సమకాలీన రచయిత్రులలో వాసిరెడ్డి సీతాదేవి అందరి కంటే ముందుంటారు. ఏకంగా అయిదు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు సాధించుకున్న అద్వితీయ, అపురూప రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. చదివింది అయిదవ తరగతి వరకే అయినా, ఆ తర్వాత ప్రైవేట్‌గా ఎంఏ వరకూ చదివి, తెలుగు, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించిన సీతాదేవి సామాజిక స్పృహతో పాటు సంస్కరణాభిలాష కలిగిన రచయిత్రి. ఆధునిక భావాలు, ఆదర్శ భావాలు ఆమె నరనరానా జీర్జించుకుపోయాయి. ఆమె గుంటూరు జిల్లా చేబ్రోలులో పుట్టి పెరిగారు. ఆమె రచించిన మొదటి నవల ‘జీవితం అంటే’ (1950) ఆమెను ఒక జగమెరిగిన రచయిత్రిగా సాహిత్యలోకంలో నిలబెట్టింది.ఆమె రాసిన తొలి కథ ‘సాంబయ్య పెళ్లి’ (1952) ఎంతగానో పాఠకాదరణ పొందింది.ఆ తర్వాత ఆమె 39 నవలలు, వందకు పైగా కథలు రాయడం జరిగింది.
నక్సలైట్‌ల నేపథ్యంతో ఆమె ఎంతో సాహసంతో 1982లో రచించిన ‘మరీచిక’ అనే నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీనిపై ఆరుద్ర వంటి ప్రముఖ చరిత్రకారులు సానుకూలంగా స్పందించడంతో హైకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తేయడం జరిగింది. ఇక 2000 సంవత్సరంలో ఆమె రాసిన ‘మట్టి మనిషి’ నవలను 14 భాషల్లోకి అనువాదం అయింది.ఈ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ నవల ఆమెను సాహిత్య రంగంలో చిరస్థాయిగా నిలబెట్టింది. వాసిరెడ్డి సీతాదేవి రాసిన నవలల్లో కొన్ని సినిమాలుగా నిర్మాణం కాగా, మరికొన్ని నవలలు టీవీ సీరియల్స్‌గా రూపుదిద్దుకున్నాయి. సమత అనే నవల ఆధారంగా ‘ప్రజా నాయకుడు’, ప్రతీకారం అనే నవల ఆధారంగా ‘మనస్సాక్షి’ , మానినీ మనసు ఆధారంగా ‘ఆమె కథ’ చిత్రాల నిర్మాణం జరిగింది. మృగతృష్ణ అనే నవలను ఇదే పేరుతో సినిమాగా నిర్మించడం జరిగింది.
వాసిరెడ్డి సీతాదేవి చాలా సంవత్సరాల పాటు జవహర్ బాల భవన్‌డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకు ముందు యువజన సర్వీసుల డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. డిప్యూటీ డైరెక్టర్‌గా ఆమె యువజనులకు అనేక రంగాలలో ఉత్తమోత్తమమైన సహాయ సహకారాలు అందజేశారు. ఆ తర్వాత 1985-91 మధ్య కాలంలో ఆమె ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా సేవలందించడం జరిగింది. 1998లో ఆమె సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అయిదు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకున్న వాసిరెడ్డి సీతాదేవికి ఆత్మగౌరవ పురస్కారం కూడా లభించింది. 1989లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఆమె గౌరవ డి.లిట్ పొందారు. ఆ తర్వాత తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి కూడా గౌరవ డి.లిట్ పొందడం జరిగింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో విశిష్ట పురస్కారం పొందిన సీతాదేవికి అదే విశ్వవిద్యాలయం 1996లో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందజేసింది. ఆమెకు ‘ఆంధ్రా పెర్ల్‌బక్’ అనే బిరుదు కూడా లభించింది. ఆమె హిందీ నుంచి ‘మృత్యుంజయుడు’ పేరుతో ‘అక్షత్’ అనే నవలను అనువాదం చేశారు. ఆ నవలను ప్రసిద్ధ హిందీ రచయిత శివసాగర్ మిశ్రా రాశారు. ఆ తర్వాత ఆమె తన జీవిత చరిత్రను కూడా రాసుకున్నారు.
జి. రాజశుక
Vasireddy Seethadevi: సాటిలేని మేటి వాసిరెడ్డి సీతాదేవి
'జీవితం అంటే’ ఆమెను జగమెరిగిన రచయిత్రిగా నిలిపింది