Sunday, October 6, 2024
Homeఫీచర్స్శాంతి సందేశాల ఎ‘జెండా’ ఆమెది

శాంతి సందేశాల ఎ‘జెండా’ ఆమెది

ఆమె చేతిలో ఎగిరే శ్వేత వస్త్రం శాంతి సందేశాల మాలిక…. శాంతి స్థాపనే ఆమె అక్షరమాల… అదే ఆమె జెండాలలో కనిపించే నిశ్శబ్ద ప్రార్థన. ఆమె ప్రోగుచేసే కవితల నాదమూ శాంతే. లౌకికవాదాన్ని, శాంతిని పంచే ఏ మాటైనా సరే, పలుకైనా సరే, పాటయినా సరే ఆమె చేతిలో జెండా అయి ఎగురుతుంది. ఆమె చేతివ్రాతతో రూపుదిద్దకున్న అవి ఆమె శాంతి ఎజెండాను చెప్తాయి.

- Advertisement -

ఆమే కలకత్తాకు చెందిన పొయట్ – ఆర్టిస్టు సుఫియా ఖాతూన్. ఆమె వినూత్న కళా ప్రకటనే ఈ శాంతి ఎ‘జెండా’. సుఫియా ఖాతూను కవయిత్రి. మంచి కళాకారిణి. తన చుట్టూ నిత్యం జరుగుతున్న రకరకాల హింస, హత్యలు, యాసిడ్ దాడులు, అత్యాచారాలు, నిరసనలు, విద్వేష దాడులు చూసి ఆమె మనసు కమిలిపోయింది. మానవులంతా ఒకటేనంటారామె. మానవీయత, ప్రేమ భావనలను అందరికీ పంచాలనుకుందామె. ప్రజలందరూ ఒక్కటేనన్న భావన తన చుట్టూ ఉన్న జనాలకు తెలియజెప్పాలనుకుంది సుఫియా. శాంతి ఒక్కటే సర్వమానవాళికి ఆనందకరమైన జీవన మంత్రం కావాలనుకుంది. అందుకు శాంతిని కోరే ప్రెయర్ జెండాలను ప్రదర్శిస్తూ వినూత్నంగా కళా ప్రదర్శన చేపట్టింది.

శాంతిపై రాసిన కవితలను చిన్న చిన్న తెల్లని జెండాలపై తన దస్తూరితో రాసి పలుచోట్ల ప్రదర్శిస్తూ జనాలకు శాంతి ఆవశ్యతను తెలియజెయ్యడానికి ఆమె పూనుకుంది. హింస వద్దు శాంతి ముద్దు. ప్రేమ అద్భుతం. శత్రుత్వం నరకం వంటి పలుకులతో సమాజానికి శాంతిలోని సాంత్వనను తెలియజెప్పాలని సుఫియా భావించింది. శ్వేత వస్త్రంపై తన స్వహస్తాలతో రాసిన 500 శాంతి కవితల జెండాలను పలు చోట్ల ప్రదర్శిస్తోంది. ఇటీవల కళా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ లో భాగంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ విశాలమైన లాన్స్ లో శాంతి సందేశాల జెండాలను కళాత్మకమైన రీతిలో సుఫియా ప్రదర్శించారు.

శాంతి పై ఎందరో కవులు, కళాకారులు, విద్యార్థులు, దేశ విదేశాలకు చెందిన వారు రాసిన కవితలు అందులో ప్రదర్శించారు. ఆ కవితల్లో దాగున్న ప్రేమ, మానవత్వాల గుబాళింపులు, సాంత్వన అక్కడకు వచ్చిన వీక్షకుల గుండెలను తాకడం విశేషం. ఈ కవితల్లో ముంబయికు చెందిన అంజు మఖీజా, యామిని దాండ్ షా, ముస్తాన్సిర్ దాల్వి, పర్విన్ సాకేత్ వంటి వారివి కూడా ఉన్నాయి. విద్యార్థులు, రచయితలు, నవతరం కవులు శాంతి కవితలను తనకు రాసి పంపిచవచ్చని కూడా సుఫియా అంటున్నారు.

టెహ్రాన్, ఫ్లోరిడా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి కూడా శాంతిపై కవితలు రాసి తనకు పంపారని సుఫియా చెప్పారు. శాంతినే ఎ‘జెండా’గా పెట్టుకుని వాటి సేకరణలో ప్రముఖులవాటికే కాదు సాధారణ వ్యక్తుల కవితలకు కూడా సుఫియా పెద్ద పీట వేశారు. శాంతి స్థాపనా దిశగా ఎందరినో చైతన్యపరచాలన్న ఆశే తన ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఆలోచన అంటారు ఆమె. అందరినీ కలిపే సెక్యులర్ ద్రుష్టిని, వసుధైక కుటుంబ భావనను పెంపొందించడమే తన ఉద్దేశమంటారు సుఫియా. తన శాంతి కవితల సేకరణపై మాట్లాడుతూ ‘కవిత్వం నాకు ప్రార్థన లాంటిద‘ని అంటారామె. అందులోంచే తన శాంతి కవితా ఎం‘జెండా’ పుట్టుకొచ్చిందని చెప్పారు.

2019లో తన శాంతి కవితల జెండాల ప్రదర్శనను వినూత్నంగా సుఫియా నిర్వహించారు. శాంతి సందేశాన్ని పంచే ఇలాంటి జెండాలను భవిష్యత్తులో మిలియన్ల సంఖ్యలో ప్రదర్శించాలన్నదే తన కోరిక అని సుఫియా చెప్పారు. ఈ శాంతి జెండాలు సమాజంలో శాంతి, సౌభ్రాత్రుత్వం, సమభావం, లౌకికవాదాలను మానవ నిత్య జీవనంలో ఇముడ్చుకునేలా చేస్తాయని తాను గట్టిగా నమ్ముతున్నానని అంటారామె. అంతేకాదు ఇవి మానవులందరూ కలిసి జీవించేలా స్ఫూర్తినిస్తాయంటారు. ప్రజలు పరస్పరం తమ మతాలను, భావాలను, ఉద్వేగాలను గౌరవించేలా ఈ జెండాలు ప్రజలను ప్రేరేపిస్తాయని సుఫియా గట్టిగా నమ్ముతారు. అంతేకాదు సమాజంలో శాంతి వ్యాప్తిచెందడం వలన స్త్రీలు సురక్షితంగా ఉండగలుగుతారు. శక్తివంతులవుతారు. తమదంటూ స్పేస్ ను ఆడవాళ్లు స్రుష్టించుకోగలుగుతారు. అలాగే పురుషులు తమ భావాలను, బాధలను స్వేచ్ఛగా ప్రకటించుకోగలుగుతారు అని అంటారు సుఫియా.

సుఫియాకు శాంతి కవితలు రాసి పంపించాలనుకున్న వారు ఈ మెయిల్ ఐడికి పంపవచ్చు. [email protected]

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News