Ethical Living: “ప్రస్తుత సమాజంలో నీతి, నిజాయితీలు లోపిస్తున్నాయని, నైతిక విలువలు పతనమవుతున్నాయన్నది అందరూ అంగీకరించ వలసిన కఠిన వాస్తవం. మంచైనా, చెడైనా పెద్దలను చూసి చిన్నవారు నేర్చుకుంటారు. పెద్దవారు పద్ధతిగా ఉంటే చిన్నవారు వారిని అనుసరిస్తారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలనతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారి జీవిత చరిత్రలను పిల్లలకు తల్లి దండ్రులు కథల రూపంలో, ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పగలగాలి. ప్రతి తల్లి, తండ్రి తమ సంతానానికి ఉత్తమ ఉపాధ్యాయులు కావాలి.
తెలుగు భాషలో చిన్నారులను ఆకట్టుకునే ఎన్నో మంచి నీతి కథలు ఉన్నాయి. వాటిని పిల్లల మనసులకు అర్థమయ్యేలా పెద్దవారు చెప్పగలగాలి. నీతి, నిజాయితీ, అహింస, సత్యసంధత, క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత, సత్ప్రవర్తన వీటన్నింటి సమాహారమే నైతిక విలువలతో జీవన యానం. నీతివంతమైన జీవితం అలవాడాలంటే చిన్నారులకు బాల్యం నుంచే పుస్తక పఠనంతో పాటు నైతిక విలువల ప్రవర్తన ను అలవరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. నైతిక వర్తన లేని మనుషులు ప్రశాంతంగా జీవించలేరు. సంతోషంగా ఉండలేదు. సమాజాన్ని సంతోషంగా ఉంచలేరు. అనైతిక వ్యక్తుల వల్ల సమాజం అల్లకల్లోలంగా మారుతుంది. దీనికి మహాభారతం పెద్ద ఉదాహరణగా కనపడుతుంది. అందుకే నైతిక విలువలను పెంపొందించే సత్సాంగత్యం, సద్గ్రంధ పఠనం నేటి యువతకు తప్పనిసరి. ఈ దిశలో తల్లిదండ్రులు ఆలోచించాలి మరి. ”
బాల్యం నుంచే గట్టి పునాది పడాలి
నేటి స్వచ్ఛ భారతావనికి, స్వచ్ఛ సమాజ నిర్మాణానికి భౌతిక, భౌగోళిక పరిశుభ్రతే కాదు. మనసును శుభ్రంగా ఉంచే నైతిక విలువలు ఎంతో అవసరం. నైతిక విలువలు లేని దేశం ఎప్పటికీ పురోభివృద్ధి సాధించలేదు. దేశ ప్రగతిలో యువతదే కీలకమైన పాత్ర. అటువంటి యువత నీతివంతంగా ఎదగడానికి, సత్ప్రవర్తనతో కూడిన బాధ్యతాయుతంగా మనగలడానికి బాల్యం నుంచే గట్టి పునాది పడాలి. ఆ దిశలో మన విద్యా వ్యవస్థ మారవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది.
చిన్నతనంలో పడే ముద్ర జీవితాంతం ఉంటుంది
ప్రస్తుత సమాజంలో నీతి, నిజాయతీలు లోపిస్తున్నాయని, నైతిక విలువలు తరిగిపోతున్నాయన్నది అందరూ అంగీకరించవలసిన కఠినమైన వాస్తవం. మంచైనా, చెడైనా పెద్దలను చూసి చిన్నవారు నేర్చుకుంటారు. పెద్దవారు పద్ధతిగా ఉంటే చిన్నవారు వారిని అనుసరిస్తారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలనలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారి జీవిత చరిత్రలను పిల్లలకు తల్లిదండ్రులు కథల రూపంలో, ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పగలగాలి. ప్రతి తల్లి తండ్రి తమ సంతానం వరకు ఉత్తమ ఉపాధ్యాయులుగా మారాలి. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తాము ఆచరిస్తూ చెప్పే బోధనలు పిల్లలపై అత్యంత ప్రభావం చూపిస్తాయి. సిద్ధార్థుడు నగర సంచారం చేస్తూ చూసిన ఎన్నో సంఘటనలు అతని జీవితాన్ని బుద్ధుడిగా ఎలా మార్చాయో.. పిల్లలకు సిద్ధార్థుని కథల రూపంలో తల్లిదండ్రులు చెప్పాలి. సిద్ధార్థుడి చరిత్ర నైతిక ప్రవర్తనకు ఉత్తమ పాఠ్య గ్రంథం అని చెప్పవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ బాల్యంలో చూపిన ధైర్య సాహసాలు, గోవధ నిషేధం అమలు పరచడం మొదలైన విశేషాలను తెలిపే సంఘటనలను చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకు పెద్దలు వివరించాలి. అలా చెప్పిన విషయాలు చిన్న పిల్లల హృదయాలపై చెరగని ముద్రలు వేస్తాయి. ఆ ప్రభావం వారి జీవితాంతం ఉండి, వారిని ఉత్తమ పౌరులుగా మారుస్తాయి.
