అన్నం తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకున్నామా.. లేదా గుర్తు రావట్లేదు.
రెండో తారీఖు వచ్చేసింది, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. ఇంతకీ కట్టామా.. లేదా?
ఈసారి పెళ్లిరోజున శ్రీమతికి మంచి గిఫ్టు కొనివ్వాలి.. అవును, అదెప్పుడు?
… ఇలా ముఖ్యమైన విషయాలు సైతం మర్చిపోవడానికి కారణం మతిమరుపు. దాన్నే వైద్య పరిభాషలో డిమెన్షియా అంటారు. ఇంతకాలం దీనికి కారణాలేంటని వెతుకుతూ ఉంటే.. ఇప్పుడు తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వాతావరణంలో ఉండే అత్యంత సూక్ష్మ ధూళి కణాలు.. ఈ డిమెన్షియాకు కారణం అవుతున్నాయట! పీఎం2.5 అనే ఈ కణాలు వాతావరణంలో ఎంత ఎక్కువగా ఉంటే డిమెన్షియా రావడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుందని హార్వర్డ్ లోని టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇటీవల చేసిన ఓ సరికొత్త పరిశోధనలో తెలిసింది.
వివిధ కారణాల వల్ల వాతావరణంలో పీఎం2.5 పరిమాణం పెరుగుతూ ఉంటుంది. పారిశ్రామిక కాలుష్యం, వాహనాల నుంచి వెలువడే పొగ, రోడ్డుమీద ఉండే దుమ్ము, ధూళి.. ఇవన్నీ కలిసి ఈ కాలుష్యం పెరిగేందుకు కారణమవుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన సంస్థలు చేష్టలుడిగి కూర్చోవడంతో ఈ కాలుష్య తీవ్రత నానాటికీ ఎక్కువవుతోంది. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాలు ఏవని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ పరిశీలన చేస్తే, పీఎం2.5 కాలుష్యం అత్యంత ఎక్కువగా ఉన్న అగ్రశ్రేణి 20 నగరాల్లో 14 మన భారతదేశంలోనే, అది ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనే ఉన్నట్లు తేలింది. దాన్ని బట్టి చూస్తే ఆ ప్రాంతాల వారికి డిమెన్షియా వచ్చే ప్రమాదం మరింత ఎక్కువన్న మాట.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతున్నారన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. అయితే, 2050 నాటికి ఈ సంఖ్య ఏకంగా 15.3 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్యను నియంత్రించాలన్నా, మతిమరుపు బారి నుంచి తమ తమ దేశాల్లోని ప్రజలను కాపాడుకోవాలన్నా ఏకైక పరిష్కారం ఇలాంటి వాయు కాలుష్యాన్ని వీలైనంతవరకు అదుపుచేయడం, లేదా ప్రజలు దాని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూసుకోవడమేనని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.
హార్వర్డ్ శాస్త్రవేత్తలు మరికొందరితో కలిసి చేసిన పరిశోధనలో 2వేలకు పైగా పరిశోధన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత దశాబ్ద కాలంలో ప్రచురితమైన వివిధ వ్యాసాలను పరిశీలించినప్పుడు, వాటిలోని 51 పత్రాల్లో వాయు కాలుష్యానికి, క్లినికల్ డిమెన్షియాకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి వాయువుల ప్రభావం మనిషి మెదడుమీద ఎలా ఉంటోందని పరిశీలించారు. క్యూబిక్ మీటరు ప్రాంతంలో 12 మైక్రోగ్రాముల కంటే పీఎం2.5 కాలుష్యం తక్కువ ఉంటే ప్రమాదం అంత ఎక్కువ లేదని తేల్చారు. అదే ప్రతి 2 మైక్రోగ్రాముల పెరుగుదలకు డిమెన్షియా వచ్చే ముప్పు 17% చొప్పున పెరుగుతూ పోతుందట. అసలు ఘనపు మీటరు పరిధిలో 5 మైక్రోగ్రాముల కు మించి పీఎం2.5 ధూళికణాలు ఉండకూడదన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణం. ఆ సంస్థ 108 దేశాల్లోని 4,300 నగరాల్లో లెక్కలు చూస్తే, టాప్-20 జాబితాలో 14 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. వాటిలో 97.3 మైక్రోగ్రాములతో పాకిస్థాన్‌లోని లాహోర్ అగ్రస్థానంలో ఉంటే, 79.2 మైక్రోగ్రాములతో మన దేశంలోని ముజఫరాపూర్ 20వ స్థానంలో ఉంది. ఈ లెక్కన మన దేశంలో డిమెన్షియా తీవ్రత లెక్కలకు చిక్కకుండా మరెంత ఎక్కువగా ఉందో అన్న ఆందోళన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజానికి పొగ తాగడం (ధూమపానం) వల్ల కూడా డిమెన్షియా వచ్చే ముప్పు ఎక్కువగానే ఉంటుంది. కానీ పొగతాగని వారిలో కూడా పీఎం2.5 కాలుష్యం వల్ల ఈ సమస్య కనిపిస్తోంది.
పరిష్కారం ఏంటి?
బహిరంగ ప్రదేశాల్లో దుమ్ము, ధూళి ఎక్కువగా చేరకుండా చూసుకోవడం, వాహనాల కాలుష్యాన్ని నివారించడానికి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం, కొవిడ్ తీవ్రత లేకపోయినా ప్రజలందరూ వీలైనంత వరకు మాస్కులు ధరించేలా వారిలో అవగాహన పెంచడం.. ఇలాంటి చర్యల ద్వారా కొంతవరకు కాలుష్యం వల్ల వచ్చే డిమెన్షియా ముప్పును అదుపు చేసుకోవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం కఠిన నియంత్రణలు విధించడంతో పాటు, ఎవరికి వారు వ్యక్తిగతంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముప్పు తగ్గుతుందట. మరి ఇంకెందుకు.. మీవంతు ప్రయత్నం మీరు చేయండి!