Sunday, September 8, 2024
Homeఫీచర్స్Salute: తొలి మహిళా అండర్ గ్రౌండ్ మైన్ మేనేజర్ మన సంధ్య

Salute: తొలి మహిళా అండర్ గ్రౌండ్ మైన్ మేనేజర్ మన సంధ్య

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు సంధ్య రసకట్ల. తెలంగాణాకు చెందిన సంధ్య దేశం మొత్తంలో తొలి మహిళా అండర్ గ్రౌండ్ మైన్ మేనేజర్ గా చరిత్ర స్రుష్టించారు. రాజస్తాన్ లోని జవర్మలా గనిలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. సంధ్య తండ్రి సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేశారు. ఈ రంగం వైపు అడుగులు వేసేలా తనకు స్ఫూర్తినిచ్చింది తండ్రేనంటారు సంధ్య. ఆ విశేషాలు ఆమె మాటల్లో…

- Advertisement -

‘‘ గనుల్లో పనిచేయడం ఒక అద్భుతమైన, సాహసోపేతమైన అనుభవం. మనదేశంలో ఆ విధులను నిర్వహిస్తున్న తొలి మహిళను నేను కావడం నాకు మరింత గర్వాన్ని, ఆనందాన్ని ఇస్తోంది. మా నాన్న బొగ్గు గనుల్లో మైన్ ఇంజనీర్ గా పనిచేశారు. అదే నాకు ఈ రంగంలో ప్రవేశించడానికి స్ఫూర్తి అయింది. పురుషులతో సమానంగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు పోవడం ఒక మహిళగా నాకెంతో సంత్రుప్తిని ఇస్తోంది. అయితే గనుల్లో పనిచేయడమనేది ఆషామాషీ విషయం కాదు. అలాగే పురుషాధిపత్యం అనేది కేవలం గనుల పరిశ్రమలోనే లేదు. అన్ని రంగాలలోనూ చూస్తున్నాం. అయితే ప్రధానంగా పురుషాధిపత్యం అధికంగా ఉన్న రంగం ఇది. ఇందులో తలెత్తే రకరకాల సవాళ్లను ఎదుర్కొంటూ మేటి ఉద్యోగిగా బాధ్యతలను నిర్వహించడం, పేరు తెచ్చుకోవడం అనేది పెను సవాలుతో కూడిన విషయం అనేది కఠిన వాస్తవం.

మొదట్లో గనుల విధి నిర్వహణలో స్త్రీలను గుర్తించడంలో ఇబ్బంది కనిపించినా ఈ రంగంలోకి వస్తున్న కొత్త వారు మహిళలను కూడా తమతో సమానంగా భావించడం కనిపిస్తోంది. ఇది సంతోషకర పరిణామం. నేను 2018లో హిందుస్తాన్ జింక్ కంపెనీలో చేరాను. అప్పట్లో గనులకు సంబంధించిన సాంకేతిక బ్రుందంలో, అండర్ గ్రౌండ్ గనుల్లో ఉద్యోగ అవకాశాలు స్త్రీలకు చాలా తక్కువగా ఉండేవి. 2019లో ఎప్పుడైతే డైరక్టరేట్ ఆఫ్ మైన్స్ సేఫ్టీఅండర్ గ్రౌండ్ లో విధుల నిర్వహణకు స్త్రీలను కూడా అనుమతించిందో అప్పుడు నా దశ తిరిగింది. అలా నేను మైనింగ్ మేనేజర్ గా ఈ రంగంలోకి దూకాను. అప్పటికి నా వయసు పాతిక సంవత్సరాలు.

