ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం లోపిస్తే ఆ స్త్రీల జీవితం కష్టాల కొలిమిలా ఉంటుంది. వారిలో సొంత ఆలోచనలు లోపిస్తాయి. ఫలితంగా అందరిముందు అసహాయులుగా నిలబడతారు. ఇంటా, బయటా నిర్ణాయకశక్తులుగా వ్యవహరించలేరు. తమ మనసులోని మాటను సైతం స్వేచ్ఛగా వెల్లడించలేరు. దీనికి కారణం వారి మీద వారికి నమ్మకం లేకపోవడం ఒకటైతే, శతాబ్దాల తరబడి పురుషుల అణచివేత ధోరణి, కుటుంబవ్యవస్థ నియంత్రణ, సంస్క్రుతీసంప్రదాయాలు సైతం ఆమెని ఒంటరిగా, అసహాయిరాలిగా నిలబెడుతున్నాయి. అందుకే ఆత్మవిశ్వాసం ఉన్నవారిగా ఆడవాళ్లు తమని తాము మొదట తీర్చిదిద్దుకోవాలి. తమ శక్తిసామర్థ్యాలపై నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మవిశ్వాసం పెంచుకున్నప్పుడే స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలరని గ్రహించాలి. అంతేకాదు స్త్రీలలోని ఈ లక్షణం మరెంతో మందికి స్ఫూర్తినిస్తుంది కూడా. సమర్థవంతమైన వ్యక్తిత్వంతో శక్తివంతమైన మహిళగా నిలబడాలంటే కష్టపడాలి కూడా.
తమ వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు మెరుగుదిద్దుకుంటుండాలి. సమాజంలో తమకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవడానికి స్త్రీలు విషయ పరిజ్ఘానాన్ని బాగా పెంపొందించుకోవాలి. ఇది సమాజంలోని భిన్న వర్గాల వారికి వారిని చేరువ చేస్తుంది. ఏ విషయంలోనైనా మార్గదర్శకత్వం అవసరమైనపుడు ఇలాంటి స్త్రీల దగ్గరకు సలహా సంప్రదింపుల కోసం ఎందరో వస్తారు. అలా నలుగురిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును స్త్రీలు సంపాదించుకోగలరు. ముఖ్యంగా కెరీర్ పరంగా తమ రంగంలో ఎప్పుడూ ముందుండడం ద్వారా కూడా నలుగురిలో వీళ్లు ప్రత్యేకంగా నిలబడగలుగుతారు. తోటి ఉద్యోగులు కూడా వీరి పట్ల ఎంతో గౌరవంతో మసలుకుంటారు.
అలాగే స్త్రీలు తమని తాము ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా చాలా అవసరం. ఇది వారిలోని వ్యక్తిత్వ లోపాలను, తప్పొప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు ఈ గుణం వారిని నిండైన వ్యక్తిత్వం ఉన్న వారిగా సమాజం ముందు నిలబెడతుంది కూడా. అలాగే తమ జీవనసరళిని, వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తులతోనే స్త్రీలు స్నేహసంబంధాలను కొనసాగించాలి. తమ చుట్టూరా అలాంటి మనుషులే ఉండేట్టు చూసుకోవాలి. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా వెంటనే వారికి తగిన జవాబు స్త్రీలు ఇవ్వాలి.
అంతేకాదు ఎదుటి వ్యక్తులు తమ పరిమితులు దాటకుండా ఉండేలా హద్దుల్లో పెట్టాలి. తమను తాము గౌరవించుకునే వారినే ఎదుటివారు కూడా గౌరవిస్తారన్న విషయం స్త్రీలు మర్చిపోరాదు. తమని అవమానించే వాళ్లని, తక్కువ చూసేవాళ్లని ఎప్పుడూ దగ్గరకు రానీకూడదు. కారణం అలాంటి వాళ్ల వల్ల స్త్రీలు తమపై తాము నమ్మకాన్ని మెల్లమెల్లగా కోల్పోయే ప్రమాదం ఉంది. తమను తాము వ్యక్తిత్వం గల మనుషులుగా తీర్చిదిద్దుకోవడానికి స్త్రీలు రోల్ మోడల్స్ ను పెట్టుకోవాలి.
ఇది స్త్రీల ఆలోచనా పరిధిని విస్తరించడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని సైతం పెంచుతుంది. ఏ పనైనా చేయగలమనే ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి స్త్రీలు తప్పకుండా సమాజంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు.