Friday, November 22, 2024
Homeఫీచర్స్Super cop: లేడీ సింగం నితిక ‘టెక్ ట్రీట్మెంట్’

Super cop: లేడీ సింగం నితిక ‘టెక్ ట్రీట్మెంట్’

ఫోటోలో కనిపిస్తున్న ఆమె నితిక గెహ్లాట్. ఐపిఎస్ అధికారి. బిడ్డను కన్నతర్వాత కేవలం పది రోజులు మాత్రమే మెటర్నిటీ లీవ్ తీసుకుని పదకొండవ రోజునే నవజాతశిశువుతో విధులకు హాజరయి సంచలనాన్ని స్రుష్టించారామె. విధి నిర్వహణ పట్ల ఆమెకున్న అంకిత భావం తోటి ఉద్యోగులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అలాంటి సూపర్ విమెన్ గురించి ఈ మహిళా దినోత్సవం నాడు కొన్ని విశేషాలు..

- Advertisement -

ఏన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతూ వస్తున్న స్త్రీలు నేడు అన్ని రంగాలలో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా రాణిస్తున్నారు. వివిధ రకాలైన పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రతిభావంతంగా తమ విధులు నిర్వహిస్తూ తోటి మహిళలెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పలు రంగాలలో రోల్ మోడల్స్ గా వెలుగుతున్నారు. ఇందుకు నితిక ఐపిఎస్ మరో ఉదాహరణ.

హర్యానాలోని హన్సి పోలీస్ డిస్ట్రిక్ట్ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నితిక విధులు నిర్వహిస్తున్నారు. మాత్రుత్వ సెలవులను పది రోజులు మాత్రమే తీసుకున్న నితిక పదకొండవ రోజునే తన చిన్నారితో పాటు విధుల నిర్వహణకు హాజరవడం చూస్తే ఆమెకు తన పని పట్ల ఉన్న నిబద్ధత ఎంతటిదో వెల్లడవుతోంది. పాప పుట్టిన పదకొండవ రోజున పొత్తిళ్లల్ల నవజాత శిశువును పెట్టుకుని విధులు నిర్వహించడానికి ఆమె పూనుకున్నారు. పదిరోజుల చిన్నారిని ఒళ్లో పెట్టుకుని ఆమె ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు చూసి తోటి ఉద్యోగులు సైతం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తన విధుల పట్ల నితిక నిబద్ధతను చూసి చకితులయ్యారు. అలా ఎందరో మహిళలకు నితిక స్ఫూర్తివంతమయ్యారు. తన ఒడిలో చిన్నారిని పడుకోబెట్టుకుని ఆ బేబీని చూసుకుంటూనే ఆఫీసులో ప్రజా ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించడం చూసి ఎందరో నితికను శభాష్ అని మెచ్చుకున్నారు.

తల్లిగా, పబ్లిక్ సర్వెంట్ గా తన బాధ్యతలను ఎంతో నైపుణ్యంగా నితిక చేపట్టి, నిర్వహిస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా హర్యానాలోని హన్సి పోలీస్ డిస్ట్రిక్ట్ లో సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులను నిర్వహిస్తున్న ఆమె ఆ ప్రాంతంలో నేర ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నో చర్యలను సమర్థవంతంగా చేపట్టారు కూడా. అంతేకాదు గత ఏడాది సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్రం మొత్తంలో రెండవస్థానంలో హన్సి పోలీస్ డిస్ట్రిక్ట్ నిలబడింది. దీని వెనుక నితిక సామర్థ్యం, శక్తియుక్తులు, పనితీరు ఉన్నాయనడంలో సందేహం లేదు. డ్రగ్ కేసులను పట్టుకోవడంలో సైతం రాష్ట్రంలో ఆమె పనిచేస్తున్న హన్సి పోలీస్ డిస్ట్రిక్ట్ మూడవ స్థానం చేజిక్కించుకుంది. ఇవే కాదు ఒక హై ప్రొఫైల్ కేసులో నితిక నాయకత్వంలోని పోలీసు బ్రుదం నాలుగు కిలోల గంజాయి పట్టుకుని సంచలనం స్రుష్టించింది కూడా. మొదటి నుంచీ విధుల నిర్వహణలో ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తిగా నితికకు పేరుంది. అందుకే పోలీసు వర్గాలలోనే కాదు ప్రజల్లో కూడా సమర్థురాలైన అధికారిగా నితికకు మంచి పేరు వచ్చింది.