అలా నేను దేశంలోనే తొలి మహిళా మైన్ మేనేజర్ గా రికార్డు స్రుష్టించాను. ప్రస్తుతం రాజస్తాన్ లోని జవర్మాలా గనుల్లో విధులు నిర్వహిస్తున్నాను. ఈ రంగంలోకి ప్రవేశించడానికి మా నాన్నే నాకు స్ఫూర్తి. నాన్న సింగరేణి బొగ్గు గనుల్లో మైన్ ఇంజనీర్ గా పనిచేసేవారు. అండర్ గ్రౌండ్ గనుల ప్రపంచం నన్ను ఎప్పుడూ ఎంతో ఆకర్షిస్తుండేది. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ రంగంలో సమాన అవకాశాలు దక్కించుకోవడం నాలో ఎంతో సంతోషాన్ని నింపుతోంది. ఇది ప్రధానంగా పురుషాధిపత్యం బాగా ఉన్న రంగం. ఇందులో విధులు నిర్వహించడం చాలా సవాలుతో కూడిన విషయం కూడా. నా అనుభవం నుంచి నేను తెలుసుకున్న సత్యం ఏమిటంటే అవకాశాలు ఇవ్వాలే గానీ ఏ రంగంలోనైనా పురుషులతో సమానంగా మహిళలు ఇమిడిపోతారు. ఎంత క్లిష్టమైన విధులనైనా ఎంతో నైపుణ్యంతో నిర్వహిస్తారు. యాజమాన్యాలకు స్త్రీల శక్తిసామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసం ఏర్పడినపుడు ఎవ్వరూ కూడా మహిళల అవకాశాలను దెబ్బతీయలేరు. అది జయిస్తే స్త్రీలకు ఏరంగంలోనూ అడ్డే లేదు. అది ప్రపంచగతినే మారుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.

ఇంతవరకూ ఏ మహిళలా మనదేశంలో అండర్ గ్రౌండ్ మైన్స్ మేనేజర్ గా పనిచేయలేదు. అలా అండర్ గ్రౌండ్ మైన్ మేనేజర్ గా పనిచేసే అవకాశం నాకు లభించిన విషయం తెలియగానే మొదట నేను నమ్మలేకపోయాను. షాక్ అయ్యాను . ఆ తర్వాత ఇలాంటి అద్భుత అవకాశం పొందిన తొలి మహిళను నేనని తెలిసి ఎంతో గర్వపడ్డాను కూడా. ఈ అపురూప అవకాశం నేను అందుకోగలిగానంటే నా కుటుంబం నాకందించిన గొప్ప మద్దతే కారణం. ఈ క్రెడిట్ వాళ్లకే చెందుతుంది. ఇంటర్ పూర్తిచేసిన తర్వాత కంప్యూటర్ సైన్స్ కోర్సు చేయాలనుకున్నాను. అయితే మా మామయ్య మైనింగ్ ఇంజనీరింగ్ చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని నాకు సూచించారు. గనుల్లో మగవాళ్లు పనిచేస్తారు. అది ఆడవాళ్లు చేయగలిగే పని కాదని అని నన్ను నిరుత్సాహ పరుస్తూ ఎంతోమంది అన్నారు. కానీ నేనీ ఆలోచనను ఒక సవాలుగా తీసుకున్నా. మైనింగ్ ఇంజనీరింగ్ చేయడానికి కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ లో చేరాను. ఈ కోర్సు రెండవ బ్యాచు విద్యార్థులం మేము.

మా బ్యాచులో చాలాకొద్ది మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. వారిలో కొందరు కోర్సు రెండవ సంవత్సరంలో మైనింగ్ ఇంజనీరింగ్ వదిలి మరొక ఫ్యాకల్టీలో చేరిపోయారు. కానీ నా ఆలోచన మాత్రం మారలేదు. మైనింగ్ ఇంజనీర్ గా పట్టా పొందాలని నేను నిశ్చయించుకున్నా. అందుకు ఎంతో కష్టపడ్డాను. క్యాంపస్ ప్లేస్ మెంట్ ద్వారా 2018 లో హిందుస్తాన్ జింకులో చేరా. అప్పట్లో అండర్ గ్రౌండ్ వర్కు చేబట్టే అవకాశాలు స్త్రీలకు లేవు.

