Sunday, November 24, 2024
Homeఫీచర్స్Oscars: కార్తికీ తొలి డాక్యుమెంటరీకి ఆస్కార్

Oscars: కార్తికీ తొలి డాక్యుమెంటరీకి ఆస్కార్

తమిళ డాక్యుమెంటరీ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ కి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ముప్ఫై ఆరేళ్ల కార్తికీ గాన్ స్లేవ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఆమె తొలి డాక్యుమెంటరీ చిత్రం కావడం విశేషం. మానవుడికి, ప్రక్రుతికి మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధాన్ని తెరకెక్కించాలన్నదే ఈ డాక్యుమెంటరీ రూపకల్పన వెనుక కార్తికీ ప్రధాన ఉద్దేశం. తొలి ప్రయత్నంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతంచేసుకుని ఎందరో ప్రశంసలను అందుకుంటున్న కార్తికీ గురించి కొన్ని విశేషాలు…

- Advertisement -

కార్తికీ ఊటీలో జన్మించారు. 36 ఏళ్ల కార్తికీకి డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీలలో మంచి అనుభవం ఉంది. బొమ్మన్, బెల్లీ అనే దంపతులకు, రఘు అనే అనాధ ఏనుగుపిల్లకు మధ్య ఏర్పడిన అనుబంధం చుట్టూతా ఈ డాక్యుమెంటరీ సాగుతుంది. ఎంతో ప్రాణప్రదంగా భావించిన ఈ ప్రాజక్టును సజీవంగా తెరకెక్కించడంలో కార్తికీ చేసిన ప్రయత్నం ఆమెను ఆస్కార్ విజేతగా నిలిపింది. బొమ్మన్, బెల్లీ, రఘు అనే ఏనుగు పిల్ల మధ్య ఏర్పడ్డ ప్రేమానుబంధంలోని భావోద్వేగాలను తన కెమెరా కన్నుతో పట్టుకోవడంలో కార్తికీ పూర్తిగా విజయవంతమయ్యారు. ఒక మనిషికి, జంతువుకు మధ్య ఏర్పడిన ఆత్మీయానుబంధాన్ని కార్తీకి రూపొందించిన ఈ డాక్యుమెంటరీ అద్దంపడుతుంది.

జంతువులతో పనిచేసిన అనుభవమున్న సినిమాటోగ్రాఫర్లనే ఈ చిత్ర నిర్మాణంలో కార్తికీ తీసుకున్నారు. వాళ్లు అడవిలో ఎలాంటి భయం బెరుకు లేకుండా పనిచేసే వాళ్లై ఉండేలా ఆమె జాగ్రత్తపడ్డారు. మరోవైపు క్రిష్ మఖీజా, కరణ్ తప్లియాల్, ఆనంద్ బన్సాల్ తో కలిసి కార్తికీ ఈ డాక్యుమెంటరీకి రెండవ కెమెరా పెట్టుకుని పనిచేశారు. కార్తికీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, కెమెరా విమెన్ కూడా.

‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ డాక్యుమెంటరీ నిర్మాణాన్ని 2017లో కార్తికీ ప్రారంభించారు. ఇది పూర్తికావడానికి ఆమెకు ఐదు సంవత్సరాలు పట్టింది. ఇందుకు 450 గంటల పైగా ఫుటేజ్ ను ఆమె రికార్డు చేశారు. ఈ డాక్యుమెంటరీ తీసిన పరిసరాలు కార్తికీకి సుపరిచితాలు. ఆ ప్రాంతంలోనే ఆమె పెరిగారు. ఆమె స్వంత ఊరు పశ్చిమకనుమలలో ఉండే నీలగిరీ లో ఉంది. ఆమె ఉంటున్న ఊటి నుంచి అరగంటలో ముదుమలై నేషనల్ పార్కుకి వెళ్లొచ్చు. ‘ నేను తరచూ ఊటీ నుంచి బెంగళూరు వెడుతుండేదాన్ని. ఆ సమయంలో ఒకసారి బొమ్మయ్, రఘు (ఏనుగుపిల్ల) కలిసి వెళ్లడం చూశాను. ఆ ద్రుశ్యం నన్ను ఎంతో ఆకర్షించింది. నాలో తెలీని ఉత్సుకతను రేపింది. బొమ్మయ్ నా ఆసక్తిని గమనించి తనతో పాటు రమ్మనిమని అన్నారు. అంతే క్షణం కూడా ఆలోచించకుండా నా కారును పక్కన పెట్టేసి ఆ సాయంత్రం ఆయనతో, ఆ ఏనుగుపిల్లతో గడిపాను. బొమ్మయ్ ఏనుగుపిల్లను నది దగ్గరకు తీసుకువెళ్లి ఎంతో ప్రేమగా దానికి స్నానం చేయించడం చూశాను. ఆ రోజు నేను చూసిన ఆ ద్రుశ్యాన్ని ఇప్పటికీ మరవలేదు. నిజానికి మదుమలై నేషనల్ పార్కు శాంక్చురీకి మూడేళ్ల ప్రాయం నుంచీ నేను వెడుతుండేదానిని.

