అందమైన ..పొడవైన జుట్టును అందరూ ఇష్టపడతారు. ఆరోగ్యంగా మెరిసిపోతూ .. నల్లగా నిగనిగలాడే జుట్టు పొట్టిదైనా .. పొడవున్నా కావాలని కోరుకుంటారు. అయితే .. ఈ జనరేషన్‌లో ఆ కోరిక తీరడం గగనంగా మారింది. కనీసం ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే మగవారికి బట్టతలలు .. మహిళలకు జుట్టు ఊడిపోవడం .. వెంట్రుకలు తెల్లబడడం వంటి పలు రకాల సమస్యలు వారిని వేధిస్తున్నాయి. జుట్టు ఊడిపోవడానికి కారణాలు . వాటికి పరిష్కారమార్గాలేంటో తెలుసుకుందాం .|
జుట్టు రాలడం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. రెండు తరాలు కనుక వెనక్కి వెళితే .. అంటే మన అమ్మలు .. అమ్మమ్మల జనరేషన్‌ను గమనిస్తే వెంట్రుకలు రాలిపోవడం చాలా తక్కువగా ఉండేది. వృద్ధులు సైతం తలనిండా వెంట్రుకలతో ఉండేవారు. ఒకటీ ఆరా తప్ప తెల్ల వెంట్రుకలు కూడా తక్కువగానే ఉండేవి. పగలంతా ఎర్రటి ఎండలో పొలాల్లో పని చేసినా .. వారి జుట్టు మాత్రం మృదువుగా, నల్లగా, ఒత్తుగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. యువతలో చాలామందికి 20 ఏళ్ల వయస్సు నుంచే జుట్టు రాలడం అధికమైంది. కొంతమంది టీనేజర్లు కూడా జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. తలస్నానం చేసినప్పుడో, తల దువ్వుకుని దువ్వెన వైపు చూసినప్పుడో మనసు చివుక్కుమంటుంది. చిన్నవయసులో ఇలా జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ జుట్టు రాలడం గురించి ఆలోచిస్తూ కొంతమంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, మరికొంతమంది దేనిపైనా ఫోకస్ పెట్టలేకపోతున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
సాధారణంగా జుట్టు రాలడానికి కారణం వృద్ధాప్యంతో వచ్చే ఆండ్రోజెనిక్ అలోపేసియా అనే పిలిచే వంశపారంపర్య సమస్య. ఇది కాకుండా వెంట్రకలు పలచబడటానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. మితిమీరిన హెయిర్ కేర్ విధానాలు, తలపై ఇన్పెక్షన్, కొన్ని రకాల మందులు, హార్మోన్ల మార్పు, జుట్టు రసాయన చికిత్సలు ఎక్కువగా చేయడం లాంటి కారణాలున్నాయి. కనుక వెంట్రుకలు ఊడిపోవడం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న వారు, అతిగా ఆలోచిస్తున్న వారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఆందోళనలు, ఒత్తిళ్లను నివారించి అసలు జుట్టు రాలడానికి గల కారణాలను తెలుసుకోవాలి.
అలోపేసియా
జుట్టు రాలడాన్ని అలోపేసియా అని అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా జరగవచ్చు, కానీ చాలా సాధారణంగా తలలో వెంట్రుకలు ఊడడం జరుగుతుంది. అలోపేసియా పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కొంతమంది పిల్లలు కూడా దీని బారిన పడవచ్చు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, ఒక రోజులో ఆరోగ్యవంతుల్లో 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సాధారణం. రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి. కొత్త వెంట్రుకలు రానప్పుడు మాత్రమే జుట్టు రాలడం సమస్యతో బాధపడతారు. ఈ పరిస్థితి తాత్కాలికంగా కానీ, పర్మనెంట్‌గా గానీ జరగవచ్చు.
జుట్టు రాలడానికి కారణాలు
· వారసత్వం
· హార్మోన్ల మార్పులు
· అనారోగ్యాలు లేదా వైద్య పరిస్థితులు
· ఒత్తిడి
· మందులు
· విపరీతంగా బరువు తగ్గడం
· కొన్ని రకాల హెయిర్ స్టయిల్స్
· ఆహారంలో ప్రోటీన్, ఐరన్ లేకపోవడం
సరైన ఆహారం తీసుకోకపోవడం..
