Friday, September 20, 2024
Homeఫీచర్స్ఈ లహనా బెంగాలీ స్వీట్ ఎంటర్ ప్రెన్యూర్

ఈ లహనా బెంగాలీ స్వీట్ ఎంటర్ ప్రెన్యూర్

బెంగాల్ కు చెందిన ముప్ఫై ఏళ్ల లహనా ఘోష్ కెనడాలోని ఎంతో లాభకరమైన ఫైనాన్స్ కెరీర్ ను వదులుకుంది. తమ కుటుంబం నాలుగు తరాలుగా కోల్ కతాలో కొనసాగిస్తూ వస్తున్న స్వీట్ల బిజినెస్ ను ధైర్యంగా చేపట్టింది. అంతేకాదు ఆ రంగంలోని పురుషాధిపత్యాన్ని ఒంటిగా ఢీకొట్టి సక్సెస్ఫుల్ మహిళా మిష్తీవాలా (స్వీట్ వాలా) గా రికార్డు స్రుష్టించింది. ఆ విశేషాలు …

- Advertisement -

స్వీటు బిజినెస్ అంటే చిన్నచూపు ఉన్న మిష్తీవాలా కుటుంబాలను నేడు మనం ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఈ విషయంలో ముఫ్ఫై ఏళ్ల లహనా ఘోష్ మటుకు ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే కెనడాలో లాభకరమైన ఫైనాన్స్ కెరీర్ ను వదులుకొని తన కుటుంబం కొల్ కతాలో వందేళ్లుగా కొనసాగిస్తూ వస్తున్న స్వీట్ల బిజినెస్ ను భుజానికి ఎత్తుకుంది. అందులోనూ పురుషాధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో మగవాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా స్వీట్స్ బిజినెస్ ను విజయపధంలో నడిపిస్తోంది. ఏ రంగంలోనైనా మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరని మరో మహిళగా లహనా ఘోష్ కూడా నిరూపిస్తోంది. బెంగాల్ లో ఎన్నో ఏళ్లుగా మిష్తీవాలా కుటుంబాలు చేస్తూ వస్తున్న స్వీట్ల బిజినెస్ ఆ కుటుంబాల్లోని నేటి తరం వారికి ఏమాత్రం ఎగ్జైటెడ్ గా కనిపించడం లేదు. ఆ కుటుంబాల్లోని ఈ తరం వాళ్లు పేస్ట్రీలు, టార్ట్స్ వంటి వాటితో బిజినెస్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయాన్ని అక్కడి మిష్తీవాలా కుటుంబానికి చెందిన లహనా గుర్తించింది. కానీ ఆమె మాత్రం ఈ తరం పిల్లే అయినా తన కుటుంబ బిజినెస్ అయిన స్వీట్ల వ్యాపారాన్ని ఎంతో ఇష్టంతో భుజాలకు ఎత్తుకుంది. బెంగాలీలు ప్రాణం పెట్టే కీర్ కోడమ్స్, మలయ్ చమ్ చమ్స్, మాల్పువా, మిష్తీ దోయ్ వంటి సంప్రదాయ స్వీట్ల రుచులను ప్రజలకు అందిస్తూ ఎందరినో మెప్పిస్తోంది.

కెనడాలో మంచి జీవితం, జీతం అందించే ఫైనాన్స్ కెరీర్ ను వదిలిపెట్టి మరీ తన కుటుంబ స్బీట్ రూట్స్ ను మరవకుండా తిరిగి సొంతనేలకు తిరిగివచ్చి వందసంవత్సరాలుగా చేస్తున్న కుటుంబ స్వీట్ల బిజినెస్ ను ఎంతో ఇష్టంగా చేపట్టింది. లహనా కెనడా వదిలి తన పుట్టిన ఊరు కోల్ కతాకు తిరిగి వచ్చింది. తమ కుటుంబ స్వీట్ల బిజినెస్ గురించి కూలంకషంగా తెలుసుకుంది. తమ మిఠాయిల షాపు అయిన జుగల్ నిర్వహణా బాధ్యతలను ఎంతో ఆత్మవిశ్వాసంతో భుజానికి ఎత్తుకుంది. తరతరాలుగా తమ కుటుంబం కొనసాగిస్తూ వస్తున్న ఆ బిజినెస్ ను బాగా అభివ్రుద్ధిచేయాలన్న తపనతో ఈ బిజినెస్ ను చేపట్టింది . వందసంవత్సరాల క్రితం అంటే 1923 సంవత్సరంలో ఈ స్వీట్ల బిజినెస్ ను ప్రారంభించిన జుగల్ కిశోర్ ఘోష్ పేరులోని జుగల్ నే ఆ స్వీటు షాపుకి పెట్టారు.ఆయన లహనాకు తాత వరుస అవుతారు. ఇప్పుడు సిటీలో వీరికి నాలుగు షాపులు ఉన్నాయి. వాటిల్లో రోజూ వందరకాల బెంగాలీ స్వీట్లను తాజాగా తయారు చేసి అమ్ముతారు. సీజన్ల వారీగా స్పెషల్ స్వీట్లను కూడా చేసి అమ్మడం జుగల్ స్వీట్ల వారి మరో ప్రత్యేకత. బెంగాలీల జీవితమంతా మిష్తీలతో (స్వీట్లు) ముడిపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. పుట్టుక నుంచి అన్నప్రాసన, పండుగలు, పబ్బాలు చివరకు చావు అన్నింటిలోనూ బెంగాలీల జీవనంలో మిష్తీలు లేకుండా ఉండవు. బెంగాలీల జీవితాన్ని మిష్తీల నుంచి వేరుచేసి చూడలేం.

