పిల్లల పెంపకం విషయంలో కొంతమంది తల్లిదండ్రులు అతి శ్రద్ధ, విపరీతమైన ఏకాగ్రత ప్రదర్శిస్తుంటారు. పిల్లల ప్రతి కదలిక, మాట, చేత తాము చెప్పినట్టే ఉండాలని ఆరాటపడిపోతుంటారు. ఈ ఓవర్ పేరెంటింగ్ ధోరణి పిల్లల మీద మంచి కన్నా చెడు ఫలితాలే ఎక్కువ చూపుతుంది. పిల్లల నిర్ణయాలు, ఛాయిస్ ల దగ్గరి నుంచి అన్నింట్లల్లో తమకు నచ్చేలా, తాము మెచ్చేలా వాళ్లు ఉండాలని ఇలాంటి తల్లిదండ్రులు భావిస్తుంటారు. ప్రతి దానికీ తమ మీదే పిల్లలు ఆధారపడి ఉండాలని వీళ్లు కోరుకుంటుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. తమకు తాము నిర్ణయాలు తీసుకోగలిగేలా మెచ్యూరిటీతో పిల్లలు వ్యవహరించేలా తీర్చిదిద్దడమే గుడ్ పేరెంటింగ్. అంతే తప్ప పిల్లలు వేసే ప్రతి అడుగూ తమ సలహాసంప్రదింపులతోనే సాగాలనుకోవడం సరైన పేరెంటింగ్ అనిపించుకోదు. పేరెంటింగ్ పిల్లలకు భద్రతా ఫీలింగును ఇచ్చేలా ఉండాలి.
చిన్నారులకు స్ఫూర్తినిచ్చేలా సాగాలి. తమ పిల్లలకు సరైన మార్గదర్శకత్వాన్ని పేరెంట్స్ చూపగలగాలి. ప్రతి తల్లితండ్రులూ తమ పిల్లలకు బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. ఆ క్రమంలో తమ తప్పొప్పులు తెలుసుకోకుండా పిల్లలను పెంచడం సరైన విధానం కాదని వారు గుర్తించాలి. ఓవర్ పేరెంటింగ్ పిల్లల్లోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు దీనివల్ల పెరిగిపెద్దయ్యే కొద్దీ తమంతట తాము నిర్ణయాలు తీసుకోగలిగే చొరవను పిల్లలు కోల్పోతారు. ఓవర్ పేరెంటింగ్ వల్ల పిల్లలు పెద్దయ్యే కొద్దీ తమ సమస్యలను తాము పరిష్కరించుకునే సామర్థ్యం కోల్పోతారు.
అంతేకాదు ఏదైనా కొత్త పనులను చొరవగా చేయడానికి జంకుతారు. వాటిని చేయడంలో తాము ఎక్కడ వైఫల్యం చెందుతామేమోనన్న భయం ఓవర్ పేరెంటింగ్ బారిన పడిన పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ స్వభావం వల్ల తమ తోటి పిల్లల కన్నా చాలా విషయాల్లో వీళ్లు వెనకబడిపోతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో ఏ విషయాన్నయినా స్వేచ్ఛగా మాట్లాడాలి. పెరుగుతున్న కొద్దీ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగేలాంటి ఆలోచనా శక్తి, స్వేచ్ఛ వారికి పంచాలి. అంతేకాదు పేరెంటింగ్ విషయంలో తాము చేస్తున్న తప్పొప్పుల గురించి అవగాహనతో మెలుగుతూ తమ పిల్లలతో సరైన విధంగా తల్లిదండ్రులు ప్రవర్తించాలి. తాము తీసుకునే నిర్ణయాల వల్ల తలెత్తే పరిణామాలకు సైతం పిల్లలు సంసిద్ధంగా ఉండేలా మానసికంగా వారిని బలంగా ఉండేట్టు తీర్చిదిద్దాలి. ఫిజికల్ ఇమ్యూనిటీ లాగే మెంటల్ ఇమ్యూనిటీ కూడా పెద్దవాళ్లయ్యే కొద్దీ అత్యంత సహజంగా పిల్లలకు అలవడుతుందని తల్లిదండ్రులు గ్రహించాలి. తప్పులు చేస్తారేమోనని పిల్లల్ని అనుక్షణం తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండడం అసాధ్యం. పోలీసింగ్ చేయడం సరికాదు.
పిల్లలను అన్ని విధాలుగా సెల్ఫ్ మేడ్ గా తల్లిదండ్రులు తయారుచేయాలి. పెరిగే కొద్దీ వారికి ఇంటి పనులు నేర్పిస్తూ తమ పనులు తాము చేసుకునేలా వారిని మలచాలి. ఇలా అన్ని నేర్పించడం వల్ల జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయని, కష్టాలు ఎదురవుతాయని వయసు పెరగడంతోపాటు చిన్నారులకు అర్థమవడమే కాదు జీవితాన్ని ఎలా అందంగా మలచుకోవాలో ఆ నైపుణ్యాన్ని కూడా వాళ్లు అలవరచుకోగలుగుతారు. తిట్టడం, కొట్టడం , తప్పుపట్టడం వంటి వాటితో పిల్లలను నియంత్రణలో ఉంచగలమని, క్రమశిక్షణతో పెంచగలమని తల్లిదండ్రులు అనుకుంటే పొరబాటే. వారు చేసే పనులకు వాళ్లే బాధ్యత వహించే మెచ్యూరిటీని చిన్నతనం నుంచీ పిల్లల్లో పెంపొందించాలి.
పర్ఫెక్టుగా ఉండాలని పిల్లలు అనుకోనక్కర్లేదు. తల్లిదండ్రులూ అనుకోనక్కర్లేదు. పొరబాట్లు చేస్తేనే తప్పులేమిటో తెలిసి సరిగా అడుగులు వేస్తారనే ఆత్మస్థైర్యాన్ని పిల్లలకు పేరెంట్సే ఇవ్వాలి. ఏ మనిషీ పర్ఫెక్ట్ కాడని చెప్పాలి. పిల్లల ఆలోచనలతో ప్రయాణిస్తూ… వారితో కలిసి మెలిసి ఉంటూ తాము వారికి ఎంతో దగ్గరవారమనే నమ్మకం, తమతో ఏ విషయాన్నైనా చర్చించవచ్చనే స్వేచ్ఛా భావం వారిలో కలిగించాలి. పిల్లలకు ఎప్పుడూ ఏది మంచో దాన్ని సరైన రీతిలో తెలియజేయగలగడమే సరైన పేరెంటింగ్ అని తల్లిదండ్రులు గ్రహించాలి…