Akshaya Tritiya: “అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.”
గోమాతలో సాక్షాత్తూ లక్ష్మీ దేవి ప్రవేశించుట
ఒకానొక కల్పంలో శ్రీ మహాలక్ష్మి భూలోకానికి వచ్చి ఎక్కడ పరిశుభ్రత పాటిస్తున్నారో చూద్దాం! అని అన్ని ప్రదేశాలు తిరుగుతుంది. ఒక ఇంట్లో అపరిశుభ్ర వాతావరణం, ఒకచోట కలహ వాతావరణం, ఒకచోట అధర్మ వర్తనం, ఒకచోట మోసపూరిత వ్యవహారం ఇలా పలు సంఘటనలు ఎదురయ్యాయి. దాంతో తిరిగి తమ లోకానికి వెళ్లే ప్రయత్నంలో కాశీ ప్రాంతంలో అప్పటి రాజుగారి గోశాల చాలా పవిత్రంగా కనిపించడం వల్ల, అప్పటికే గోవులలో సమస్త దేవీ దేవతలు నివాసంకల్పించు కోవటంవల్ల శ్రీలక్ష్మి అందున ప్రవేశించబోగా గోవులు ఆమెను అడ్డుకున్నాయి. నీవు చంచలవు దుర్మార్గుని కూడా ధనం యిచ్చి కటాక్షిస్తావు. ధర్మాత్ముని దరిద్రుని చేస్తావు.
నీ చర్యలు విచిత్రంగా వుంటాయి. కావున నీవు మాలో ఉండటానికి మేము అంగీకరించమన్నాయి. శ్రీలక్ష్మి విచారించి ప్రజలకు నా కటాక్షం లభించటం అనేది వారి వారి పూర్వ పుణ్య ఫలితాలను బట్టి కలుగుతుంది. నేను ఈ సృష్టికి మూల శక్తిని సమస్త దేవతలు వుండి నాకు స్థానం లేకపోతే నాకెంతో అవమానకరంగా వుంటుంది. నాకు స్థానం కల్పించమని కోరగా గోవులు గౌరవ సూచకంగా అంగీకరించి మా మూత్ర, పురీషములలో(మూత్రం -పేడ )మాత్రమే స్థానం వున్నది.నీకు అభ్యంతరం లేకుంటే అక్కడ వుండమన్నాయి. శ్రీలక్ష్మి సంతోషంగా ఆ స్థానాలను ఆశ్రయించింది. ఆరోజు వైశాఖ శుద్ధ తదియ. గోవులు తనకు స్థానం కల్పించి నందుకు సంతోషించి ఈ రోజున ఎవరు ఏ కార్యం చేసినా అక్షయం అవుతుంది అని వరం యిచ్చింది శ్రీమహాలక్ష్మి. అదే “అక్షయతృతీయ ” పర్వదిన దినం.
మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం
ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.
ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.
శ్రీ నారద పురాణం ప్రకారం
ఈ అక్షయ తృతీయ నాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది. ఈనాడు దానం, ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారదమహర్షి ఇలా చెప్పాడు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృత, ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు, సహస్రాదిత్య సంకాశుడై, సర్వకామ సమన్వితుడై, బంగారము, రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్లి, తరువాత భూమి మీద పుట్టి, చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి, అంతమున ముక్తిని పొందుతాడు.
గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ, విష్ణు, శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాధిపతి అగును. అతడు నిద్రించినచో భేరీ, శంఖాది నినాదములచే మేల్కొలుపబడును. సర్వ ధర్మ పరాయణుడై, సర్వ సౌఖ్యములను పొంది, నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి, స్వయముగా జ్ఞానియై, అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.
ఈరోజు బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. కనుక వివేచనతో మంచిని గ్రహించి జీవితం ఆనందంగా మార్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