అయితే మూడు నెలల వయసున్న రఘు అనే ఏనుగు పిల్లతో, బొమ్మన్ తో ఆనాటి నా అనుభవం నాపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. అదే ఈ డాక్యుమెంటరీకి నాంది పడేట్టు చేసింది. బొమ్మన్ కు ఆ ఏనుగుపిల్లతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందనిపించింది. అలాంటి అనుబంధాన్ని నేను ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. బొమ్మన్ కు ఆ ఏనుగు పిల్ల కొడుకు కంటే కూడా చాలా ఎక్కువ. అలాంటి అనితర సాధ్యమైన ప్రేమబంధం ఆ ఏనుగు పిల్లకు, బొమ్మన్ కు మధ్య పరిమళించడం నేను గమనించాను. ఆ చిన్నారి ఏనుగుపిల్ల తన తొండాన్ని బొమ్మన్ చేతులకు పెనవేసి నడుస్తుంటే, మరోవైపు బొమ్మన్ రఘును వీడకుండా కంటికి రెప్పలా కాస్తుండడం నాకు అద్భుతంగా తోచింది. ప్రక్రుతికి, మానవునికి మధ్య ఉండే అపురూపమైన, అందమైన అనుబంధం వారిద్దరి మధ్యలో నేను చూశాను. అదే ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు ప్రాణంపోసింది. 2017, 2018 సంవత్సరాల్లో నేను చేపట్టిన ఈ ఫిలిం నిర్మాణ అనుభవాలు నా జీవితంలో ఎన్నో అపురూపమైన జ్జాపకాలను నింపాయి. అవి జీవితాంతం నన్ను వీడని మధురమైన, మరుపురాని అనుభూతిని ఇచ్చాయి’ అని కార్తికీ అన్నారు. ‘నేను మొట్టమొదట రఘును చూసినపుడు అది నా మోకాలి ఎత్తులో ఉంది. ఇపుడు పెద్దదైంది’ అని కార్తికీ ఆ ఏనుగుపిల్లను ఎంతో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు.

బొమ్మన్ దంపతులు, ఏనుగు పిల్ల రఘుతో కలిసి కార్తీక్ కొంతకాలం జీవించారు. వారితో కలిసి మెలిసి తిరిగారు. తన పట్ల వారికి నమ్మకం కలిగేలా ఎంతో క్రుషిచేశారు. నీలగిరి అడవుల్లో కార్తికీ ఒంటరిగా తిరిగిన సందర్భాలు కోకొల్లలు. ఆ సందర్భంలో పలుమార్లు పులులు, చిరుతలు తనకు ఎదురపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయంటారామె. అడివి ఏనుగుపిల్లలను కూడా తాను చూశానని, కానీ బొమ్మన్, రఘుల మధ్య ఉన్న అనుబంధం విశేషమైందని కార్తికీ అంటారు. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసి బొమ్మన్, బెల్లీలు ఎంతో ఆనందించారని కార్తికీ తెలిపారు.

సోషల్ డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్గా , ఫిలింమేకర్ గా, సోనీ అల్ఫా సీరీస్ కి సోనీ ఇమేజింగ్ అంబాసిడర్ గా పనిచేసిన మహిళల్లో కార్తికీ ఒకరు. కార్తికీ తనను ట్రావలర్గా, ఎక్స్ ప్లోరర్ గా చెప్పుకుంటారు. గతంలో పలు వ్యాపార ప్రకటనలు, డాక్యుమెంటరీలు, రియలిటీ సీరీస్ లను కార్తికీ చేశారు. ఆమె చేసిన వర్క్సు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి కూడా. వన్యమ్రుగప్రాణులన్నా, ప్రక్రుతి అన్నా కార్తికీకి ఎంతో ప్రాణం. కార్తికీ తండ్రి ఫొటోగ్రాఫర్. తల్లికి అడవులు, చెట్లు, పచ్చదనం అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రుల నుంచి ఈ గుణాలు కార్తికీకి వచ్చాయంటారు ఆమెని ఎరిగిన వారు. కార్తికీ బామ్మ కూడా అమెచ్యూర్ నేచురలిస్ట్.

