పేరెంటింగ్ పలు సవాళ్లతో కూడినది. ఇందుకు ఎంతో ఓర్పు కావాలి. పిల్లల పట్ల కోపం బదులు వాత్సల్యం పాలి. వారి తీరుతెన్నులను గమనిస్తూ వారిని మార్చడంలో ఎంతో సహనాన్ని ప్రదర్శించాలి. సహజంగా పిల్లల క్రమశిక్షణ విషయంలో చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇందువల్ల పిల్లల ప్రవర్తనా పరంగా పేరెంట్స్ కు పలు సమస్యలు ఎదురవుతాయి. ఇందుకు బాధ్యులు తల్లిదండ్రులే. క్రమశిక్షణ వల్ల పిల్లల్లో భావోద్వేగపరమైన మెచ్యూరిటీ వస్తుందని బిహేవియరల్ నిపుణులు చెప్తుంటారు . చిన్నపిల్లలు ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహిస్తారు. అంతేకాదు వారు ఏది నేర్చుకున్నా అందులో తల్లిదండ్రులను అనుకరిస్తుంటారు. తల్లిదండ్రులను అనుసరించడం, వారిలా ప్రవర్తించాలని ప్రయత్నించడం చాలామంది చిన్నారుల్లో మనం చూస్తాం. పిల్లల్లో ప్రవర్తనా పరంగా కనిపించే కొన్ని మంచి లక్షణాలు కావని కూడా చిన్నారుల బిహేవియరల్ నిపుణులు చెప్తున్నారు. వాటిల్లో ఒకటి కొందరు పిల్లలు తరచూ ఏడుస్తుంటారు. దీనికి కారణం తల్లిదండ్రుల అటెన్షన్ ఆ చిన్నారుల మీద లేకపోవడమే. పిల్లల ఈ తరహా ధోరణి చాలామంది పెద్దవాళ్లల్లో విసుగును రేకెత్తిస్తుంటుంది. పిల్లలు అలా ప్రవర్తించడానికి కారణం వాళ్లు తల్లిదండ్రుల నుంచి తరచూ ఎమోషనల్ సపోర్టును ఎక్కువ ఆశిస్తుండడమే.
అందుకే సమయం చిక్కినపుడల్లా పిల్లలను ప్రేమతో గట్టిగా హత్తుకునే అలవాటును తల్లిదండ్రులు చేస్తుండాలి. ఇది పిల్లల్లో తెచ్చే మార్పు ఎంతో. తల్లిదండ్రులు అనుసరించే ఇలాంటి చర్యల వల్ల పిల్లల్లో అభద్రతా భావం పోతుంది. ఇంకొందరు పిల్లలు తరచూ అబద్ధాలు ఆడుతుంటారు. పిల్లలు చేసిన కొన్ని తప్పుల పట్ల తల్లిదండ్రులు అతిగా కోపగించుకోవడం వల్ల కూడా పిల్లల్లో అబద్ధాలు చెప్పే స్వభావం పెరుగుతుంది. చిన్నపిల్లల మనసులు చాలా సున్నితమైనవి. పెద్దవాళ్లు, ముఖ్యంగా తల్లిదండ్రులు గట్టిగా అరవడం, తిట్టడం చేస్తే వారికి నచ్చదు. తల్లిదండ్రుల ఆ రకమైన ప్రవర్తనను పిల్లలు అస్సలు ఇష్టపడరు. పిల్లలతో పెద్దవాళ్లు సన్నిహితంగా మాట్లాడుతుండాలి. పిల్లలు పొరబాట్లు చేస్తే తిట్టకుండా అవి సహజమేనని చెపుతూ ఆ పొరబాట్లు మళ్లా తమ చిన్నారులు చేయకుండా వారికి తల్లిదండ్రులు సున్నితంగా తెలియజెప్పాలి.
చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం లోపించినా, ఆత్మనూన్యతా స్వభావం కనిపించినా అందుకు కారణం కూడా పేరెంట్సే. పిల్లలకు సలహా ఇచ్చేటప్పుడు వారితో అమ్మానాన్నలు సరైన విధానంలో ప్రవర్తించకపోవడం మరో ముఖ్యకారణం. చిన్నతనంలో ప్రతి దాని విషయంలో తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహాన్ని చిన్నారులు ఆశిస్తారు. అలాంటి తోడ్పాటు, సహకారం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అందకపోతే చిన్నారులు తీవ్ర నిరాశకు గురవుతారు. పిల్లలు క్రమశిక్షణతో ప్రవర్తించలేదని చాలామంది తల్లిదండ్రులు నలుగురి ముందూ పిల్లల్ని మందలిస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎవరూ లేనపుడు, తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే ఉన్న సమయంలో చిన్నారుల మనసుకు అర్థమయ్యేలా మంచి చెడ్డలను చెప్పాలి. వారు చేసిన తప్పులు గాని, పొరబాట్లు గాని వారికి సున్నితంగా, స్నేహంగా చెప్పాలి తప్ప వారిపై కోపపడ్డం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.
షాపింగ్ వంటివాటికి చిన్నారులను పేరెంట్స్ తమతోపాటు తీసుకెళ్లాలి. వారి అభిరుచులు, అవసరాలు, వారు ఏమి కావాలని కోరుకుంటారో అవీ తల్లిదండ్రులు చిన్నతనం నుంచీ తెలుసుకుంటుండాలి. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులు తమ అభిప్రాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్న భావం చిన్నారుల మనసుల్లో నాటుకుంటుంది. పైగా ఇలా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు గడపడం చిన్నారులకు మంచి ఫన్ గా కూడా ఉంటుంది. అలా పిల్లలకు పేరెంట్స్ ఎంతో ఆనందాన్ని పంచినవారవుతారు. అలాగే పిల్లలు ప్రతి చిన్నదానికీ భయపడుతుంటే తల్లిదండ్రలు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అందుకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భయాలు గమనించి అవి లేకుండా వారిలో సురక్షిత భావనను పెంపొందించాలి. అలాగే కొన్నిసార్లు వారికి వారే తమ సమస్యలను అధిగమించే ఆత్మవిశ్వాసాన్ని కూడా తల్లిదండ్రులు పిల్లల్లో స్రుజనాత్మకంగా పెంపొందించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది.
అలాగే తమ పిల్లల తెలివితేటల్ని చాలామంది తల్లిదండ్రులు ఇతర పిల్లలతో వారి ఎదురుగుండా తరచూ పోల్చుతుంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఆ అలవాటును తల్లిదండ్రులు పూర్తిగా వదులుకోవాలి. పిల్లలు బాగా అల్లరిచేయడం, కోపంగా ప్రవర్తించడం వంటివి చేస్తే వాళ్లు అటెన్షన్ సీకర్స్ అని గుర్తించాలి. వారు చేసే పని తల్లిదండ్రులు మెచ్చుకోకపోయినా, గుర్తించకపోయినా కూడా ఈ తరహా ప్రవర్తనా ధోరణి పిల్లల్లో బాగా పెరుగుతుంది. ఫలితంగా పిల్లల్లో సరైన ప్రవర్తనా తీరు లోపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పిల్లల మనోభావాలను, ఇష్టాలను తల్లిదండ్రులు గుర్తించకపోవడమే. ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు స్నేహితులుగా మెలగాలి. అలా ఉంటే పిల్లల్లో ప్రవర్తనా పరమైన లోపాలు తలెత్తవు. కొంతమంది పిల్లలు తమ స్నేహితుల ఫీలింగ్స్ ను అస్సలే పట్టించుకోకపోవడం చూస్తాం. వారిలోని ఈ ధోరణికి కారణం కూడా తల్లిదండ్రులే. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పట్ల అలా ప్రవర్తించడం చూసి చిన్నారులు అదే ధోరణిని తమ తోటి పిల్లల పట్ల కూడా ప్రదర్శిస్తుంటారు. అందుకే పిల్లలను ఆదేశాలతో, ఆగ్రహంతో, బెదిరింపులతో నియంత్రణలో ఉంచుకోవాలని అనుకోకుండా సున్నితంగా వారితో మాట్లాడాలి. వారితో ఎక్కువ సమయం గడపాలి.
ఇలా చేస్తే చిన్నారుల్లో ఎంతో మంచి మార్పును చూడొచ్చు. పిల్లల పెంపకంలో పెద్దవాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం.ఇవన్నీ గమనించుకుంటూ పిల్లలని ఓర్పుగా పెంచడం, వారితో ఎక్కువ సమయం గడపడం చేస్తే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య బలీయమైన బంధం ఏర్పడుతుంది. అది చిన్నారులను మంచి వ్యక్తిత్వం కలవారిగా నిలబెడుతుంది కూడా.