Homeఫీచర్స్Vaishakha Masam: ధర్మ సాధక మాసం వైశాఖ మాసం

Vaishakha Masam: ధర్మ సాధక మాసం వైశాఖ మాసం

Vaishakha Maasam: ఈ చరాచర సృష్టిలో తల్లి తన పిల్లల కోరికలన్నింటినీ తీర్చినట్లే, వైశాఖ మాసం మానవుల కోరికలన్నింటినీ తీరుస్తుంది కాబట్టి అది అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని నారద మహర్షి బ్రహ్మ నుండి ధృవీకరించారు. ఈ మాసం విష్ణువుకు చాలా ప్రియమైనది, అర్హులైన వారికి అనేక వరాలను ప్రసాదిస్తుంది. ఈ మాసం ధర్మం, యజ్ఞం, క్రియ, తపస్సులకు సారాంశం. వైశాఖ మాసం ధర్మ సాధక మాసం.

- Advertisement -

అందుకే ఇది మాధవ మాసం
ఎలాగైతే వేద విద్య విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనదో, ప్రణవం మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనదో, కల్పవృక్షం వృక్షాలలోకెల్లా సర్వోన్నతమైనదో, సూర్యదేవుడు తేజస్సులలోకెల్లా శ్రేష్ఠమైనదో, సుదర్శన చక్రం శాస్త్ర అస్త్రాలలోకెల్లా అత్యంత శక్తివంతమైనదో, బంగారం లోహాలలోకెల్లా శ్రేష్ఠమైనదో, శివుడు వైష్ణవులలో విశిష్టమైనదో, కౌస్తుభం రత్నాలలోకెల్లా శ్రేష్ఠమైనదో, అలాగే ఇది కూడా ధర్మ సాధక మాసం. సూర్యోదయానికి ముందే స్నానం చేసేవారిని నారాయణుడు ఎంతగానో గౌరవిస్తాడు. వైశాఖ మాసం లాగే, సత్యయుగం లేదు, జలదానం వంటి దానం లేదు, వ్యవసాయ సంపద లేదు, ఉపవాసం వంటి తపస్సు లేదు, దానధర్మాల వంటి సుఖం లేదు, కరుణ, క్షమ వంటి పుణ్యం లేదు, మంచి ఆరోగ్యం వంటి శ్రేష్ఠత లేదు, అన్నింటికంటే ముఖ్యంగా విష్ణువు వంటి భగవానుడు లేడని శాస్త్ర వచనం. అందుకే ఇది మాధవ మాసంగా పిలువబడుతుంది.

వైశాఖం నామ ఔచిత్యం
వైశాఖ మాసాన్ని మాధవ మాసమని కూడా పిలుస్తారు. పౌర్ణమి రోజున చంద్రుడు విశాఖ నక్షత్రంతో కూడి ఉండడం వల్ల దీనికి వైశాఖమాసం అనే పేరు వచ్చింది. సనాతన హైందవ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన, పవిత్రమైన మాసం ఇది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం (వైశాఖ స్నానం), దానధర్మాలు, తులసిదళ పూజ అత్యంత ఫలప్రదం. అక్షయ తృతీయ, నరసింహ జయంతి, బుద్ధ పౌర్ణమి వంటి ముఖ్యమైన పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి, ఇవి అక్షయమైన (తరిగిపోని) పుణ్యాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి.

వైశాఖంలో వచ్చే పర్వదినాలు
వైశాక శుద్ధ పాడ్యమి వైశాఖ పవిత్ర స్నాన వ్రతంతో వైశాఖం శుభారంభం. తదియ అక్షయ తృతీయ. బలరామ జయంతి. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన సింహాచల క్షేత్రంలో సింహాచల నరసింహస్వామి వారి నిజరూప సందర్శనం, దివ్య చందనోత్సవం. పంచమి జగద్గురు ఆది శంకరుల జయంతి, శ్రీమద్రామానుజాచార్యుల జయంతి. సప్తమి గంగాసప్తమి. అష్టమి దేవి పూజ. నవమి ద్వాపర యుగాంతం జరిగి కలియుగారంభం. వృషభ సంక్రమణ పుణ్యకాలం. దశమి శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు ఆరంభం. ఏకాదశి మోహిని ఏకాదశి. ప్రముఖ క్షేత్రం అన్నవరంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఉత్సవం ప్రారంభం. ద్వాదశి శ్రీ పరుశురామ జయంతి. వైశాక పూర్ణిమ మహా వైశాఖి ఉత్సవం. భగవాన్ బుద్ధదేవుని జయంతి ఉత్సవం. వైశాఖ బహుళ పాడ్యమి భూతమాతృత్సవం. విదియ నారద జయంతి. నవమి, దశమి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు. ఏకాదశి అపర ఏకాదశి. బహుళ చతుర్దశి సావిత్రి వ్రతం. మాస శివరాత్రి. అమావాస్య వృషభ సంక్రమణంతో వైశాఖమాసం సంపన్నమవుతుంది.

