Tuesday, September 17, 2024
Homeఫీచర్స్symbol of Tribal empowerment: సిద్ది తెగ మహిళల సాధికారతా స్ఫూర్తి ఆమె

symbol of Tribal empowerment: సిద్ది తెగ మహిళల సాధికారతా స్ఫూర్తి ఆమె

గుజరాత్ గిరి ఫారెస్టుకు దగ్గరలో ఉన్న జాంబూర్ గ్రామంలో సిద్ది తెగ ప్రజలు నివసిస్తుంటారు. ఆఫ్రికా మూలాలున్న తెగ ఇది. ఆ తెగకు చెందిన ఆమే హీర్ బాయ్ ఇబ్రహీ లోబి సిద్ది. తన కమ్యూనిటీ ప్రజల అభివ్రుద్ధి కోసం హీర్ బాయ్ సిద్ది చేసిన క్రుషికి గాను ఇటీవల ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. వెనుకబడిన సిద్ది తెగ అభివ్రుద్ధి కోసం పనిచేసే క్రమంలో అరవై ఏళ్ల హీర్ బాయ్ బెన్ ఎన్నో కష్టనష్టాలను, ఒడిదుడుకులను అనుభవించారు. సిద్ది మహిళల సాధికారత కోసం పట్టు వీడకుండా క్రుషి చేశారు. విజయం సాధించారు. ఆమె గురించిన కొన్ని విశేషాలు మీకోసం..

- Advertisement -

సిద్ది ఆదివాసీ తెగ అభివ్రుద్ధి కోసం, వారి ఎదుగుదల కోసం హీర్ బాయ్ చేసిన క్రుషి మాటల్లో చెప్పలేనిది. ఆమె శక్తియుక్తులు బాగా తెలిసిన వాళ్లు ఆమె బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ అంటారు. చిన్నతనంలోనే ఎవ్వరూ లేని అనాథగా ఒంటరిగా మిగిలింది. అప్పుడు ఆమె కుటుంబం నిలువెత్తు అప్పుల్లో కూరుకుపోయి కడు పేదరికంలో మగ్గుతోంది. వాటిని అధిగమించే క్రమంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతటి ప్రతికూల పరిస్థితిల్లోనూ ధైర్యంగా పోరాడి బతికిన జీవితం ఆమెది. వెనకడుగు వేయడమనేది ఆమె వ్యక్తిత్వంలోనే లేదని నిరూపించిన శక్తివంతమైన మహిళ హీర్ బాయి బెన్. ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ సిద్ది కమ్యూనిటీ ప్రజల ప్రగతి కోసం, సిద్ది కుటుంబాల పిల్లల చదువు కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తి హీర్ బాయ్.

ఇప్పటివరకూ సిద్ది కమ్యూనిటీకి చెందిన ఎందరో మహిళలు, చిన్నారుల జీవితాలలో వెలుగును నింపింది. జాబూర్ లోని సిద్ది తెగ మహిళలు అడవులకు వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అదే కమ్యూనిటీకి చెందిన హీర్ బాయ్ కి చిన్నతనం నుంచీ రేడియో వినడం అంటే ఎంతో ఇష్టం. అలా రేడియో ద్వారానే సిద్దిలో మహిళలకు ఉన్న అభివ్రుద్ధి పథకాల గురించి తెలుసుకుంది. పెద్దగా చదువుకోకపోయినా రేడియో ద్వారా వ్యవసాయంలోని నూతన పద్ధతుల గురించి హీర్ బాయ్ తెలుసుకుంది. అలా సిద్ది మహిళలకు నూతన ఉపాధి అవకాశాల కల్పనకు ఆమె ఆలోచన చేసింది. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా పట్టించుకోకుండా ప్రయోగాత్మకంగా సేంద్రియ వ్యవసాయం చేపట్టింది. అందుకోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుంది.

ఎంతో కష్టపడి వ్యవసాయం చేసింది. ఆమెకు అండగా గుజరాత్ లోని స్థానిక సిద్ది కమ్యూనిటీ మహిళలు నిలబడ్డారు. దీంతో ఆర్గానిక్ కంపోస్టు వ్యవసాయంలో ఆమె విజయం సాధించింది. అది లాభాల బాట పట్టడంతో హీర్ బాయ్ బెన్ సస్టైనబుల్ ఫార్మింగ్ ఎంటర్ ప్రైజును ప్రారంభించింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు.

