కోల్ కతాలోని ఒక ఆస్పత్రిలో 31 ఏళ్ల వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగడం, ఆ తర్వాత ఆమెను అతి దారుణంగా హత్య చేయడం కోల్ కతాలో మహిళల విషయంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళల మీద తరచూ అత్యాచారాలు జరుగుతుండడం, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోగా, దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం శోచనీయం. సాధారణ మహిళలకే కాక చివరికి అక్కడ మహిళా డాక్టర్లకు, మహిళా ఉద్యోగులకు కూడాభద్రత, రక్షణ వంటివి లేకపోవడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. ఆర్.జి. కార్ ఆస్పత్రిలో ఒక యువతిపై ఈ రకంగా హత్యాచారం జరగడంపై దేశమంతా స్పందించింది. సర్వత్రా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. నిజానికి ఇది 2012 నాటి నిర్భయ కేసును మరోమారు గుర్తు చేసింది. అప్పట్లో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా భారీ నిధిని ఏర్పాటు చేయడమే కాక, కొత్త చట్టాలను కూడా తీసుకు రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడమే కాకుండా, వైద్య, ఆరోగ్య యంత్రాంగమంతా పూర్తిగా స్తంభించిపోయింది.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లకు సైతం భద్రత లేకపోవడంపై దేశవ్యాప్తంగా ఒక రోజు ఆస్పత్రులన్నీ సేవలను నిలిపివేశాయి. ఆందోళనలను, నిరసలను నిలిపివేయాలని, డాక్టర్ల సమస్యలను, ముఖ్యంగా భద్రతను పరిశీలించి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని వేయడం జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిజానికి, మహిళా డాక్టర్ పై అత్యాచారం, హత్యకు సంబంధించి మొదట్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించింది. ఆ తర్వాత దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. చివరికి ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తడంతో దారిలోకి వచ్చింది. రాష్ట్రప్రభుత్వం మహిళల భద్రతను తీవ్ర విషయంగా పరిగణించలేదు. పైగా ఈ సంఘటనను మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారమంతా రాజకీయాల కారణంగా మరింత దారుణ వ్యవహారంగా మారింది. ఆస్పత్రి మీద దుండగులు దాడులు చేసి విధ్వంసకాండ సృష్టించడం కేసును మరింత జటిలంగా మార్చింది. న్యాయ స్థానం కల్పించుకుని దీన్ని సి.బి.ఐ దర్యాప్తునకు అప్పగించడంతో పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. దర్యాప్తు సజావుగా సాగి, ఈ దుర్ఘటనపై వెల్లువెత్తుతున్న అనేక కథనాలు, ఊహాగానాలకు తెరపడుతుందనే డాక్టర్లు భావిస్తున్నారు. ఆ మహిళా వైద్యురాలి కుటుంబానికి న్యాయం జరగాల్సి ఉంది.
ఈ అత్యాచారం, హత్య కోల్ కతా ప్రజల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మొదటిసారిగా తీవ్రస్థాయి నిరసన వ్యక్తమయింది. మహిళలకు ఆస్పత్రులు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, కార్లలోనే కాక, బహిరంగ ప్రదేశాల్లో కూడా రక్షణ లేదనే విషయం రూఢిఅయిపోయింది. కోల్ కతా ఆస్పత్రులలో మహిళా డాక్టర్లకు రాత్రి వేళల్లో ఆస్పత్రుల్లో విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేనే లేదని తెలిసింది. పైగా ఆస్పత్రుల్లో భద్రత ఎంత లోపభూయిష్టంగా ఉందంటే, ఎవరు ఏ సమయంలోనైనా లోపలికి ప్రవేశించి, సురక్షితంగా వెళ్లిపోవచ్చు. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో మహిళా డాక్టర్లకు సంబంధించి అంతగా దయనీయ పరిస్థితులు ఉండవు. కానీ, కోల్ కతా, పశ్చిమ బెంగాల్ తీరే వేరు. కేంద్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం భారీ నిధిని ఏర్పాటు చేసిందికానీ, అందులో సగం నిధులను కూడా మహిళల భద్రత కోసం ఖర్చు చేయడం జరగలేదు. ఇటువంటి లోపాలు న్యాయపరమైన, సంస్థల పరమైన, సదుపాయాల సంబంధమైన లొసుగులకు అద్దం పట్టడమే కాదు, సామాజిక ధోరణులకు కూడా అద్దం పడుతోంది. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీరే ఆ విధంగా ఉన్నప్పుడు ఇక నాయకులు, మంత్రులు, ఉన్నతాధికారుల గురించి చెప్పేదేముంది? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పనితీరు మారనంత వరకూ ఇక్కడ మహిళల భద్రత గురించి ఎక్కువగా ఆలోచించి ప్రయోజనం కూడా ఉండదు.