మీరు బరువు తగ్గడానికి కఠిన ఆహార నిబంధనలు అవలంబిస్తున్నట్లయితే ఆ ప్రభావం మీ జుట్టు మీద కూడా పడుతుంది. వెంట్రుకలకు తగిన పోషకాలు అందక అవి త్వరగా ఊడిపోయే అవకాశముంటుంది. ఇదే విషయాన్ని నిపుణులు కూడా చెబుతున్నారు. విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ లాంటి పోషకాలు లోపించడం వల్ల జుట్టు అధికంగా రాలిపోతుందని కాస్మాలజిస్ట్‌లు అంటున్నారు. కొన్ని డైట్ ల వల్ల అవసరమైన ప్రాథమిక పోషకాలు కోల్పోతారని వారు స్పష్టం చేస్తున్నారు. ఏ, బీ12, డీ లాంటి విటమిన్లతో పాటు జింక్, ఐరన్, ప్రోటీన్ లాంటి కీలక పోషకాల లోపం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీన పడతాయని, ఫలితంగా జుట్టు రాలిపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
తలపై ఇన్ఫెక్షన్
బ్యాక్టీరియా, ఈస్ట్ లేదా శిలీంధ్రాలు హెయిర్ ఫోలికల్స్ పై దాడి చేసినప్పుడు తలపై ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి సమయంలో తలపైన చీము గడ్డలు, ఎర్రగా మారడం, పొలుసులు రావడం లాంటివి జరుగుతుంది. చాలావరకు ఈ ఇన్ఫెక్షన్లు సరైన యాంటీ బయాటిక్ లేదా యాంటి ఫంగల్ మందులతో నయం అవుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు
జుట్టుపై అతి రక్షణ.
జుట్టును స్టైలిష్ గా ఉంచడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ ఇష్టం మితిమీరితే జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. జుట్టు స్టయిల్‌గా కనబడేందుకు ఉపయోగించే కెమికల్స్, హెయిర్ ప్రొడక్టులు, ఇతర హెయిర్ ట్రీట్మెంట్స్ జుట్టు రాలడానికి దారితీస్తాయి. అంతేకాకుండా వెంట్రుకలపై ఎక్కువ వేడితే ఉండే స్టైలింగ్, రసాయన చికిత్సలు ట్రాక్షన్ అలోపేసియా సమస్యకు కారణమవుతాయి. దీని వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
హార్మోన్ల అసమతుల్యత..
పీసీఓస్, మెనోపాజ్, ఊబకాయం, గుండె సమస్యలు లాంటి అనేక అంశాలు జుట్టు రాలడానికి కారణమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు.
కొన్నిసార్లు మనం గూగుల్‌లో సెర్చ్ చేసి, యూట్యూబ్‌లో కనిపించే టెక్నిక్‌లను ఫాలో అవుతాం. కానీ ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కంటే ఎక్కువ హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు.
నేరుగా సూర్యకాంతి, కలుషిత వాతావరణం, దుమ్ము, వానలకు బైటకు వెళ్లడం వలన జుట్టు రాలిపోతాయి. యువీ కిరణాలు నేరుగా జుట్టును తాకడం వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. ఇది జుట్టు పొడిబారడంతోపాటు జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. కాబట్టి యూవీ కిరణాల నుంచి జుట్టును కాపాడుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఈత కొట్టడానికి వెళ్లినప్పుడు నీటిలో ఉండే క్లోరిన్ సమ్మేళనం జుట్టుకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఈత కొట్టేటప్పుడు, నీటిలో ఆడుతున్నప్పుడు షవర్ క్యాప్ ధరించాలి.తడి జుట్టు చాలా పెళుసుగా ఉంటుంది. దీన్ని దువ్వుకోవడం వల్ల జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలను మనం తెచ్చుకున్నట్లే.
హీట్ ప్రొటెక్టెంట్లను ఉపయోగించకుండా హీట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది. కెరాటిన్ ప్రోటీన్లు విచ్ఛిన్నమవుతాయి. ఇది జుట్టుకు హాని కలిగించవచ్చు.
తలస్నానానికి చాలా వేడి నీటిని ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. వేడి నీరు జుట్టు పొడిబారడానికి కారణమవుతుంది. జుట్టు మరింత డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించడం గుర్తుంచుకోండి.
నివారణ చర్యలు
టైట్‌గా ఉండే హెయిర్ స్టయిల్స్‌కు దూరంగా ఉండా
సైడ్ ఎఫెక్ట్‌గా జుట్టు రాలే మందులు లేదా సప్లిమెంట్లను మానేయాలి
పొగత్రాగడం మానేయాలి
జుట్టును మృదువుగా దువ్వాలి
ఎక్కువ వేడిగా ఉన్న నీటిని తలస్నానానికి ఉపయోగించవద్దు
రసాయనాలు కలిగిన స్టైలింగ్ ఉత్పత్తులు, కలరింగ్ ఉత్పత్తులు, బ్లీచింగ్ ఏజెంట్లకు దూరంగా ఉండాలి.
ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి.
జుట్టు రాలడం సమస్య తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.