ఆమె చేపట్టిన వెర్మి కంపోస్టు మ్యానుఫాక్చరింగ్ గ్రూపుకు మార్కెట్ లో ఎదురులేకుండాపోయింది. పేరొందిన బ్రాండ్లను సైతం వెనక్కి నెట్టి సంవత్సరానికి ఏడు లక్షల విలువచేసే కంపోస్టును ఆమె అమ్ముతోంది. అంతేకాదు తను చేసే ఈ పనిలో ఎంతోమంది మహిళలు కూడా భాగస్వామ్యం పంచుకునేలా చేయడంలోనూ హీర్ బాయి బెన్ విజయం సాధించింది. సామాజికంగా ముఖ్యమైన పలు అంశాలపై అంటే ఆరోగ్యం, ఆర్థిక స్వాతంత్రం, వ్యవసాయరంగాన్ని మరింత మెరుగుపరిచే అంశాలపై సైతం హీర్ బాయ్ ద్రుష్టి సారించింది. తన సంపాదనతో పాటు అవార్డుల ద్వారా వచ్చిన నిధులను సైతం స్థానిక పాఠశాలల అభివ్రుద్ధి కోసం హీర్ బాయి బెన్ వెచ్చించింది. తమ ఊరిలో కాలేజీని కూడా పెట్టే ప్రయత్నాల్లో హీర్ బాయ్ బెన్ ప్రస్తుతం ఉంది.

హీర్ బాయ్ బెన్ తొలుత అగాఖాన్ ఫౌండేషన్ లో చేరింది. స్త్రీలు సాధికారులుగా నిలబడేందుకు బిఎఐఎఫ్ అనే వ్యవసాయ సంస్థతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని చేబట్టింది. 700 మంది పైగా స్థానిక మహిళలకు బ్యాంకులో అకౌంట్ తెరిపించడమే కాకుండా డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలో కూడా వారికి నేర్పింది. స్త్రీలకు వ్యవసాయం చేయడం నేర్పించింది. రేడియో ద్వారా పలు సామాజిక సేవా సంస్థల తోడ్పాటుతో ఎంతోమంది స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించింది. ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘అడవుల్లో నేను చెట్లను నాటలేదు కానీ అక్కడి చెట్లను నరకకుండా కాపాడగలిగాను’ అని హీర్ బాయ్ బెన్ అన్న మాటల ద్వారా ఆమె పర్యావరణపరంగా, అడవుల రక్షణ పరంగా సమాజానికి ఎంత ఉపకారం చేసిందో అర్థం అవుతుంది.

హీర్ బాయ్ బెన్ గుజారత్ జునాగడ్ జిల్లాలోని జాంబూర్ లో 1960వ సంవత్సరంలో జన్మించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ దగ్గర పెరిగింది. కుటుంబం నిలువెత్తు అప్పుల్లో కూరుకుపోయినా తమకున్న చిన్న భూమిని అమ్ముకోవడానికి హీర్ బాయ్ బెన్ ఒప్పుకోలేదు. భర్తతో కష్టపడి పనిచేసుకుని అప్పుతీరుద్దామంది. తనకున్న చిన్న భూమిలోనే వ్యవసాయం చేస్తూ దిగుబడిని పెంచుకునేందుకు వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతుల గురించి ఎప్పటికప్పుడు రేడియో కార్యక్రమాల ద్వారా హీర్ బాయ్ బెన్ తెలుసుకుంటుండేది. నిత్యం రేడియోలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలను క్రమం తప్పకుండా వింటూ అందులో చర్చించిన నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ తన పొలంలో దిగుబడి పెరిగేలా హీర్ బాయ్ బెన్ ఎంతో కష్టపడింది. ఆమె చేసిన ప్రయత్నాలు, పడ్డ కష్టం చివరకు ఫలించింది. అతికొద్ది కాలంలోనే వ్యవసాయ దిగుబడిని అనూహ్యంగా పెంచి తనకున్న పెద్ద అప్పును తీర్చేసి గుండెల మీద ఉన్న రుణభారాన్ని తుడిచేసింది.

