Friday, November 22, 2024
Homeఫీచర్స్DNA Jewells: తల్లిపాలతో, తండ్రిరక్తంతో నగలు చేస్తుంది ఈమె...!

DNA Jewells: తల్లిపాలతో, తండ్రిరక్తంతో నగలు చేస్తుంది ఈమె…!

‘తల్లి పాలతో, తండ్రి రక్తంతో, పాపాయి బొడ్డుతాడుతో, పాప తొలి లేలేత వెంట్రుకతో ఆత్మీయులకు శాశ్వతమైన జ్ఝాపకాలను పంచే జ్యువెలరీని తయారుచేస్తారని మీకు తెలుసా? వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఆమె స్వయంగా ఆ పని చేస్తూ ఎందరో క్లయింట్స్ కు జీవితాంతం గుర్తుండే అద్భుతమైన , శాశ్వతమైన ‘మ్యాజిక్ మెమొరీస్’ ను పంచుతోంది. ఆమె పేరు ప్రీతి మగ్గో. ఆ విశేషాలు…

- Advertisement -

ప్రీతి మగ్గో తయారుచేస్తున్న ఇలాంటి నమ్మశక్యం కాని కీప్ సేక్ జ్యువెలరీ గురించి చెప్పాలంటే చాలా విషయాలే ఉన్నాయి. ఒక క్లయింటు తన తండ్రి రక్తంతో ఉంగరం చేసి ఇవ్వాలని ప్రీతిని కోరింది. ఆమె కోరినట్టుగానే ఉంగరాన్ని తయారుచేసి ఎప్పటికీ చెరిగిపోని అందమైన జ్ఘాపకంగా దాన్ని ఆమె చేతిలో పెట్టింది ప్రీతి. మరొకరు తమ చిన్నారిపాప బొడ్డుతాడుతో అందమైన లాకెట్ ను తయారుచేసి ఇవ్వమని అడిగారు. ఆ పేగు బంధానికి శాశ్వత రూపం ఇచ్చి జీవితాంతం అందించే ఆనందాన్ని ఆ తల్లిదండ్రులకు పంచింది ప్రీతి. అంతేకాదు తమ రక్తసంబంధీకుల జ్ఘాపకాలు తమని ఎప్పటికీ అంటిపెట్టుకునేలాగ తల్లిపాలను సొగసైన కీప్ సేక్ జ్యువెలరీ రూపంలో తన క్లయింట్లకు ప్రీతి అందిస్తోంది.

ఎందరో అసాధ్యమనుకున్న ఈ పనిని సుసాధ్యం చేసి మనుషుల మధ్య రక్తసంబంధాల లోతైన ప్రేమను వెల్లడించే జ్యువెలరీని క్లయింట్లకు ప్రీతి మగ్గో అందిస్తోంది. ‘మాజిక్ ఆఫ్ మెమరీస్’ అనే స్టార్టప్ తో మానవుల ప్రేమ, రక్తసంబంధ సౌరభాలను, అనుబంధాల పరిమళాలను జ్యువెలరీ రూపంలో అందిస్తూ సంచలనం స్రుష్టిస్తోంది. షార్క్ ట్యాంక్ ఇండియాలో తను రూపొందిస్తున్న ఈ నగల గురించి ప్రీతి చెప్పడం వల్ల ఈ కీప్ సేక్ జ్యువెలరీ బాగా ఫ్యామస్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ప్రీతి ఫాలోయర్స్ రోజు రోజుకీ పెరిగిపోయి వారి సంఖ్య 50 వేలకు చేరింది.