విచక్షణ, వివేచన, విశ్లేషణ ఇవ్వని విద్య నిరుపయోగం
తెలుగు భాషలో చిన్నారులను ఆకట్టుకునే ఎన్నో మంచి నీతి కథలు ఉన్నాయి. వాటిని పిల్లల మనసులకు అర్థమయ్యేలా పెద్దవారు చెప్పగలగాలి. గురు ముఖతః విన్నవాటికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ గురువు బాల్యంలో ఇంటి వద్ద తల్లిదండ్రులైనా కావచ్చు. పాఠశాలలో ఉపాధ్యాయుడైన కావచ్చు. తేట తెలుగు భాషలో ఎన్నో నీతి శతకాలు ఉన్నాయి. భారత, రామాయణ, భాగవత గ్రంథాలు సైతం నీతి కథలు, ధర్మాలు, సత్ప్రవర్తన సూత్రాలతో నిండి ఉంటాయి. సాహిత్య సంపదను మాతృభాషలోనే అందించే ప్రయత్నం బాల్యంలోనే ప్రతి తల్లి తండ్రి చేయాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారన్న దానికన్నా, వారి కోసం ఎంత నాణ్యమైన సమయం వెచ్చిస్తున్నారన్నదానిపైనే పిల్లల నైతిక ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం ఆధారపడి ఉంటాయన్నది నిజం! మాతృభాష సంస్కారాన్ని ఇస్తుంది. ఆలోచన విధానాన్ని పెంచుతుంది. మాతృభాషతో అనుసంధానమైన చదువు నైతిక జీవన వికాసానికి దోహదం చేస్తుంది. జ్ఞానాన్ని, విచక్షణను, వివేచనను, విశ్లేషణను ఇవ్వని విద్య నిరూపయోగం.
పరీక్షల వరకే పరిమితమయ్యే చదువులు నిష్ప్రయోజనం
నీతి, నిజాయితీ, అహింసా, సత్యసంధత, క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత, సత్ప్రవర్తన ఇలా వీటన్నింటి సమాహారమే నైతిక విలువలతో కూడిన జీవన యానం. నీతివంతమైన జీవితం అలవడాలంటే చిన్నారులకు బాల్యం నుంచే పుస్తక పఠనం అలవరచాలి. ప్రాచీన సాహిత్యంలో గురు శిష్య పరంపరపై ఉత్తమ కథలున్నాయి. అవేవీ చదవకుండా, వినకుండా సత్ప్రవర్తన ఎలా అలవడుతుంది? పాఠ్యాంశాల్లో ఉండే విషయాలు పరీక్షలకే పరిమితమైతే చిన్నారుల జీవితం గాడి తప్పక ఏమవుతుంది? కనుక పరీక్షలు, మార్కులు ర్యాంకులకే పరిమితమయ్యే చదువులు అనర్థాలకు కారణం అవుతున్నాయి. అలా కాకుండా పరీక్షలు మార్కులు, ర్యాంకులతోపాటు, నైతిక విలువల పోషణతో కూడిన విద్యను చిన్నారులకు అలవరచవలసిన బాధ్యత పెద్దలపైన ఖచ్చితంగా ఉన్నది.
చదువుతోపాటు నైతికత అలవర్చుకోవడం తప్పనిసరి!
నేర్చుకున్న విషయాలను జీవితంలో అమలుపరచకపోతే వ్యక్తిత్వం ఏనాటికి వికసించదు. చదువుకున్న చదువుకు, జీవిత విధానానికి మధ్య ఉన్న పెద్ద అగాధం పూడ్చుకున్నప్పుడే మానవ జీవితంలో మార్పు సాధ్యపడుతుంది. చేసే పనులలో చిత్తశుద్ధి, మమేకత లేకపోతే ఆ పనులకు విలువే ఉండదు. నైతిక ప్రవర్తన లేని మనుషులు తాము ప్రశాంతంగా జీవించలేరు. తమతోబాటు సమాజాన్ని ప్రశాంతంగా జీవించనివ్వరు. అవినీతి మార్గమనే ముళ్ళబాటలో నడిచే వారికి జీవితంలో స్థిమితం, గౌరవం ఎన్నటికీ లభించవు. ఒకవేళ గౌరవాదరాలు లభించినా అవి ఆ వ్యక్తికి ఆ సమయంలో సమాజంలో ఉన్న పలుకుబడి గుర్తింపు లకే గానీ ఆ వ్యక్తికి ఎంత మాత్రం కాదు. మరణానంతరం కూడా మనిషిని శాశ్వతం చేసేది తన నైతిక ప్రవర్తన ,వ్యక్తిత్వము. నైతిక విలువలను పెంపొందించుకోవాలంటే సత్సాంగత్యం, సత్ గ్రంధ పఠనం తప్పనిసరి! ఈ దిశలో నేటి విద్యా వ్యవస్థ కొనసాగాలి.
“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