లహనా తండ్రి క్రుష్ణ కాళి ఘోష్ ఇంతకాలం ఈ బిజినెస్ ను నడుపుతూ వచ్చారు. ‘బెంగాలీ మిష్తీల తయారీ నిజంగా ఒక కళ. వీటి ఖరీదు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది’ అంటుంది లహనా ఘోష్. బెంగాలీలు ఎంతో ఇష్టపడే మాల్పువా స్వీటు భారత దేశంలోనే అత్యంత పురాతనమైన డెజర్టుగా పేరు. ఈ డెజర్టు ప్రస్తావన రుగ్వేదంలో కూడా ఉందంటుంది లహనా. బెంగాలీలు వాడే పాలలో 60 శాతం మిష్తీ తయారీకి ఉపయోగిస్తారుట. వీటికి ఉపయోగించే ట్రేలు కూడా చేప, శంఖం వంటి ఆకారాలతో ఎంతో కళాత్మకంగా ఉంటాయి.
బెంగాలీలకు మిష్తీలంటే ఎంతో ఇష్టం. ఎంతలా అంటే కరోనా సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు సైతం నగరంలోని మిష్తీ షాపులను రోజూ కొన్ని నిర్దిష్ట గంటల పాటు తెరిచి ఉంచేట్టు బెంగాల్ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారంటే మిష్తీలు బెంగాలీల జీవనంలో ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు. బెంగాలీలు మిష్తీలను ఆస్వాదించే వైనం మరే సంస్క్రుతిలోనూ కనపడదంటుంది లహనా ఘోష్. అలాంటి గొప్ప సంస్క్రుతీ నేపథ్యం ఉన్న మిష్తీల తయారీ బిజినెస్ లోకి ప్రవేశించిన లహనా ఘోష్ చిన్నతనం అంతా కోల్ కతాలోనే గడిచింది. వారి కుటుంబం నిర్వహిస్తున్న స్వీట్ల ఫ్యాక్టరీ చుట్టూ ఆమె బాల్యం గడిచింది. చదువు కూడా అక్కడే. అందుకే లహనా ‘నాకు మిష్తీల భాష, రంగు, రుచి అన్నీ తెలుసు. అది నా రక్తంలోనే ఉంది’ అంటుంది. పందొమ్మిదేళ్లు వయసు వచ్చిన తర్వాత తన ప్రేమ కోసం లహనా కెనడా వెళ్లింది. ఆ రిలేషన్ షిప్ తొందరగానే ముగిసిపోయినా నిరాశకు గురికాకుండా అక్కడే తన చదువు కొనసాగించింది. ఎనిమిదేళ్ల పాటు తన కెరీర్ అయిన ఫైనాన్స్ రంగంలోనే కెనడాలో ఉద్యోగం చేసింది. తొందరలోనే తన సొంత ఊరు కోల్ కతాకు వెళ్లి తండ్రితో కలిసి పనిచేస్తానని లహనా గాఢంగా నమ్మేది. కానీ ఆ పరిస్థితి చాలా త్వరగా వస్తుందని మాత్రం తను ఊహించలేదంటుంది లహనా ఘోష్.