ప్రీతి తన మేజిక్ ఆఫ్ మెమరీస్ స్టార్టప్ ను 2019లో ప్రారంభించింది. వెంట్రుక దగ్గర నుంచి బొడ్డుతాడు, రక్తం, తల్లిపాలతో ప్రియ నగలను తయారు చేయడం మొదలెట్టింది. ఈ నగలు రక్తసంబంధీకులకు పంచుతున్న ఆనందం, అనుభూతి మాటలకు అందనిదంటుంది ప్రీతి. చిన్నారి బొడ్డు తాడు యంగ్ పేరెంట్స్ కు తమ బేబీ పుట్టిన నాటి అనుభూతులను శాశ్వతమైన జ్ఘాపకాలుగా నిలిచిపోయేలా చేస్తోందని చెప్తారామె. తల్లిపాలతో తయారుచేసిన లాకెట్ వంటి నగలు స్త్రీలకు జీవితాంతం అద్భుతమైన మాత్రుత్వపు భావోద్వేగాలను శాశ్వతం చేస్తున్నాయని ప్రీతి అంటారు. క్లయింట్లు కోరుకుంటున్న డిజైన్లలో వారి రక్తసంబంధీకుల రక్తంతో చేసిన ఉంగరం, లాకెట్ వంటి రకరకాల జ్యవెలరీలు ఉన్నాయని ప్రీతి తెలిపారు.

ఇప్పటిదాకా 600 మంది పైగా క్లయింట్లకు ఈ కీప్ సేక్ జ్యువెలరీని ప్రీతి రూపొందించారు. మనుషులకే కాదు ఇళ్లల్లో ఉండే పెంపుడు జంతువులకు కూడా ఈ తరహా జ్యువెలరీని ప్రీతి రూపొందిస్తారు. అసలు ఈ ఆలోచన ప్రీతికి ఎలా వచ్చింది? ఒకసారి ఫేస్ బుక్ లో తల్లిపాలతో ఒక జర్మన్ ఆర్టిస్టు జ్యువెలరీ చేస్తుండడం గురించి ప్రీతి చదివింది. ప్రీతి పాపకు ఆరు నెలలు వయసు ఉన్నప్పుడు అంటే 2019లో ఆమె తన బ్రెస్ట్ మిల్కుతో జర్మన్ ఆర్టిస్టు చేసిన లాంటి జ్యువెలరీ శాంపుల్ నొకదానిని తయారుచేసి తనకు తెలిసిన వారికి పంపింది. దాన్ని వారు ఎంతగానో మెచ్చుకున్నారు. అంతేకాదు కొందరు తల్లులు తమ బ్రెస్ట్ మిల్కును ప్రీతికి పంపించి అలాంటి జ్యువెలరీ తయారుచేయాల్సిందిగా కోరారు. అలా ప్రీతికి మెల్లగా ఆర్డర్లు రావడం మొదలైంది. ఇలా వెంట్రుకలు, రక్తం, బొడ్డుతాడు, తల్లిపాలతో రకరకాల నగలు తయారుచేయడాన్ని ప్రీతి మొదలుపెట్టింది.

వీటి ఖరీదు రెండు వేల నుంచి లక్షల్లో కూడా ఉంటుందని ప్రీతి తెలిపింది. ఆ నగల తయారీకి ప్రజలు ఎంచుకునే మెటల్, డిజైన్ల బట్టి వాటి ఖరీదు ఉంటుందని ప్రీతి వివరించింది. ప్రీతి పెండెంట్స్, రింగ్స్, బ్రాస్ లెట్స్, క్లయింట్లు కోరిన రకరకాల డిజైన్ జ్యువెలరీని తయారుచేసి అందిస్తోంది. జామియా హందర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలో పట్టా తీసుకున్న ప్రీతి స్వంత ఊరు జలంధర్. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు. తన ‘మ్యాజిక్ ఆఫ్ మెమరీస్’ స్టార్టప్ ద్వారా ప్రీతి ప్రస్తుతం నెలకు ఐదు లక్షల రూపాయలను సంపాదిస్తోంది. ఈ ‘డిఎన్ ఎ జ్యువెలరీ’ తయారీ గురించి చెప్తూ ‘తల్లిపాలు, రక్తంతో నగలు చేయడానికి ముందుగా వాటిలో ప్రిజర్వేటివ్స్ కలిపి పాడవకుండా చూసుకోవాలి. ప్రిజర్వేటివ్స్ వేయడం వల్ల అవి గట్టిపడతాయి. ఆ తర్వాత వాటిని మౌల్డింగ్ చేయడం సులువు.వాటిని మనకు కావలసిన డిజైన్స్ లో, కస్టమర్ సూచించిన మెటల్ ను బట్టి మూస పోసుకోవాలి. ఇదంతా ఎంతో టైము తీసుకునే పని.