స్థానికలు ఒకవైపు నుంచి నిరుత్సాహపరుస్తున్నా వారి మాటలు పట్టించుకోకుండా సరికొత్త వ్యవసాయ విధానాల్ని అనుసరించింది. ఆర్గానిక్ కంపోస్ట్ ఫార్మింగ్ ను చేపట్టింది. అలా ముందుకు సాగిన ఆమె వ్యవసాయ ప్రయాణం సస్టైనబుల్ ఫార్మింగ్ ఎంటర్ ప్రైజ్ స్థాపించేదాకా సాగింది. తను సాధించిన ఆ విజయంతో ఆమె సంత్రుప్తి పడలేదు. గ్రామంలో ఉన్న తనలాంటి ఎందరో మహిళలను ఎంటర్ ప్రెన్యూర్స్ గా తయారుచేయడానికి పూనుకుంది.

అలా అక్కడి మహిళలను ఆర్గానిక్ ఫెర్టిలైజర్సు తయారీ నుంచి వేప నూనె ఉత్పత్తి , పశుసంపద పెంపకం, పండ్లు, కూరగాయలు అమ్మడం, రెడీమేడ్ బట్టల అమ్మకం , పాలు, పాల ఉత్పత్తుల అమ్మకం వంటి పలు రంగాలలో ఎంటర్ ప్రెన్యూర్లుగా ప్రవేశించేట్టు ప్రోత్సహించింది. అంతే కాకుండా వారికి ఆమె ఎంతో అండగా నిలిచింది. మరికొందరు మహిళలు కిరాణా షాపులు తెరిచి బిజినెస్ చేస్తుంటే, ఇంకొందరు టైలరింగ్ క్లాసులు చెప్తూ ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారు.

అంతేకాదు విద్య ప్రాధాన్యత ఎంతటిదో బాగా తెలిసిన మహిళ హీర్ బాయ్ బెన్. అందుకే స్థానికంగా స్కూళ్లను స్థాపించి వాటిని నడపడానికి టీచర్లను ఎక్కడి నుంచో తెప్పించి వారికి జీతాలు ఇస్తూ స్థానిక సిద్ది తెగ పిల్లలకు విద్యావకాశాలను అందిస్తోంది హీర్. అంతేకాదు ఊర్లో డే కేర్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. రోజు కూలీలుగా పనిచేస్తున్న కుటుంబాల్లోని నిరుపేద పిల్లలకు సైతం ప్రాధమిక విద్య అక్కడ లభిస్తోందంటే అది హీర్ బాయి బెన్ పుణ్యమేనని చెప్పాలి. ఊళ్లో ప్రీప్రైమరి స్కూలు స్థాపన కోసం స్థలం కేటాయించడానికి సహాయపడాల్సిందిగా కూడా ఎందరిదగ్గరకో తిరిగి ఆమె క్రుషి చేసింది. సిద్ది తెగ పిల్లలకు ప్రాధమిక విద్యను అందించడం కోసం బాల్వాడీలనే కిండర్ గార్టెన్ పాఠశాలలను ఆమె నెలకొల్పింది. 2004లో మహిళా వికాస్ ఫౌండేషన్ ని నెలకొల్పింది. దాని ద్వారా సిద్ది మహిళలు ఆర్థిక సాధికారులుగా నిలబడేందుకు క్రుషిచేసింది. హీర్ బాయ్ చేసిన ఈ క్రుషి వల్లనే ఎందరో జాంబర్ గ్రామ మహిళలు టైలరింగ్, కిరణా షాపుల్లో పనిచేస్తూ తమ కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు.

అంతేకాదు మహిళల్లో సాధికారతా భావనను పెంచేందుకు మహిళా బ్రుందాలను కూడా ఆమె ఊర్లో ఏర్పాటుచేసింది. అందులో ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, పొదుపు, క్రెడిట్, ఆదాయమార్గాలు, వ్యవసాయం వంటి పలు అంశాలకు సంబంధించిన సమస్యలను చర్చించి పరిష్కరించుకోవడం జరుగుతుంటుంది. అంతేకాదు స్థానిక మహిళలు స్వయం సాధికారులుగా తయారయ్యేందుకు మహిళలకు అవసరమయినపుడు సహాయపడాలని, వారికి బ్యాంకులు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని పలు బ్యాంకువారిని హీర్ బాయి బెన్ కోరింది. ఆ దిశగా క్రుషి చేసింది. అలా స్థానిక సిద్ది మహిళల అభివ్రుద్ధికి ఆమె చేసిన క్రుషి అమూల్యం.