వైశాఖంలో ‘స్నానాలు’ చేస్తున్నప్పుడు, మధుసూదనుడిని స్తుతిస్తూ శ్రద్ధాసక్తులతో ఈ క్రింది శ్లోకం పఠించాలి.
మధుసూదన దేవేశ;
వైశాఖే మేషగే రవై౹
ప్రాతఃస్నానం కరిష్యామి;
నిర్విఘ్నం కురు మాధవ॥
(ఓ మధుసూదన! దేవేశ్వర మాధవా! మేష రాశిలో సూర్యదేవుడు కొలువై ఉన్నప్పుడు నేను తెల్లవారుజామున వైశాఖ మాస స్నానమాచరిస్తున్నాను; దయతో నా స్నానాన్ని ఆటంకం లేకుండా నెరవేర్చి నన్ను అనుగ్రహించు.)

స్నానం చేసిన తరువాత, సూర్యుడిని చూస్తూ ‘అర్ఘ్యం’ (దోసిలి నిండా నీరు) సమర్పిస్తూ ఈ శ్లోకాన్ని భక్తితో పఠించాలి.
వైశాఖే మేషగే భానౌ;
ప్రాతః స్నాన పరాయణ౹
అర్ఘ్యం తేహం ప్రదాస్యామి;
గృహాణ మధుసూదన॥
(ఓ మధుసూదనా! వైశాఖ మాసంలో సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు, తెల్లవారుజామున నేను లాంఛనంగా ‘అర్ఘ్యం’ సమర్పిస్తున్నాను; దయచేసి స్వీకరించు.)

వైశాఖంలో చేయవలసిన దానాలు, ఫలితాలు
వైశాఖంలో జలదానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్యఫలం ఒక్క జలదానం వలన వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి చోటా చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చే ఆచారం మనకు అనాదిగా వస్తుంది. ఈ చలివేంద్రాలు పితృదేవతలకు, దేవతలకు, మనుషులకు అందరికీ ఇష్టమైనది. బ్రహ్మా విష్ణు మహేశ్వరులను తృప్తి పరుస్తుంది. పూర్వీకులు అంతా పుణ్యలోకాన్ని పొందుతారు. నీటిని దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం తెలియజేస్తుంది. ఈ కాలంలో లభించే మామిడిపండ్ల దానం వలన పితృదేవతలు సంతోషిస్తారని, వారికి పుణ్యాలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

పానకం నిండిన కుండను దానం వలన మూడుసార్లు గయా శ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పితృదేవతలు తరిస్తారని విశ్వాసం. దోస పండు, బెల్లం, చెరుకు గడలు దానం వలన వారి సమస్త పాపాలు తొలగుతాయి. శయన దానం వలన సుఖసంతోషాభివృద్ధి. వస్త్రదానం వల్ల ఆయుర్వృద్ది. ముఖ్యంగా తెల్లని వస్త్రాన్ని దానం ఇస్తే పూర్ణాయువు పొంది ముక్తి పొందుతారని నమ్మకం. పేదవారికి బట్టలు ఇచ్చినట్లయితే రోగబాధల నుండి విముక్తి కలుగుతుంది. భర్తకి దీర్ఘాయువు కలుగుతుంది. ఇది మహిళలకు చెందినటువంటి దాన ప్రక్రియ. చందన దానం వలన తరచుగా జరిగే రోడ్డు ప్రమాదాల నుండి రక్షించబడతారని నమ్మకం. తాంబూల దానం వలన ఆధిపత్యం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. ఏడు తరాల పితృదేవతలు నడక బాధలను విముక్తి పొందుతారని నమ్మకం.

మజ్జిగ దానం వలన విద్యా ప్రాప్తి కలుగుతుంది. పాదరక్షలు దానంతో బాధల నుండి విముక్తి లభిస్తుంది. గొడుగు దానం వలన కష్టాలను విముక్తి లభిస్తుంది. వారికి మృత్యువాత ఉండదని చెప్పబడింది. సమస్త దోషాలు నివారణ అవుతాయి. పండ్ల దానం వలన జీవితంలో ఉన్నత స్థాయికి చేరి తలచిన పనులన్నీ ఫలవంతం అవుతాయని నమ్మకం. బియ్యం దానం వలన అపమృత్యు దోషాలు తొలగుతాయి. అన్ని యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యఫలం బియ్యం దానం వలన లభిస్తుంది. ఆవు నెయ్యి దానం వలన అక్షయ యాగం చేసిన పుణ్య లభిస్తుంది. పితృదేవతలకు తర్పణాలు వదిలే వారికి దారిద్ర్య బాధలు ఉండవు. ఈ మాసంలో అన్నదానం విశేష ఫలితాన్ని ఇస్తుంది. వెంటనే తృప్తినిచ్చే దానాలన్నింటిలోకెల్లా ఉత్తమమైన దానం అన్నదానం సమస్తదేవతల ఆశిస్సులు లభిస్తాయి. అన్ని ధర్మాలను ఆచరించిన ఫలితం లభిస్తుంది. పెరుగన్నం దానం చేయడం వలన వారు చేసిన తెలిసో తెలియక చేసిన పాపాలు తొలగి, పుణ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా వైశాఖంలో నియమాలు పాటించాలి. ముక్తి పథంలో పయనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News