ఇక్కడ కనిపిస్తున్న ఆమె పేరు రోష్నీ నడార్. భారతదేశంలోని దిగ్గజ ఐటి కంపెనీ పగ్గాలను చేపట్టిన తొలి మహిళ. దేశంలో మూడవ అతిపెద్ద ఐటి కంపెనీ ‘హెచ్ సిఎల్ టెక్నాలజీస్ కంపెనీ’ స్థాపకులు శివ్ నాడర్ ఏకైక కుమార్తె. హెచ్ సి ఎల్ ఛైర్ పర్సన్. అంతేకాదు రెండుసార్లు దేశంలో అత్యంత సంపన్న మహిళగా రికార్డుల కెక్కిన టెక్ పారిశ్రామికవేత్త.
రోష్ని నడార్ ఢిల్లీలో పుట్టిపెరిగారు. ఇలినాయస్ లోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేశారు. గ్రాడ్యుయేషన్ లో భాగంగా రేడియో, టివి, ఫిలిమ్స్ పై ప్రత్యేక ద్రుష్టిసారించారు. అమెరికాలో కొంతకాలంపాటు న్యూస్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. తర్వాత కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుంచి ఎంబిఎలో మాస్టర్స్ పట్టా తీసుకున్నారు.శివ్ నాడర్ ఫౌండేషన్ ట్రస్టీగా కూడా రోష్నీ వ్యవహరిస్తున్నారు. ఈ ఫౌండేషన్ కింద పలు స్కూళ్లు, కళాశాలలను స్థాపించి విద్యాసేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన మహిళలలో ఒకరిగా రోష్నీ 2020 సంవత్సరంలో
గుర్తింపుపొందారు.
రోష్నీ శిక్షణ పొందిన శాస్త్రీయ సంగీత కళాకారిణి కూడా కావడం విశేషం. అంతేకాదు వన్యమ్రుగప్రాణుల సంరక్షకురాలిగా కూడా రోష్నీ నడార్ కు మంచి పేరుంది. ‘ఆన్ ది బ్రింక్’ అనే టివి సీరీస్ ప్రొడ్యూసర్ గా ఆమె వ్యవహరించారు. అంతేకాదు 2022 లో గబ్బిలాల మీద ఆమె నిర్మించిన ఎపిసోడ్ కు అత్యుత్తమ భారత జాతీయ చిత్రంగా అవార్డు వచ్చింది. ‘హల్కా’ అనే బాలల చిత్రం కూడా రోష్నీతీశారు.
ది హాబిటాట్స్ ట్రస్టు ను ఏర్పాటుచేసి దాని ద్వారా దేశంలోని వివిధ రకాల జీవరాసుల, జాతుల సంరక్షణకు క్రుషిచేస్తున్నారు. యోగా, ట్రావలింగ్ అంటే రోష్నీకి ఎంతో ఇష్టం. సమయం దొరికితే వైల్డ్ లైఫ్ శాంక్చురీలకు, అలాగే చారిత్రకప్రాధాన్యం ఉన్న ప్రదేశాలకు రోష్ని వెడుతుంటారు. భారతదేశం ఐటి హబ్ గా అంతర్జాతీయంగా ఖ్యాతి నార్జించడంలో రోష్నీ నాయకత్వంలో నడుస్తున్న హెచ్ సిఎల్ టెక్ కీలకమైందని చెప్పాలి.
దేశంలో ఎంతో పేరున్న ఐటి కంపెనీకి సారథ్యం వహించి దాన్ని విజయాల బాటలో నడిపించిన బిజినెస్ మహిళగా రోష్నీ ఎంతో పేరు తెచ్చుకున్నారు. హెచ్ సిఎల్ సారధిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు ఇలినాయస్ లోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో చేస్తున్న కమ్యూనికేషన్ కోర్సులో భాగంగా సిఎన్ ఎన్ అమెరికా, స్కై న్యూస్ యుకెల్లో ఫంక్షనింగ్ అండ్ ప్రోగ్రామర్ గా పనిచేశారు. తన బిజీ షెడ్యూల్స్ నుంచి ఖాళీ సమయం దొరికనపుడు ప్రక్రుతి అందాల మధ్య సేద దీరడం అంటే రోష్నీకి ఎంతో ఇష్టం. వన్య మ్రుగాలంటే ఆమెకు ప్రాణం. తను స్థాపించిన హాబిటాట్స్ ట్రస్టు ద్వారా ప్రక్రుతిలోని వివిధ జీవరాశిని కాపాడేందుకు పనిచేస్తున్న పలు రోష్నీ సహాయం అందిస్తుంటారు.
శివ్ నాడర్ ఫౌడేషన్ ద్వారా విద్యారంగంలోనూ ఆమె విశేష క్రుషిచేస్తున్నారు. 2022 సంవత్సరంలో భారతదేశలో సంపన్న మహిళగా రోష్నీ నడార్ పేరు రెండవ పర్యాయం చోటుచేసుకుంది. బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా కూడా రోష్నీ నడార్ కు పేరుంది. బాల్యం నుంచీ చదువు, ఇతర యాక్టివిటీల్లో ఎంతో చురుకైన అమ్మాయిగా పేరు తెచ్చుకున్నారు. 27 సంవత్సరాల వయసులో హెచ్ సిఎల్ టెక్నాలజీస్ సిఇవొగా బాధ్యతలు చేపట్టారు. నిర్ణయాలు తీసుకోవడంలో, తన విజన్ అమలు చేయడంలోనూ రోష్నీ నడార్ ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారని పేరు తెచ్చుకున్నారు. షికర్ మల్హోత్రాను ప్రేమ వివాహం చేసుకున్నారు. షికర్ ఆటోమొబైల్ జెయింట్ గా పేరొందిన హోండా కంపెనీలో పనిచేసేవారు.
ఏడుసంవత్సరాల వారి పరిచయం, డేటింగ్ ల తర్వాత 2019లో షికర్ ని వివాహం చేసుకోవాలని రోష్నీ నిర్ణయించుకున్నారు. ఇరువైపు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత షికర్ హెచ్ సిఎల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన హెచ్ సిఎల్ వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ప్రపంచంలోనే సంపన్న మహిళగా పేరొందిన రోష్నీ మానవులతో పాటు వన్యమ్రుగాలకు కూడా ఈ ప్రపంచం సురక్షితమైన నెలవుగా ఉండాలని కోరుకున్నారు. విద్యాజ్ఘాన్ సంస్థ ద్వారా పేదపిల్లలకు విద్యావకాశాలు కల్పించడం వంటి పలు సేవాకార్యక్రమాలతో సమాజానికి తన వంతు సేవలను అదిస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికరంగంలో రోష్నీ అందించిన విశేష సేవలకు గాను ఎన్నో అవార్డులు సైతం రోష్నీని వరించాయి.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ ఇనిషియేటివ్ లో రోష్నీ అలుమినస్. ఒక మహిళా పారిశ్రామిక వేత్తగా మానవాళికి, వన్యమ్రుగాల పరిరక్షణకు, ప్రక్రుతి, వాతావరణ పరిరక్షణకు, సమతుల్యతకు, సురక్షితమైన జీవావరణ తోడ్పాటుకు రోష్నీ తన వంతుగా అందిస్తున్న సేవలు దేశంలోని మరెందరో మహిళలకు, ఔత్సాహికపారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.