పరిశోధక విద్యార్థి ‘బొడ్డుపల్లి అఖిల్’ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఓయూ సాహిత్య వేదిక’ ఆరవ వార్షికోత్సవ ‘కవితా దుందుభి’ యొక్క ప్రధాన ఉద్దేశం వివరించారు. ప్రస్తుతము మన కళ్ళముందున్న సమకాలిన అంశాలను ప్రతిబింబించేలా అంతరించిపోతున్న మానవీయ విలువలను, మానవ సంబంధాలు అనే అంశాన్ని థీమ్ గా ఎన్నుకున్నట్లు తెలిపారు. లోకంలో జరిగే సంఘటనల పైన సరైన సమయంలో స్పందించాలనేదే మా ఉద్దేశం అని తన స్పందనను తెలియజేశారు.

‘ఓయూ సాహిత్య వేదిక’ ద్వారా నిర్వహించిన ‘కవితా దుందుభి’ అనే కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ప్రొఫెసర్ చింతకింది కాసిం గారు సభను చాకచక్యంతో, సమయస్ఫూర్తిని పాటిస్తూ, సభ యొక్క మర్యాదను కాపాడుతూ,సభ జరిగినంత సేపు ఎవ్వరికి విసుగు కలిగించకుండా,ఓపికగా కూర్చునే విధంగా తన వాక్యాతుర్యంతో అందరి మనసులను గెలుచుకొని, సభ ఇంకా కొద్దిసేపు జరిగితే బాగుండు అని ప్రతి ఒక్కరికి అనిపించేలా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. చేవెళ్ల యాదగిరి తెలుగు పరిశోధక విద్యార్థి ‘కవితా దుందుభి’ సభ విజయవంతంగా నిర్వహించడానికి సహాయపడ్డ తెలుగు శాఖ ప్రొఫెసర్లందరికీ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత గణేష్ గారికి, సభలో పాల్గొన్న కవులు కళాకారులు గాయకులు రచయితలు అందరికీ, సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపే వందన సమర్పణతో సభ ముగిసింది. తదనంతరం ఈ సభలో పాల్గొన్న అతిధులందరినీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ లోకి తీసుకువెళ్లి తేనీటి విందును ఇచ్చి, ఫోటోలు దిగిన తర్వాత సాదరంగా వీడ్కోలు పలికారు.
ఓయూ సాహిత్య వేదిక భవిష్యత్ కార్యాచరణ:-
ఓయూ సాహిత్య వేదిక ద్వారా తెలుగు సాహిత్యానికి సంబంధించిన చర్చలు, సమావేశాలు, కవితా గోస్టులు వంటి కార్యక్రమాలతో పాటు, మీకు నచ్చిన కావ్యము, కథ, కథానిక, నవల, నాటకం, పాట, పద్యం, వచన కవిత, గేయం, మౌఖిక సాహిత్యము, లిఖిత సాహిత్యము, ఆదికవి నన్నయ నుంచి నేటి కాలం కవులు వరకు వెలువడిన మొత్తం సాహిత్యం పైన నిత్యం చర్చలు జరుపుతూ ఉంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న పాఠశాల విద్యార్థుల నుంచి పరిశోధక విద్యార్థుల వరకు, ఉపాధ్యాయుల నుంచి ప్రొఫెసర్ల వరకు, సాహిత్య అభిమానులు, కవులు, కళాకారులు తమ సాహిత్య పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి ఏర్పాటు చేసినదే “ఓయూ సాహిత్య వేదిక”. ఈ వేదిక ద్వారా ప్రదర్శనలు ఇవ్వడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజులు
లేవు, కావాల్సిందల్లా మీలోని ప్రతిభ మాత్రమే. తెలుగు భాషా సాహిత్యానికి విశిష్టమైన సేవ చేయాలనే తపన ఉంటే సరిపోతుంది. ఓయూ సాహిత్య వేదిక ద్వారా నిర్వహించే తెలుగు సాహితీ సమావేశాలు జీవనదిలా నిరంతరం సాగిపోతూనే ఉంటాయి. ఇట్టి సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని ఆశిస్తూ.

పల్లె సతీష్, తెలుగు పరిశోధక విద్యార్థి
ఉస్మానియా విశ్వవిద్యాలయం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News