లహనా జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన ఒకటుంది. కోవిడ్ సమయంలో టివిలో చెఫ్ టేబుల్ అనే షోను లహనా చూసింది. అందులో ఆస్మా ఖాన్ గురించి ఉంది. ఆమె కోల్ కతాలోని పార్క్ సర్కస్ నుంచి వచ్చారు. డార్జిలింగ్ ఎక్స్ ప్రెస్ అనే లండన్ పాప్యులర్ రెస్టారెంటును ఆమె నడుపుతున్నారు. ఆ ఎపిసోడ్ తన జీవితాన్నే మలుపుతిప్పిందని లహనా ఘోష్ అంటుంది. సరిగ్గా అదే సమయంలో లహానా తండ్రికి కోవిడ్ రావడంతో కోల్ కతాకు లహనా పయనమైంది. విదేశాల్లో జీవితం, డిజిటలైజేషన్, మార్కెటింగ్ పోకడలు అన్నింటినీ కళ్లారా చూసిన లహనా తమ జుగల్ షాపుని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నదానిపై స్పష్టమైన అవగాహనతో ఉంది. ఈ బిజినెస్ను లహనా చేబట్టే ముందువరకూ జుగల్ స్వీట్లు ఆన్ లైన్ లో మాత్రమే లభించేవి. లహనా వచ్చిన తర్వాత తమ స్వీట్లను స్వీగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా కూడా వినియోగదారులకు అందుబాటులోకి తేవడం మొదలెట్టింది.
అంతేకాదు తమ స్వీట్ల వెబ్ సైట్లను ఆధునీకరించింది. ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా దానికి చేర్చింది. బెంగాలీ మిష్తీల వందసంవత్సరాల వేడుకలలో భాగంగా మిష్తీలపై తొట్టతొలిసారి లిటరేచర్ ఫెస్టివల్ ను సైతం లహనా నిర్వహించింది. తమ బిజినెస్ ను ఆరు నెలలల్లో డిజిటలైజ్ చేయాలని ఆమె భావించింది. కానీ ఆ పని అనుకున్నంత వేగంగా సాధ్యపడలేదు. అవ్వవస్థీక్రుత రంగంలో ఉన్న ఈ బిజినెస్ నిర్వహణలోని సంక్లిష్ట పరిస్థితులను లహనా అధ్యయనం చేసింది. ‘ ఈ క్రమంలోనే ఈ బిజినెస్ లో మగవాళ్లదే పైచేయిగా ఉండడం నేను గమనించాను. ఈ రంగంలో మార్పు అనేది మెల్లగా మాత్రమే సాధ్యమని గ్రహించాను. మిష్తీని తయారుచేసేవాళ్లు, ఆ షాపుల యజమానులు, స్టేక్ హోల్డర్స్ అందరూ మగవాళ్లేనని గుర్తించాను. నేను ఈ రంగంలో పురుషాధిపత్యాన్ని బాగా ఎదుర్కోవలసి ఉందని అర్థమైంది. ఈ బిజినెస్ సూపర్ వైజింగ్ లో గాని, ఫ్యాక్టరీల్లో గానీ మహిళలు మీకు కనిపించరు’ అని లహనా చెప్పుకొచ్చింది. అందుకే ఈ పరిశ్రమలోని ప్రొఫెషనల్ కిచెన్స్ లో స్త్రీలకు ప్రవేశం సాధ్యం చేయాలని లహనా అనుకుంది. కారణం స్త్రీలు వంటిళ్లు శుభ్రంగా ఉంచుతారు. కస్టమర్ సర్వీసులను బాగా నిర్వహిస్తారు. అంతేకాదు మరెన్నో విషయాలను ఎంతో బాగా ఆలోచిస్తారు అని లహనా ద్రుఢ అభిప్రాయం. కానీ ఈ విషయంలో తండ్రి నుంచే ఆమెకు నిరసన ఎదురైంది. చివరకు లహనా స్త్రీలను మొదట స్టోర్ ఫ్రంట్ లో ప్రవేశపెట్టడంతో మార్పులకు లహనా నాంది పలికింది. మెల్లమెల్లగా ఈ బిజినెస్ మెయిన్ స్ట్రీమ్ లోకి స్త్రీలను తీసుకురావాలని లహనా గట్టిగా నిశ్చయించుకుంది. విచిత్రం ఏమిటంటే ఈ బిజినెస్ లో తమ కుటుంబంతో పాటు తరతరాలుగా పనిచేస్తున్న పనివాళ్లు (కరిగాలు) సైతం స్త్రీ అయిన లహనా ఈ పనిలో పాలుపంచుకోవడం పట్ల ఇష్టం చూపలేదు. కానీ లహనా మాత్రం వెనుకడుగు వేయలేదు. మెల్లగానే అయినా తన ఆలోచనలను చిన్న చిన్న మార్పులు చేపట్టడం ద్వారా అంచెలవారీగా చేపట్టడానికి లహనా పూనుకుంది.