2019లో పరిస్థితి మారింది. స్త్రీలకు కూడా అండర్ గ్రౌండ్ గనుల్లో పనిచేసే అవకాశం లభించింది. దీంతో తరచూ నేను అండర్ గ్రౌండ్ మైన్ కు వెడుతుండేదాన్ని. అక్కడ జరిగే ప్రొడక్షన్, యుటిలిటీ పనులను గమనించేదాన్ని.అలా వాటిల్లో మంచి అనుభవం సంపాదించా. చదువుకునేటప్పుడు మాత్రమే కాదు మా నాన్న సింగరేణి గనుల్లో మైనింగ్ ఇంజనీర్ కాబట్టి తరచూ నేను కూడా ఆయనతో పాటు గనుల్లోపలికి వెడుతుండేదానిని. అలా నాకు, గనులకు మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అండర్ గ్రౌండ్ మైన్ మేనేజర్ గా గనుల్లో విధులను పర్యవేక్షించాలి. రకరకాల షిఫ్టుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. గనుల కార్మికులతో, ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడంతో పాటు ఉద్యోగానికి సంబంధించి సరికొత్త సాంకేతిక పరిజ్ఝానాన్ని ఎప్పటికప్పుడు అభివ్రుద్ధి పరచుకుంటుండాలి.

గనుల్లో పనిచేయడం అనేది ప్రతి రోజూ కొత్త అనుభవాగన్ని ఇస్తుంది. గనుల్లో యంత్రాలతో పనులు సాగుతాయి. ప్రొడక్షన్, డ్రిల్లింగ్ పనిముట్లు కూడా ఎంతో ఆధునిక పరిజ్ఝానంతో కూడినవై ఉంటాయి. గనుల్లో విధులు నిర్వహించడం శారీరకంగా, మానసికంగా ఎంతో క్లిష్టమైనది కూడా. విధుల నిర్వహణా సామర్థ్యంలో చురుగ్గా ముందుంటూ అప్పగించిన టాస్కుల నిర్వహణలో ఎప్పుడూ బెస్ట్ గా నిలవాలి.

ఎందులోనైనా సరే స్టీరియోటైప్ విధానాలను బ్రేక్ చేయడమనేది చాలా కష్టంతో కూడిన పని కానీ అది అసాధ్యమైనదేమీ కాదు. మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ యువతులకు అన్ కన్వెషనల్ రోల్స్ చేపట్టి తమలో దాగున్న సామర్థ్యాన్ని నిరూపించుకోమంటాను. చేపట్టిన ఏ ఉద్యోగాన్నైనా సవాలుగా తీసుకుని విజేతలుగా నిలబడమని చెప్తాను. మైనింగ్ కంపెనీకి తొలి మహిళా సిఇవొగా రికార్డు స్రుష్టించాలన్నదే నా కోరిక. యుపిఎస్ సి పరీక్షల్లో కూడా విజయం సాధించడానికి క్రుషిచేస్తున్నా‘ అని సంధ్య చెప్పుకొచ్చారు.

అండర్ గ్రౌండ్ మైనింగ్ ఇంజనీర్స్ గా సంధ్య, యోగీశ్వరీలు జాతీయస్థాయిలో స్రుష్టించిన చరిత్ర ముందు ముందు మరెంతోమంది యువతులకు స్ఫూర్తిగా నిలబడగలదని ఆశిద్దాం. మైనింగ్ రంగంలో సైతం స్త్రీలు విజయకేతనం ఎగురవేసే రోజులు మరెంతో దూరంలో లేవు.

ఆమె దారి గనుల దారి

మైనింగులో సంధ్యతో పాటు మేనేజర్ విధులు నిర్వహిస్తూ తన సత్తా చాటుకుంటున్నారు. యోగీశ్వరి రాణె. కాయడ్ మైన్ లో ప్లానింగ్ అండ్ డెవలెప్ మెంట్ విభాగానికి హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గోవాలో పెరిగిన యోగీశ్వరి నివాసం ఉంటున్న ప్రాంతం మొత్తం గనులుండే ప్రదేశం. గనుల్లో లభించే ఖనిజాలు, రకరకాల అమూల్య ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఆమెలో చిన్నతనం నుంచీ బాగా ఉండేది. 12వ తరగతి పూర్తిచేసి గోవాలో కొత్తగా ప్రారంభించిన గోవా ఇంజనీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ లో యోగీశ్వరి చేరారు. కొత్తది, ఛాలెంజితో కూడిన పనులు చేయాలంటే యోగిశ్వరికి చాలా ఇష్టం. ఆ ఉత్సుకతే గనుల రంగంలోకి ఆమెను కాలుమోపేలా చేసింది.

