ముఖపుస్తకంలో మనం ఎన్నో చూస్తూంటాం…మన గోడలపై ఎంతో రాస్తూంటాం…మరి మా సొంతూరు పై కొంతనా రాసుకుందామనిపించి…….
నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామ గురించి ప్రత్యేక కథనం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లాగా మారింది. కనుక ప్రస్తుత నంద్యాల జిల్లాలో చాగలమర్రి గ్రామం ఉంది. ఒకప్పటి 18వ నెంబరు, ఇప్పటి 40వ నెంబరు జాతీయ రహదారి మాఊరు మీదుగనే సాగుతుంది. చరిత్ర పుటలలో మాఊరు నిలువకపోయినా, చెప్పుకోదగ్గ చరిత్రే మా ఊరికుంది…
నందులు, మౌర్యులు కాలంనాటి పాలనలోనైతేనేమి, కధంబులు కర్నూలు నవాబులు, పాలెగాల్ల పాలనలోనైతేనేమీ, ఈస్టిండియా పాలనలోనైతేనేమీ, చివరాఖరకు ఈనాటికీ చాగలమర్రి తన విశిష్టతను చాటుకుంటూనే ఉంది. 18వ శతాబ్దపు తొలినాళ్లలో సీడేడ్ జిల్లాలు ఏర్పడితే, 1858లో కర్నూలు జిల్లా రూపుదిద్దుకోయింది. అప్పటినుండీ చాగలమర్రికి ప్రత్యేకత ఉండనే ఉంది.
చాగలమర్రికి ఆనాటి గ్రామదేవత త్యాగాంబ. ఈవిడ గుడి మహావృక్షం మర్రిచెట్టు నీడన ఉండేది. త్యాగాంబ చెంతన ఉన్న మర్రి చెట్టు కావున దీనికి త్యాగాలమర్రి అనే పేరొచ్చింది. త్యాగాలమ్మ, త్యాగాలమర్రి ఉంది కాన అప్పట్లో మా ఊరిని త్యాగాలమర్రి అని పిలిచేవారంట. వాడుకలో త్యాగాలమ్మ చాగలమ్మగా మారగా, త్యాగాలమర్రి చాగలమర్రిగా మారిందంటారు. అయితే లల్లాదేవి రచించిన వజ్రబిలం నవలలో మాత్రం చాగలమర్రికి కొత్తకోణం చూపారు.
స్వాతంత్రసమరంలో అల్లూరి సీతారామరాజును వంచించి చంపిన బాస్టిన్ దొర ఆ తరువాత కడప, కర్నూలు ప్రాంతాలకు ఇంఛార్జు కలెక్టరుగా వ్వవహరించారు. తన ప్రాంతంలో కనిపించిన తిరుగుబాటుదారులందరినీ త్యాగాంబ మర్రిచెట్టు కొమ్మలకు ఉరితీయించారు. ఆనాటి పోరాట వీరుల మౌన త్యాగాలకు సాక్షంగా నిలిచిన త్యాగాలమర్రి చెట్టు ఉన్న ఊరే త్యాగలమర్రిగా నామకరణం అయ్యింది. వాడుకలో ఈ ఊరే చాగలమర్రి అయ్యిందని లల్లాదేవి రచించారు…
కర్నూలు ప్రత్యేక జిల్లాగా అవతరించేనాటికి ఉన్న 8 తాలూకాలలో చాగలమర్రి తాలూకా మొదటిది. 1861లో చాగలమర్రి తాలూకాను రద్దుపరచి శిరివెళ్ల తాలూకాలో కలపినప్పటికీ , 54 సంవత్సరాలపాటు తాలూకా కేంద్రంగా చాగలమర్రినే కొనసాగించారు. 1916లో తాలూకా కేంద్రాన్ని మార్చి ఆళ్లగడ్డ తాలూకాను ఏర్పాటు చేశారు.
1802 ప్రాంతంలో పాలెగాళ్ల హవా కొనసాగే సమయంలో చాగలమర్రి ప్రాంత పాలెగాళ్లు సీడెడ్ జిల్లాలలో పేరుగడించారు. నొస్సం పాలెగాడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి, ముత్యాలపాడు పాలెగాడు లక్ష్మా నాయక్, నల్లగట్ల పాలెగాడు వెంకటనర్సు ప్రముఖులు. ఉయ్యలవాడ నరసింహారెడ్డిని 1847 జనవరి 9వ తేదీన ఉరితీసి కోవెలకుంట్ల కోట గుమ్మానికి 30 సంవత్సరాలపాటు వేలాడతీసి ఉంచినా, ముత్యాలపాడు పాలెగాడు లక్ష్మా నాయక్ ఇసుమంతకూడా బయపడలేదు. తెల్లదొరలకు ఎదురొడ్డి పోరాడటంలో అలుపెరుగని కృషి చేసాడు. కొన్ని కుట్రల ఫలితంగా ఆయన కనుమరుగయ్యాడు.