క్లయింట్ ఇచ్చిన ఆర్డర్ ను సరిగా నెరవేర్చడానికి టైము బాగా పడుతుంది. నాది వైద్యనేపథ్యం ఉన్న చదువు కావడంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ బాగా తెలుసు. అలా రక్తం, తల్లిపాలు వంటి వాటిని జాగ్రత్తగా ప్రిజర్వేటివ్స్ తో ఎలా భద్రపరచాలో తెలుసు. పైగా ఈ కీప్ సేక్ జ్యువెలరీ మీద బాగా అధ్యయనం కూడా చేశాను ’ అని ప్రీతి వివరించారు. ఈ పని తనకు పంచుతున్న అనుభూతి ఎంతో అనిర్వచనీయమైందని అంటుంది ప్రీతి. నిజానికి ఈ రకమైన జ్యువెలరీ మనదేశంలో కొత్త కాన్సుప్టుగాని పాశ్చాత్యదేశాలలో ఇప్పటికే ఈ తరహా నగలు ఎంతో ప్రాచుర్యంపొందింది. మన సమాజంలో ఈ రకమైన పని పట్ల రక రకాల అపోహలు, నమ్మకాలు గూడుకట్టుకునిఉన్నాయి. ‘ఇండియాలాంటి చోట ఇలాంటి పని చేపట్టడం ఎంతో సవాలుతో కూడినది. ఈ తరహా నగలకు వినియోగదారులను ఆకర్షించడం అంటే మాటలు కాదు. కానీ ఆ పని సుసాధ్యం చేయగలిగాను’ అంటారు ప్రీతి. ఫేస్ బుక్, వాట్సప్ గ్రూపుల ద్వారా తల్లులతో టచ్ లో ఉంటూ తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ఈ అద్బుతమైన ప్రయత్నానికి ప్రీతి నాంది పలికింది. అలా మెల్లగా ఆమె క్లయింట్లు కూడా పెరిగారు. ఆర్డర్లు కూడా పెరిగాయి. మెల్లగా బేబీ తొలి వెంట్రుకలతో, తల్లి పాలతో జ్యువెలరీని తయారు చేయడం ప్రీతి ప్రారంభించింది.

ఆతర్వాత బొడ్డుతాడు భాగాలతో, తమ ప్రియమైనవారి బాల్యంలోని గుడ్డ ముక్కలతో కూడా వెరైటీ జ్యువెలరీని ప్రీతి తయారుచేయడం ప్రారంభించింది. ఈ జ్యువెలరీ తయారీ గురించి చెపుతూ ‘ ఒక క్లయింట్ తన తండ్రి రక్తపు చుక్కలు కొన్ని తీసుకువచ్చి వాటితో ఉంగరం చేసి ఇమ్మన్నారు. ఈ నగలు కస్టమర్లకు ఎంతో భావోద్వేగాలతో కూడినవి’ అని ప్రీతి చెప్పారు. ప్రీతి చేసిన నగలలో ఎక్కువ బ్రెస్టు మిల్కుతో చేసినవి ఉన్నాయి. తర్వాత స్థానంలో వెంట్రుకలు, బొడ్డుతాడుతో చేసిన నగలు ఉన్నాయి.

ఇప్పుడు ప్రీతి పనిని ప్రేమిస్తున్న క్లయింట్లు, ప్రజలు ఎందరో ఉన్నారు. ఆమె చేస్తున్న జ్యువెలరీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అంతేకాదు ప్రియ తన పనిద్వారా ఎందరో స్త్రీలకు ఉపాధిని కూడా కల్పిస్తోంది. ఇపుడు ఆమె చేసే పనికి అండగా నిలిచేందుకు ఎందరో పెట్టుబడి పెట్టడానికి సైతం ముందుకువస్తున్నారు. కానీ ఈ పనిలో ఇంకా తాను చేయాల్సినది ఉందని అది పూర్తయిన తర్వాత ఇతరులతో కలిసి తన ఈ బిజినెస్ ను విస్తరిస్తానని ప్రీతి అంటోంది. ప్రీతి చేసే పనే ఆమెను నేడు ఎందరో మనసుల్లో ‘ప్రీతి’పాత్రురాలిగా నిలుపుతోంది కదూ..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News