‘మొదట్లో సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేద్దామనుకున్నా. కానీ ఎప్పుడైతే మైనింగ్ ఇంజనీరింగ్ ప్రవేశపెడుతున్నారని తెలిసిందో అదే నా ఆప్షన్ అని గట్టిగా నిర్ణయించేసుకున్నా’ అని యోగీశ్వరి అన్నారు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులతో, బంధువులతో, ఉఫాధ్యాయులతో చర్చించినపుడు వారందరూ ‘ఇది ఆడవాళ్లు చేయగలిగే పని కాద’ని అన్నారు. వారి మాటలు యోగీశ్వరిలో ఆ కోర్సే చేయాలన్న పట్టుదలను మరింత పెంచింది. ఆడవాళ్లంటే ఇవే చేయాలన్న స్టీరియోటైప్ భావనలను ఆమె బద్దలు కొట్టాలనుకుంది. అందుకోసం ఎలాంటి రిస్కు అయినా తీసుకోవాలని నిశ్చయించుకుంది. కోర్సు చేయడంతో పాటు తరచూ గనుల్లోకి వెడుతూ అక్కడ పనితీరును ప్రత్యక్షంగా చూసి ఆకళింపు చేసుకుంది. అంతేకాదు తన బ్యాచులో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సులో టాపర్ గా నిలిచింది కూడా. మైన్స్ గ్రాడ్యేయేట్ ట్రైనీగా గోవాలోని ఓపన్ కాస్ట్ మైన్స్ లోని ప్లానింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో, అలాగే కంట్రోల్ రూమ్ ఇంఛార్జ్ గా మూడేళ్లు పనిచేసింది. గోవాలో మైనింగ్ నిషేధించడంతో యోగీశ్వరిని హిందుస్తాన్ జింకుకు బదిలీ చేశారు. అండర్ గ్రౌండ్ గనుల్లో పనిచేసేందుకు గోవా విడిచి రాజస్తాన్ లోని రాంపూర్ అగుఛా గనుల్లో యోగీశ్వరి కొంతకాలం విధులు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడి కయాడీ గనుల్లో విధులు నిర్వహిస్తున్నారు. మైన్ యాక్ట్ లో సవరణలు జరగడంతో అండర్ గ్రౌండ్ గనుల్లో సాయంత్రం ఏడు గంటల వరకూ పనిచేయడానికి స్త్రీలకు అవకాశం లభించింది, దీంతో యోగీశ్వరి ఆ ఛాన్సును వదులుకోలేదు. వెంటనే ప్లానింగ్ నుంచి ఆపరేషన్స్ విభాగానికి బదిలీ చేయించుకుంది. ఉదయం ఆరుగంటల నుంచి షిప్టులో దిగి గనుల్లోపల విధులు నిర్వహిస్తుంది. కార్మికులకు మెషీన్లు కేటాయించడం, షిఫ్టు సమయంలో కార్మికులకు అన్నిరకాల వనరులను కల్పించడం వంటి బాధ్యతలను యోగీశ్వరి నిర్వహిస్తున్నారు.

గనుల్లో పనిచేయడానికి మానసికంగా, శారీరకంగా ద్రుఢంగా ఉండాలంటారు యోగీశ్వరి. నిత్యం గనుల్లో పని చేయడం ద్వారా పనిలో నైపుణ్యం పెరుగుతుందని, ఆ అనుభవమే నలుగురిలో బెస్టుగా స్త్రీపురుషులను నిలబెడతుందని యోగీశ్వరి బలీయంగా విశ్వసిస్తారు. తమ చుట్టూ పనిచేస్తున్న సిబ్బందికి తమపై విశ్వాసం , నమ్మకం ఏర్పడేలా మహిళలు పనితనం చూబించాలంటారు. ముఖ్యంగా కష్టమైన పనుల విషయానికి వస్తే ఎవ్వరూ తొందరగా నమ్మరని, పని ద్వారానే తమ సామర్థ్యం, శక్తిసామర్థ్యాలు ఎలాంటివో వారికి తెలిసేలా చేస్తే అన్ని రకాల ఉద్యోగావకాశాలు స్త్రీలకు లభిస్తాయని యోగీశ్వరి అంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News