స్వాతంత్ర పోరాటంలో కూడా చాగలమర్రి వాసులు పేరెన్నికగన్నారు. 1929 మే 21వ తేదీన గాంధీజీ తన సతీమణి కస్తూరిభాతో కలసి చాగలమర్రిని సందర్శించారు. పొద్దుటూరు నుండి చాగలమర్రికి విచ్చేసిన ఆ దంపతులు ఈనాటి కేరళ ఆసుపత్రిలో ఉన్న ముందుగదిలో కొద్దిసేపు విశ్రమించారు. అమ్మవారిశాల వెనుకబాగంలో నేడు కల్యాణమండపం కట్టిన ప్రాంతంలో ఖద్దరు ఉద్యమ సమావేశం ఏర్పాటు చేసి గాంధీ ప్రసంగించారు. గాంధీ ఉపన్యాసాలకు ప్రేరణ పొందిన చాగలమర్రివాసులు విరివిగా విరాళాలు అందజేయగా, ఆర్కే రాం, బండారు నీలన్న లాంటివారు స్వాతంత్ర్య సమరయోధులుగా మారారు. 1940లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో చాగలమర్రి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆర్కే రాం, మద్దూరు శివాలయం వద్ద బండారు నీలన్నలు పాల్గొని అరెస్టు కాబడ్డారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చాగలమర్రికి ఎన్నో ప్రత్యేకతలు
చాగలమర్రి పోలీస్ స్టేషన్లో చెక్కు చెదరని నేటికీ ఉన్న 130 సంవత్సరాలు కలిగిన ఆనాటి జైలు చూస్తే గత చరిత్ర కళ్లముందు కదులుతుంది. పోలీసు చట్టంలో మైలురాయిగా పిలువబడే ఇండియన్ చట్టం5 ను 1861లో ప్రవేశపెట్టాక, కర్నూలు జిల్లాలో 14 సబ్ జైల్లు ఉండేవి. అందులో చాగలమర్రి సబ్ జైలుకూడా ఉంది. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన జైలు నేటికీ చెక్కుచెదరకుండా పోలీసు స్టేషన్ లో మనకు దర్శనమిస్తుంది.
1484-1503 మద్యకాలంలో శ్రీ వెంకటేశ్వరునిపై 32 వేల సంకీర్తనలు గానం చేసిన పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు దేశ సంచారం జరుపుతూ చాగలమర్రిలోని చెన్నకేశవ ఆలయాన్ని సందర్శించారు. చాగలమర్రి చెన్నకేశవా అనే మకుటంతో ఒక సంకీర్తన సైతం రాసారు. నేడు తిరుమలకు వెళ్లే వారందరూ, అక్కడి మ్యూజియంలో భద్రపరిచిన చాగలమర్రి చెన్నకేశవ ఆలయ నమూనాతో పాటూ, మా ఊరి శ్రీదేవీ భూదేవి సమేత చెన్నకేశవుని ఉత్సవ విగ్రహాల నమూనాలను చూడవచ్చు. 15వ శతాబ్దంలో జీవించి మతోద్దరణకు పాటుపడిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారు రచించిన కాలఙ్నానంలో చాగలమర్రి ప్రశస్థి ఉంది.
అన్ని మతాలు, కులాలతో హిందూ,ముస్లీం,క్రైస్తవుల మతసామరస్యం చాగలమర్రిలో వెల్లివిరుస్తూందని చెప్పవచ్చు. ఏకశిల పదునెట్టాంబడి అయ్యప్ప ఆలయం చాగలమర్రిలో వెలిసింది. శబరిమల సన్నిధాన ప్రధాన అర్చకులు శ్రీకంఠరారు మోహనస్వాములవారు 1999 మే నెల 2వ తేదీన ఆలయంలో అయ్యప్ప ప్రతిష్ఠ గావించారు. అప్పటినుండి ఇక్కడే ఇరుముడి విప్పే సౌలబ్యంకూడా కలిగింది. దసరా ఉత్సవాలు చాగలమర్రిలో శోభాయమానంగా జరుగుతాయి. చింతలచెరువు భైరవీశ్వరాలయం , మలయచల మల్లేశ్వరుడు, మద్దూరు లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరాలయం ప్రసిద్దికెక్కాయి. ముస్లింల కళావైభవం చాగలమర్రిలో తరతరాలుగా శోభిల్లుతూనే ఉంది. అత్యంత పురాతన కట్టడాలు, మసీదులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ జరిగే మొహర్రం పండుగ రెండు తెలుగు రాష్ట్రాలలో పేరుగాంచింది.
