Friday, November 22, 2024
Homeఫీచర్స్Three women: ఆ ముగ్గురు మహిళలే స్ఫూర్తి

Three women: ఆ ముగ్గురు మహిళలే స్ఫూర్తి

‘నింగి’లో, ‘నేల’పై తమ ప్రతిభా తూణీరాలను ఎక్కుపెట్టారు భారత మహిళలు. మిలటరీలో సైతం పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. స్త్రీపురుష సమానత్వానికి సాహస దారుల్లో సైతం తమ కాలిముద్రలను వేస్తున్నారు. వీళ్లు భారత మిలటరీలో తొలి మహిళా కమాండింగ్ అధికారులుగా చరిత్ర స్రుష్టించడమే కాదు తమదైన సాహస చరిత్రలను సైతం ఆవిష్కరించనున్నారు.

- Advertisement -

ఇక్కడ కనిపస్తున్న ఈ ముగ్గురు మిలటరీ మహిళలు వాళ్లే. వారికి సలామ్ చేద్దాం…వారిని స్ఫూర్తిగా తీసుకుని నింగి, నేలను ఏకం చేద్దాం… ఈ ముగ్తురు మహిళలు పురుషులకు కూడా గొప్ప స్ఫూర్తే. వారి గురించిన విశేషాలే ఈ కథనం…

కెప్టెన్ శివా చౌహాన్ అత్యంత ఎత్తైన, మంచుతో నిండిన, పెనుసవాళ్లతో కూడిన యుద్ధ భూమిగా పేరున్న సియాచిన్ ను గెలిచింది. కల్నల్ గీతా రానా దేశంలో వ్యూహాత్మకంగా ఎంతో సున్నితమైన ప్రదేశంగా పేరున్న ఈస్ట్రన్ లడఖ్ సెక్టార్ లో తొలి మహిళా కమాండింగ్ అధికారిగా తన సత్తా చాటనుంది. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న వెస్ట్రన్ సెక్టర్ లోని ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్ కు కేప్టన్ షాలిజా ధామి కమాండింగ్ బాధ్యతలను చేపట్టి వైమానిక దాడుల నుంచి సైతం దేశాన్ని కాపాడే అత్యంత సాహసోపేతమైన బాధ్యతలను చేపట్టింది.

ఇటీవల కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్, ఆర్డినెన్స్, ఇఎంఇ, ఇతర శాఖల్లో 108మంది మహిళా అధికారులను భారత ఆర్మీ తీసుకుంది. సైన్యంలోని ఎన్నో కీలకమైన యూనిట్లలో కమాండింగ్ పొజిషన్ లో మహిళలు నేడు ప్రవేశించారు. ఇండియా-చైనా సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈస్ట్రన్ లడఖ్ సెక్టార్ లోని ఇండిపెండెంట్ ఫీల్డ్ వర్కుషాపు బాధ్యతలను చేపట్టిన తొలి మహిళా సైనికాధికారి కల్నల్ గీతా రానా. మారుమూల ప్రాంతంలో, వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశంలో ఈ బాధ్యతలను ధైర్యంగా చేపట్టిన మహిళా సైనికాధికారి రానా.

భారత త్రివిధ దళాలలో మరొకటి వైమానిక దళం. ఇందులో గ్రూప్ కేప్టన్ అయిన షాలిజా ధామికి వెస్ట్రన్ సెక్టర్ లోని ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్ కమాండింగ్ బాధ్యతలను అప్పగించారు. ఈ సెక్టర్ లోనే ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు ఉంది. వైమానిక దళంలో ఒక మహిళకు కంబాట్ యూనిట్ కమాండింగ్ బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి. అలా ఆమె కూడా వైమానిక దళంలో నూతన చరిత్ర లిఖించారు. కేప్టన్ షాలిజా పంజాబ్ లో ప్రారంభించనున్న ఎయిర్ డిఫెన్స్ యూనిట్ కు ఇంఛార్జ్ గా బాధ్యతలను త్వరలో చేపట్టనున్నారు. పాకిస్తాన్ నుంచి ఎదురయే వైమానిక దాడులను నియంత్రించే బాధ్యత కూడా ఆమె మీద ఉంది.

ప్రపంచంలోనే తీవ్ర మంచు ప్రాంతం, ఎంతో ఎత్తులో ఉన్న యుద్ధభూమిగా పేరున్న సియాచిన్ లో భారత ఆర్మీ తొలిసారి కేప్టన్ శివా చౌహాన్ అనే మహిళా ఆఫీసర్ ని విధుల నిర్వహణకు నియమించి చరిత్ర స్రుష్టించింది. ఇలా కమాండింగ్ పొజిషన్లలో మాత్రమే కాదు మిత్రదేశాలతో కలిసి నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలలో, శాంతిస్థాపనా కార్యకలాపాల్లో సైతం మహిళా సైనికులను భారత మిలటరీ దింపడం ప్రారంభించింది. సుడాన్ లోని వివాదాస్పద ప్రాంతమైన అబ్యేలో శాంతి స్థాపనకు 27 మంది మహిళా సైనికులతో కూడిన బ్రుందాన్ని భారత సైన్యం పంపింది. ఈ బ్రుందంలోని భారతీయ మహిళా సైనికులు యుఎన్ ఇంటీరిమ్ సెక్యూరిటీ ఫోర్సులో భాగంగా భద్రతాపరమైన పలు బాధ్యతలను అక్కడ నిర్వహిస్తున్నారు.