తన కమ్యూనిటీకి, గ్రామ ప్రజలకే కాదు చుట్టుపట్ల ఉన్న ఎన్నో గ్రామాల ప్రజలకు కూడా హీర్ బాయ్ బెన్ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.అంతర్జాతీయ వేదికలపై మాత్రు భాషలో హీర్ బాయ్ బెన్ ఇచ్చిన పలు ప్రసంగాలు ఆమెలోని అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తూ ఎంతోమంది శ్రోతలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి కూడా. సామాజిక, ఆర్థిక సవాళ్లను అధికమించడంలో హీర్ బాయ్ బెన్ చూబించిన ధైర్యం, చొరవ నిజంగా ప్రశంసనీయం. పేదరికం, అక్షరాస్యతా వంటి పెద్ద అడ్డంకులను సైతం దాటుకుని గ్రామీణ సాధికారత, అభివ్రుద్ధిలను సాధించవచ్చని హీర్ బాయ్ బెన్ నిరూపించింది.

కమ్యూనిటీ ప్రజలకు ఆమె చేసిన సేవలకు గాను హిర్ బాయ్ బెన్ కు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ముఖ్యంగా 2002లో స్విట్జర్లండ్కు చెందిన విమన్స్ వరల్డ్ సమ్మిట్ ఫౌండేషన్ వారి ‘ప్రైజ్ ఫర్ విమెన్ క్రియేటివిటీ ఇన్ రూరల్ లైఫ్’ అవార్డు హీర్ బాయ్ బెన్ ని వరించింది. అన్నిఅవార్డులను గ్రామాభివ్రుద్ధి కోసమే హీర్ బాయ్ బెన్ వెచ్చించింది. తనకు లభించిన తొలి అవార్డు డబ్బును సైతం తన గ్రామాభివ్రుద్ధి కోసమే ఖర్చు పెట్టిన స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వం హీర్ బాయ్ బెన్ ది. ఇప్పుడు హీర్ బాయికి 60 ఏళ్లు. ఆమెకు ముగ్గురు పిల్లలు . వాళ్లు కూడా తల్లి బాటలోనే పయనిస్తున్నారు. కొడుకు, కూతురు హీర్ బెన్ కు బిజినెస్ లో సహాయపడుతున్నారు. చిన్న కొడుకు ప్రస్తుతం అగ్రికల్చర్ కాలేజీలో చదువుతున్నాడు. ‘ఒక మహిళగా మీకు గర్వం కలిగిస్తున్న విషయం ఏమిటని హీర్ బాయ్ బెన్ ని అడిగితే ‘గ్రామంలో నిధులు సేకరించడం, అవగాహనను పెంపొందించడం ఒక మహిళకు ఎంతో కష్టమైన పని. కానీ ఈ విషయంలో నేను విజయం సాధించడమే కాకుండా కమ్యూనిటీ ప్రజల్లో విద్య, సాధికారత స్పూర్తిని నాటగలిగాను. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మరెంతో గర్వంగా కూడా ఉంది’ అని హీర్ బాయి బెన్ బదులిచ్చింది. జాంబూర్ సిద్ది కమ్యూనిటీ మహిళ అయిన హీర్ బాయ్ బెన్ సిద్ది తెగ కోసం చేసిన క్రుషి ఆమెకు పద్మశ్రీ అవార్డు సైతం లభించింది. దీంతోపాటు ఆమెకు జానకీదేవి ప్రసాద్ బజాజ్ అవార్డు , గ్రీన్ అవార్డు, రిలయెన్స్ నుంచి రియల్ అవార్డు వంటి ఎన్నో అవార్డులు వచ్చాయి. సిద్ది తెగ వ్రుద్ధికి నిలువెత్తు స్ఫూర్తి హీర్ బాయి బెన్ అనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News