బిడ్డను చేతుల్లో పెట్టుకుని నితిక విధులు నిర్వహించడం చూసిన ఆ ప్రాంత మహిళలు ఆమెను చూసి ఎంతో స్ఫూర్తి పొందుతున్నారు కూడా. ఈ సంఘటన గురించి నితికను ప్రశ్నించినపుడు ‘ ఉద్యోగంలో భాగంగా నా రోజువారీ విధులను చేస్తున్నాను అంతే’ అని నితిక స్పందించారు. ఐపిఎస్ అధికారి అయినప్పటికీ నితికది చాలా నిరాడంబర జీవనశైలి కావడం కూడా ఎందరినో ఆకట్టుకుంటోంది.అంతేకాదు తన తోటి ఉద్యోగులతో ఆమె వ్యవహరించే తీరు, మాట్లాడే వైనం కూడా ఎంతో సున్నితంగా, హుందాగా, నమ్రతంగా ఉంటుందని నితిక పనితీరు గురించి తెలిసిన వారు తరచూ అంటుంటారు.

విధుల నిర్వహణలో టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూడా నితిక ముందున్నారు. క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే సరికొత్త యాప్ ను ఆమె తీసుకువచ్చారు. దీనికి ముందు ఇన్వెస్టిగేషన్ యాప్ ను కూడా నితిక తీసుకువచ్చారు. అది ‘సిసిటిన్ హాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్ 2022’ లో హర్యానా పోలీస్ మూడవ స్థానంలో నిలబడడానికి కారణమైంది. పోలీసు విభాగంలో ఇన్వెస్టిగేషన్ యాప్స్ తేవడం ద్వారా హర్యానా పోలీసు శాఖలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును నితిక తెచ్చుకోవడమే కాదు హర్యానా ప్రభుత్వ ప్రశంసలను సైతం ఆమె చురగొన్నారు. అంతేకాదు పోలీసింగ్ లో టెక్నాలజీని ప్రవేశపెట్టి విశేష గుర్తింపును తెచ్చుకున్నారు. నేరస్థులను 24 గంటలూ మానిటరింగ్ చేసేందుకు ‘క్రిమినల్ మానిటరింగ్ సిస్టమ్’ను నితిక ప్రవేశపెట్టారు. ఇది నితిక బ్రెయిన్ ఛైల్డ్ అంటారు. క్రిమినల్ మానిటరింగ్ సిస్టమ్ ను తొలిసారి హర్యానా పోలీసు ప్రవేశపెట్టి ఎంతో ఖ్యాతిని సంపాదించుకుంది.

పోలీసు విభాగంలో నితిక ప్రవేశపెట్టిన రకరకాల యాప్స్ కారణంగా జాతీయ స్థాయి సైబర్ హాకథాన్ లో హర్యానా పోలీసు శాఖ విస్త్రుత గుర్తింపు పొందింది కూడా. పోలీసు శాఖలో చేపట్టిన యాప్స్ పై మాట్లాడుతూ ‘హర్యానా ప్రాంతంలోని నేరస్తులను మానిటర్ చేయడానికి తొలిసారి క్రిమినల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ను హర్యానా పోలీసు శాఖలో ప్రారంభించాం. నా సబ్ ఇనెస్పెక్టర్ల బ్రుందం ఇన్ హౌస్ గా తయారుచేసిన యాప్ ఇది. ఈ బ్రుందంలోని అందరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వీరికి యాప్ ను రూపొందించడమెలాగో బాగా తెలుసు. హర్యానా ప్రాంతంలోని క్రిమినల్స్ పూర్తి వివరాలను తెలిపే వన్ స్టాప్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్. మొత్తం పోలీసు సిబ్బంది ఫోన్లలో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేశాం. జిల్లాల్లోని నేరస్తులే కాదు జైళ్లల్లో ఉన్న నేరస్తుల డేటాను సైతం ఈ యాప్ ముందుంచుతుంది. విడుదలైన నేరస్తుల కదలికలను సైతం ఈ యాప్ మానిటర్ చేస్తుంది. వీరి కదలికలను, ఏవరైనా కొత్త వాళ్లను వీళ్లు కలిస్తే ఆ వివరాలను, నేరస్తుల కొత్త పథకాలు, పన్నాగాలను సైతం ఈ యాప్ ద్వారా తెలుసుకోగలం. ఎప్పుడైతే జిల్లాస్థాయి నేరస్తుల పని పట్టగలుగుతామో అప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆర్గనైజ్డ్ క్రైమ్ విస్తరించకుండా సమర్థవంతంగా నియంత్రించగలుగుతాం. అంతేకాదు ఆ ప్రాంతంలో ఏ నేరస్తులు ఆధిపత్యం చలాయిస్త్తున్నారన్న విషయం కూడా తెలుస్తుంది. ఇలా ఎన్నో లాభాలు ఈ యాప్ వల్ల పోలీసులు పొందగలరు’ అని నితిక అన్నారు. ఇంకా ‘ నేను హన్సీకి ఎస్ పిగా వచ్చినప్పటికి ఎలాంటి ఇన్స్టిట్యూషనల్ మెమొరీ అనేది అక్కడ లేదు. దీంతో ఆ ప్రాంత నేరస్తులు, వారి కదలికలు, కార్యకలాపాలు, నేరస్వభావాలు, ఉనికి వంటివి అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన పోలీసు అధికారికి నాలుగైదు నెలలు సమయం పడుతుంది.

నేరస్తుల సమాచారం కోసం ఎక్కువగా స్థానికల మీద ఆధారపడవలసి వచ్చేది. పోలీసులు పెట్రోలింగ్ చేసినంత మాత్రన నేర కార్యకలాపాలు నియంత్రణ కావు కూడా. ఇంకో విషయం ఏమిటంటే, బాగా కాకలు తీరిన సీనియర్ నేరస్తులు స్థానికంగా ఉన్న యువతను తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. యువతకు కూడా అలాంటి గ్యాంగులు చేసే నేరకార్యకలాపాలు ఆకర్షణీయంగా, థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఈ విషయాన్ని కూడా నేను గమనించాను. ఇలాంటి యువత పాత నేరస్తులను కలిస్తే ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఆ ప్రాంతంలో పాత నేరస్తుల కదలికలు ఎక్కువయ్యాయా అన్న విషయం తెలుసుకోవడానికి పోలీసులు ఇంటింటిని జల్లెడ పడుతుంటారు. అలాంటి ఏదైనా సమాచారాన్ని గుర్తించడం జరిగితే ఆ వివరాలను పోలీసు సిబ్బంది యాప్ లో అప్లోడ్ చేస్తారు’ అని నితిక వివరించారు. ఇంకా ‘ఇన్వెస్టిగేషన్ నిర్మాణాత్మకంగా సాగేందుకు , పరిశోధన పారదర్శకంగా ఉండేందుకు , వేగంగా, సులభంగా నేరపరిశోధన జరిగేందుకు ఇన్వెస్టిగేషన్ యాప్ ను కూడా రూపొందించాను. ఈ యాప్ బాధితులు లేదా ఫిర్యాదుదారునకు ఎఫ్ ఐ ఆర్ కాపీని సైతం అందిస్తుంది.

దీనివల్ల ఇన్వెస్టిగేటర్ ఆ కేసుల ఇన్వెస్టిగేషన్స్ కు సంబంధించి డిజిటల్ డైరీని నిర్వహించగలరు’ అని నితిక చెప్పారు. గురుగ్రామ్ డిసిపిగా ఉన్నప్పుడు నితిక ‘స్టోలెన్ వెహికల్ డెస్క్’ (ఎస్ విడి) ని ఏర్పాటుచేశారు. దీని కింద నగరంలోని పలుచోట్ల స్పెషల్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ఈ కెమెరాలు ఆ ప్రాంతంలో వెడుతున్న వాహనాల నంబరు ప్లేట్ల వివరాలను రికార్డు చేస్తాయి. ఈ వివారాలన్నింటినీ డేటాబేస్ లో భద్రపరుస్తారు. దీంతో వాహన దొంగలను, నేరస్తులను ఎస్విడి సులభంగా పట్టుకోగలుగుతుంది. గురుగ్రామ్ లోని అన్ని పోలీస్ స్టేషన్లతోనూ ఎస్విడి అనుసంధానమై ఉంటుంది. హర్యానా పోలీసు విభాగంలో ఎస్విడి ఎంతో విజయవంతంగా పనిచేస్తోంది. ఈ క్రెడిట్ కూడా నితికకు చెందుతుంది. హర్యానా ముఖ్యమంత్రి కూడా దీనిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

నితిక హర్యానాలోని రోహ్తక్ లో వైద్య విద్య చదివారు. చదివింది వైద్య విద్యా అయినా ఇన్వెస్టిగేషన్స్, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఘానాన్ని ఆమె వినియోగిస్తున్న తీరు హర్యానాలోని ఎందరో ఉన్నత పోలీసు అధికారులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఆమెలోని ఈ తెలివితేటలపై వాళ్లు ప్రశంసల వర్షం కురిపించడమే కాదు ఆమె తెచ్చిన టెక్నాలజీ యాప్స్ ను రాష్ట్రంలోని పోలీసు శాఖలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఉన్నత పోలీసు అధికారిగా సమర్థవంతమైన పనితీరుతో ఎందరి మెప్పునో పొందుతున్న నితికకు వైద్యురాలిగా నేరాల నియంత్రణకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో కూడా బాగా తెలుసు. అంతేకాదు ఒక పోలీసు అధికారిగా ప్రజా బాధ్యతల విషయంలో ఎంత నిబద్ధతగా ఆమె ఉంటారో ఒక తల్లిగా తన చిన్నారి విషయంలోనూ నితిక చూపుతున్న శ్రద్ధ, బాధ్యతలు పోలీసు శాఖలోని వారికే కాదు సామాన్య మహిళలల్లో సైతం స్ఫూర్తిని నింపుతోంది. అలాంటి నితికను ఈ మహిళా దినోత్సవం రోజున మనందరం ‘సూపర్ విమెన్’గా గర్వంగా తలచుకోవాల్సిందే…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News