ఇలా సైన్యం, వైమానిక దళాలల్లో మహిళలకు కమాండింగ్ బాధ్యతలను భారత ఆర్మీ అప్పగించడం స్త్రీల శక్తిసామర్థ్యాలకు నిదర్శనం. ఎంపికచేసిన బ్రాంచుల్లో కమాండ్ అసైన్ మెంట్స్ మహిళాధికారులకు అప్పగించడం ద్వారా మిలటరీలో స్త్రీపురుష సమానత్వానికి భారత మిలటరీ నాంది పలికింది. 1992 నుంచి 2006 బ్యాచ్ కు చెందిన పలు మహిళా ఆఫీసర్లు ఇంజనీర్లు, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఇంటిలిజెన్స్ కార్ప్స్, ఆర్మీ సర్వీస్ కార్ప్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్లుగా విధులు నిర్వహించారు. 2020లో పర్మినెంట్ కమిషన్ (పిసి)గా వీరిని ఆర్మీ అనుమతించిన తర్వాత స్త్రీలకు కమాండ్ బాధ్యతలకు ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే సైనిక పదాతిదళంలో ట్యాంకులు, కంబాట్ పొజిషన్స్ మహిళలకు ఇంకా నో- గో జోన్ గానే ఉన్నాయి.

కల్నల్ గీతా రానా:

కల్నల్ గీతా రానాది సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి మహర్ రెజిమెంట్ లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కల్నల్ గీతా శిక్షణ పొందారు. 2000 సంవత్సరంలో సైన్యంలో ప్రవేశించారు. 23 ఏళ్ల ఆమె మిలటరీ కెరీర్ లో సిక్కిం, జమ్ము, కశ్మీర్ వంటి వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ఇఎంఇ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్ మెంట్ లో ఇన్స్ట్రక్టర్ గా కూడా పనిచేశారు. వైమానికదళం అధికారులు కేప్టన్ షాలిజా ధామిని ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్ కి తొలి మహిళా ఆఫీసర్ గా నియామకం చేసిన మర్నాడే కల్నల్ గీతా రానా నియామకం గురించిన ప్రకటన వెలువడింది.

కల్నల్ గీతా రాణా

కెప్టెన్ షాలిజా ధామి:

ఇండియన్ ఎయిర్ పోర్స్ తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్ గా నియామకమైన కేప్టెన్ షాలిజా ధామి వైమానిక దళంలో అందించిన సేవలు ఎంతో విశేషమైనవి. వైమానిక దళంలో తొలి మహిళా కమాండ్ ఆఫీసర్ గా ఆమె చరిత్ర స్రుష్టించారు. పంజాబ్ లోని లుధియానాలో ఆమె జన్మించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. భారత వైమానిక దళంలో షాలిజా ధామి కెరీర్ 2003లో ప్రారంభమైంది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఫ్లైయింగ్ ఆఫీసర్ గా ఆమె మొదట నియమితులయ్యారు. 2003లో మొదటిసారి ఒంటరిగా ఫ్లైట్ హెచ్ ఎ ఎల్ హెచ్పిటి-32 దీపక్ ను ఆమె నడిపారు. 2005 సంవత్సరంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పదోన్నతి పొందారు. 2009లో స్క్వావడ్రన్ లీడర్ అయ్యారు. 2016లో ధామి వింగ్ కమాండర్ గా పదోన్నతి పొందారు. 2019లో ఫ్లైట్ కమాండర్ అయిన తొలి మహిళా ఆఫీసర్ గా రికార్డు స్రుష్టించారు. హిందాన్ ఎయిర్ ఫోర్సు స్టేషన్ లో చేతక్ హెలికాప్టర్ యూనిట్ ఫ్లైట్ కమాండర్ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు ఐఎఎఫ్ కు చెందిన చేతక్, చీతా హెలికాప్టర్లకు తొలి మహిళా ఫ్లయింగ్ ఇన్ స్ట్రక్టర్ గా కూడా ధామి చరిత్ర స్రుష్టించారు. 2018లో ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పర్మినెంట్ కమిషన్ పొందిన తొలి మహిళా అధికారిగా రికార్డు స్రుష్టించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్సులో ధామి నిర్వహించిన పలు బాధ్యతలు ఆమెకు పని పట్ల ఉన్న నిబద్ధతను, నిజాయితీని, కష్టపడే స్వభావాన్ని పట్టి ఇస్తాయని తోటి సిబ్బంది ఎప్పుడూ అంటుంటారు. భారత వైమానిక దళంలో ఆమె సాధించిన విజయాలు స్త్రీపురుషుల మధ్య వున్న లింగ వివక్షను చెరిపేస్తాయంటారు. తన రంగంలో ఆమె సాధించిన విజయాలు మరెందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని కూడా అంటారు. భారత దళాల చరిత్రలో ధామి సాధించిన విజయాలు, పంజాబ్ సరిహధ్దుల్లో ఐఎఎఫ్ మిసైల్ స్క్వాడ్రన్ తొలి మహిళా కమాండింగ్ అఫీసర్ గా ఆమె చేరిన ఉన్నత శిఖరాలు ఎంతో గుర్తింపును పొందాయి. మిలటరీలో లింగ సమానత్వానికి, స్త్రీల ప్రాతినిధ్యానికి ఆమె గొప్ప స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.