చాగలమర్రి మండలం ముతాలపాడు గ్రామం గురించి ..
మరోవైపు చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో దాదాపు 140 సంవత్సరాల పరిశుద్ద క్రైస్తవ ఆలయం ఉంది. ఆలయ వార్షికోత్సవాలలో పలు డయాసిస్ ల బిషప్ లు ఇక్కడికి వస్తారు. పర్యాటకంగా కూడా చాగలమర్రిని అభివృధ్ధి చెందించవచ్చు. అత్యంత సుందరమైన నల్లమల అటవీ ప్రాంతం , తెలుగుగంగ రిజర్వాయరు తదితరాలు పర్యాటకరంగానికి అనువుగా ఉంటాయి. ఇటీవలే చాగలమర్రి కి కొత్త హంగు కూడా సమకూరింది… అదేనండీ చాగలమర్రి టోల్ ప్లాజా.
18వ నెంబరు జాతీయ రహదారి ఆధునికీకరణలో బాగంగా నాలుగు రహదారుల విస్తరణ సాగింది కనుక కర్నూలు నుంచి కడప వరకు సాగీన ఈ రహదారి ప్రస్తుతం 40వ నెంబరు జాతీయ రహదారిగా మారింది. కడప నుంచి కర్నూల జిల్లాలోకి వెల్లే రహదారిలో మొదటి గ్రామం చాగలమరే కనుక ఇక్కడ టోల్ ప్లాజా నిర్మించారు. రహదారి పనులు కొనసాగుతూండగానే చాగలమర్రి టోల్ ప్లాజాను ప్రారంభించారు. చాగలమర్రి టోల్ ప్లాజా కూడా మా ఊరికొక మైలు రాయిగా మారింది.
ఇంత చరిత్ర కలిగిన చాగలమర్రి మన ఊరు కావడం నాకు గర్వకారణంగా ఉంది. వ్యవసాయం ప్రధానంగా సాగే మా ప్రాంతంలో తెలుగు గంగ , కెసీ కాలువలు ఉన్నాయి. కుందూ నది , ఎర్రవంకలు కూడా మా ప్రాంతంగుండా పారుతూంటాయి. ఇటీవల వర్షాభావ పరిస్థితుల దృష్ఠ్యా తెలుగు గంగ , కెసీ కెనాల్ ఆయకట్టు రైతులకు కష్టమొచ్చింది. ఈ ఏడాదైనా పంటలు బాగా పండాలని కోరుకుందాం.
మిసెస్ సౌత్ ఇండియాగా మెరిసిన చాగలమర్రి మహిళ..
అంతే కాకుండా చాగలమర్రి గ్రామం నుంచి మెరిసిన మిసెస్ సౌత్ ఇండియా టైటిల్ విన్నర్ గా అవార్డ్ తీసుకున్న చాగలమర్రి మహిళ చరిత సుమాలిని.
సోషల్ సర్వీస్ గురుంచి..
చాగలమర్రి గ్రామంలో పలు సేవ సంస్థలకు నిలయంగా మారింది. ఎక్కడైనా ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలను వ్యర్థం చేయకుండా అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ టీమ్ స్పందిస్తుంది. ఎవరికైన అత్యవసరం బ్లడ్ కావాలి అనిపిస్తే సహారా సోషల్ బ్లడ్ డోనార్స్ టీమ్ స్పందిస్తుంది. ఆర్థికంగా వెనకబడిన, పూటగడవని స్థితిలో ఉన్న వాళ్లకు ఆదుకోటానికి రాయలసీమ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ స్పందిస్తుంది. ఇలా పలు రకాలు స్వచ్చంద సంస్థలు పని చేస్తుంటాయి.
షార్ట్ ఫిల్మ్ ల సందడి ..
ఇటీవల రోజుల్లో లఘుచిత్రాలకు అండగా పలు మండలాలు ఉన్నాయి.ఇక్కడ షార్ట్ ఫిల్మ్ లు ఎక్కువగా జరుగుతుంటాయి.ఇక్కడ చాలా మంది దర్శకులు తయారువుతున్నారు.అందులో నాసిర్ పఠాన్ , పవన్ సాయినాథ్ రెడ్డి , నల్లమల జగదీశ్ , కిషోర్ , గఫార్ బాబ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు.
- వల్లంకొండు సాయి సుదర్శన్ రావు