ప్రస్తుతం కార్తికీ ప్రక్రుతిపై, వైవిధ్యమైన సంస్క్రుతల శోధనపై తన ద్రుష్టిని కేంద్రీకరించారు. మానవ ఉనికి, జీవరాసుల ఉనికి, ప్రక్రుతి ఉనికి ఈ మూడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని కార్తికీ అంటారు. తన వర్కు ద్వారా పర్యావరణం, వివిధ సంస్క్రుతులపై కార్తికీ క్రుషి చేస్తున్నారు. ప్రజలు ప్రక్రుతితో అనుసంధానమయ్యేలా ఫోటో, ఫిలిం మీడియంలను కార్తికీ ఎంతో చాకచక్యంగా ఉపయోగించుకుంటున్న తీరు పలువురిని ఆకట్టుకుంది. డాక్యుమెంటరీలో తను సాధించిన ఆస్కార్ ఎందరో నూతన ఫిలిమ్ మేకర్స్ అవకాశాలను భవిష్యత్తులో మెరుగుపరచగలవనే ఆశాభావాన్ని కార్తికీ ఈ సందర్భంగా వ్యక్తంచేశారు.

క్రెడిట్ కార్తికీదే..

‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ డాక్యుమెంటరీని గునీత్ మోంగా నిర్మించారు. మోంగా ప్రొడక్షన్ హౌస్ నుంచి లంచ్ బాక్స్, మసాన్, పగ్లైత్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. 2020లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్స్ కేటగిరిలో ‘పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే ఫిలిం కు ఆస్కార్ అవార్డు వచ్చింది. అయితే తాను ఆ సినిమా నిర్మాణ బ్రుందంలో ఒకరిని మాత్రమేనని, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశానని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె నిర్మించిన‘ ది ఎలిఫెంట్ విస్పర్స్ ’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్స్ కేటగిరిలో నామినేట్ అవడం, దానికి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును అందుకోవడం జరిగింది. ఇదే తనకు వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు అని ఆమె ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి చిన్న ప్రొమో తయారుచేసి దాన్ని తనకు కార్తికి చూపించారని గునీత్ మోంగా తెలిపారు. ఆమె పనితనం, సినిమాటోగ్రఫీ తనను ఆశ్చర్యచకితురాలిని చేసిందన్నారు.

‘రఘు (ఏనుగుపిల్ల), బొమ్మన్ దంపతుల మధ్య ఉన్న అపూర్వ అనుబంధాన్ని డాక్యుమెంటరీగా తీయాలన్న ఆమె తీవ్ర అభిలాష నన్ను ఎంతో ముగ్ధురాలిని చేసింది. ఈ ప్రాజక్టుకు నా శక్తిమేర మద్దతునివ్వాలని నిశ్చయించుకున్నా’ అని గునీత్ చెప్పుకొచ్చారు. ‘ఐదు సంవత్సరాల పాటు కార్తికీ దీనిపై పనిచేస్తే, నేను మూడున్నర సంవత్సరాలు ఆమెతో కలిసి ప్రయాణించాను. ఆ అటవీ ప్రాంతంలో 450 గంటల ఫుటేజ్ ని కార్తికీ బ్రుందం తీసింది ఈ ప్రాజక్టును చేపట్టడానికి నెట్ఫ్లిక్స్ ముందుకు రావడంతో ఈ డాక్యుమెంటరీ నిర్మాణం కార్యరూపం దాల్చింది’ అని గునీత్ గుర్తుచేసుకున్నారు. ఈ కథను తొలుత గుర్తించింది కార్తికీ కాబట్టి ఈ అవార్డు క్రెడిట్ కార్తికీకికే వెడుతుందని గునీత్ అన్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ఒక మహిళా దర్శకురాలికి మద్దతుగా నిలబడగలిగినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని గునీత్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News