కెప్టెన్ శివా చౌహాన్:

తీవ్ర మంచుతో నిండి ఉండే ప్రదేశంగా, అత్యంత క్లిష్టమైన, ఎత్తైన యుద్ధ భూమిగా, హిమనీనదంగా పేర్కొనే సియాచిన్ లో తొలి మహిళా సైనికాధికారిగా విధులు నిర్వహించేందుకు కెప్టెన్ చౌహాన్ నియామకమవడం భారత మహిళలను మరెంతగానో ఉత్తేజపరుస్తోంది. ట్రైనింగ్ పూర్తిచేసుకున్న వెంటనే ఆమెను సియాచిన్ లోని కుమార్ పోస్టుకు పంపారు. ఇది 15,600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నియామకం కావడానికి ముందు ఆమె ఎంతో కఠినమైన శిక్షణ తీసుకుంది. హిమపాతంలో ఉండడం, హిమనదం ప్రవహించే లోయ నుంచి రక్షించడం, ఐస్ వాల్ క్లైంబింగ్ , శక్తిని పెంచే వ్యాయామాలు, సర్వైవల్ డ్రిల్స్ వంటి వాటిల్లో కెప్టెన్ శివా చౌహాన్ శిక్షణ పొందారు. బెంగాల్ శాపర్ ఆఫీసర్ కేప్టన్ అయిన శివా చౌహాన్ స్వంత ఊరు రాజస్తాన్. చౌహాన్ తల్లి గ్రుహిణి. శివ పదకొండేళ్ల ప్రాయంలోనే ఆమె తండ్రి చనిపోవడంతో కూతురు శివా చౌహాన్ విద్యాబుద్దులు అన్నీ తల్లే చూసుకుంది. శివ ఉదయ్ పూర్ లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఉదయ్ పూర్ లోని ఎన్ జె ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు. ఎత్తైన బాటిల్ గ్రౌండ్ గా పేరున్న సియాచిన్ లో ఎండ్యూరింగ్ గెరిల్లా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న తర్వాత కుమార్ పోస్టులో నియామకమైన తొలి మహిళా ఆఫీసర్ కేప్టన్ శివా చౌహాన్ . ప్రధాని మోదీ కూడా చౌహాన్ ను ఎంతో ప్రశంసాంచారు. 2022 జూలైలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నిర్వహించిన సురా సోయ్ సైక్లింగ్ సాహసయాత్రను సియాచిన్ లోని వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ లోని వార్ మెమోరియల్ వరకూ మొత్తం 508 కిలోమీటర్ల దూరం మేర సైకిల్ సాహసయాత్రను చౌహాన్ విజయవంతంగా పూర్తిచేశారు.

అప్పుడే సియాచిన్ లోని సురా సోయ్ ఇంజనీర్ రెజిమెంట్ కు చెందిన సైనికుల కమాండింగ్ బాధ్యతలను కెప్టెన్ శివా చౌహాన్ కు అప్పగించారు. అందులో విజయం సాధించడంతో చౌహాన్ ను సియాచిన్ బ్యాటిల్ స్కూల్ శిక్షణకు ఎంపిక చేశారు. ఇక్కడ హాన్, మరికొందరు ఆర్మీ అధికారులతో కలిసి ఎంతో క్లిష్టతరమైన శిక్షణను తీసుకున్నారు. ఆ తర్వాత జనవరిలో సియాచిన్ గ్లాసియర్లో (హిమానీనదంలో) శివా చౌహాన్ అడుగుపెట్టారు. భారత మిలటరీలో చేరడానికి, అందులో సైతం జయకేతనం ఎగరవేయడానికి షాలిజా ధామి, కల్నల్ గీతా రానా, కేప్టెన్ శివా చౌహాన్లు ఎందరో యువతీ యువకులకు గొప్ప స్ఫూర్తిగా నిలబడతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News