మిష్తీ బిజినెస్ లోని మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇళ్లల్లోని స్త్రీలే ఈ స్వీట్లను తయారుచేస్తారు. సీజనల్ స్పెషల్స్ అయిన పీథె పులి, పూజో, నారు వంటివి అయితే చేసేది పూర్తిగా ఇళ్లల్లోని స్త్రీలే. కానీ వీళ్లు ప్రొఫెషనల్ కిచెన్స్ లోకి ప్రవేశపెట్టే విషయంలో మాత్రం పురుషాధిపత్యమైన ఈ బిజినెస్ కమ్యూనిటీ నుంచి తీవ్ర వ్యతిరేకత తలెత్తడం వ్యంగ్యమైన పరిస్థితిని సూచిస్తుందంటుంది లహనా. మొత్తానికి తన కవల సోదరి అంగనా సహకారంతో మిష్తీ బిజినెస్ లో రకరకాలుగా అధ్యయనాలను లహనా కొనసాగించింది. ఈ మార్కెట్ లో వస్తున్న రకరకాల కొత్త ట్రెండులను గమనించింది. ‘మిష్తీ వాలా కొడుకు మిష్తీవాలా అవడానికి ఇష్టపడటం లేదు. స్వీట్లను తయారుచేసే పనివాళ్ల కొడుకులు కూడా తమ తండ్రి చేస్తున్న పనిని తాము కొనసాగించడానికి ముందుకురావడం లేదు. అంతేకాదు నేను ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ ను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ల పిల్లలు కూడా ఎవ్వరూ ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టలేదు. వీరిలో చాలామంది పిల్లలు పేస్ట్రీ చెఫ్ లు అవదామనుకుంటున్నారు కానీ మిష్తీ కరిగార్స్ కావాలనుకోవడం లేదు’ అని లహనా చెప్పింది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే పిల్లలు కూడా గతంలో లాగ స్వీట్ షాపులకు రావడానికి ఇష్టపడటం లేదు అంటుంది లహనా. ‘అయినా కూడా బెంగాలీ జీవితంలో మిష్తీ పూర్తిగా
కనుమరుగవుతుందనే విషయాన్ని నేను అస్సలు విశ్వసించను. మిష్తీని అద్రుశ్యం కానివ్వను. బెంగాలీ స్వీట్లను గ్లోబల్ పటంలో చేర్చడమే నా లక్ష్యం ’ అంటుంది లహనా. ఈ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి చేరడానికి చేయవలసినది ఎంతో ఉందని లహనా అంటుంది. అందుకే మిష్తీ స్వీట్లను అందరూ ఇష్టపడేలా కొత్త కొత్త పోకడలను మిష్తీ పరిశ్రమలో ప్రవేశపెట్టాలని లహనా భావించింది. ఈ రంగంలోనూ స్వీట్ల తయారీకి యంత్రాలు వచ్చాయి. కానీ చిన్న మిష్తీ షాపులు ఖరీదైన యంత్రాలు కొనలేవు కదా. ఇంకొకటి ఏమిటంటే మిష్తీ స్వీట్ల షెల్ఫ్ లైఫ్ తక్కువ. వాటిని వేరేచోటకి పంపడం కూడా కష్టమైన వ్యవహారం. పైగా మిష్తీ పాలమీద ఆధారపడి తయారయ్యే స్వీట్లు. మరోవైపు కార్బన్ పదార్థాల విడుదలవుతాయన్న కారణంగా ప్రపంచం అంతా డైరీ ఫ్రీ దిశగా అడుగులు వేస్తోంది. ఈ వాతావరణంలో మిష్తీ వాలాల పరిస్థితి ఏమిటి? కొత్త అంశాలు ఈ రంగంలో ఎలా చేర్చాలన్న ఆలోచనలు లహనాను చుట్టుముట్టాయి. కొందరు వేగాన్ మిష్తీ తయారీ గురించి సైతం ఆలోచించారు. వీటన్నింటికీ పరిష్కారాలు ఏమిటి అని లహనా ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది.
ఈ క్రమంలోనే మిష్తీపై లిటరేచర్ ఫెస్టివల్ సైతం ఆమె ఏర్పాటుచేసింది. మిష్తీ స్వీట్ల కు సంబంధించి నూతన మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు, వాటి సాంస్క్రుతిక ప్రాధాన్యం, ఈ స్వీట్ల భవిష్యత్ ఇవన్నీ లహానా ఆలోచనల్లో ఉన్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ‘మిష్తీ మధురిమని అద్రుశ్యం కానివ్వకూడదు. వాటిని నిత్యం ప్రజల జీవనంలో భాగస్వామ్యం చేస్తూ మరింత మాధుర్యంతో, ఆరోగ్యంతో, సంస్క్రుతీ సంపదతో అవి పరిఢవిల్లేట్టు, అందరూ ఆస్వాదించేట్టు మలచాలన్నదానిపైనే ఎప్పుడూ నా చూపు నిలిచి ఉంటుందంటుం’ది లహనా. ఆ దిశగా తన క్రుషి కొనసాగుతూనే ఉంటుందని ఎంతో మీఠీగా ….అదేనండి బెంగాలీ స్వీట్ల నుంచి ఊరే తీయదనంలాంటి చక్కెర మాటలు లహనా నోటి నుంచి నిరంతరాయంగా వస్తూనే ఉంటాయి. మరి లహనా ఘోష్ ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుదామా..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News