Life Transformation: “ప్రకృతి సిద్ధంగా ఋతువుల్లో మార్పులు కాలానుగుణ్యంగా చోటు చేసుకుంటాయి. ఇది సృష్టి ధర్మం. జీవనయానంలో సైతం కష్టాలు కలతలు తప్పవు. ఇది మనిషి ధర్మం. ఏ మనిషి జీవితం అయినా ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగదు. పరిస్థితులు మనిషిని చెడు మార్గం వైపు నడుపుతూ ఉంటాయి. మనసును వక్రమార్గం వైపు నడిపిస్తుంటాయి. అప్పుడే మండుటెండలో వానజల్లుల సిద్ధపురుషుల సాంగత్యం, గురు బోధనల వల్ల ఆ మనిషి జీవితాన పరివర్తన కలుగుతుంది. జీవిత పరమార్ధం గురించి అన్వేషణ మొదలవుతుంది. ఎండిన మాను మళ్ళీ చిగురించినట్లుగా, పరివర్తన కలిగిన మనిషి జ్ఞానామృతం పంచే గురువుగా బాసిస్తాడు. మట్టి మనిషి మాణిక్యంలా మారుతాడు. తన జీవన గమ్యాన్ని చేరుతాడు.”
గురు సన్నిధిలో గమ్యస్థానం
ఋతువుల్లో మార్పులు కాలానుగుణంగా చోటుచేసుకుంటాయి. ఇది సృష్టి ధర్మం. ఈ మార్పులను మౌనంగా స్వీకరించే మనిషి జీవితంలోనూ చీకటి వెలుగులు ఆటుపోట్లు ఉంటాయి. ఇది మనిషి ధర్మం. జీవన యానంలో కష్టాలు కలతలు తప్పవు. ఏ మనిషి జీవితమైనా ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగదు. పరిస్థితులు మనిషిని చెడు మార్గం వైపు పురిగొల్పుతూ ఉంటాయి. మనసును వక్రమార్గం వైపు నడిపిస్తూ ఉంటాయి. అప్పుడే మండుటెండలో వానజల్లులా సిద్ధ పురుషుల సాంగత్యం, సద్గురువుల బోధనల వల్ల ఆ మనిషిలో పరివర్తన కలుగుతుంది. జీవిత పరమార్ధం గురించి అన్వేషణ మొదలవుతుంది. ఎండిన మాను మళ్ళీ చిగురించినట్లుగా జీవితాన కలిగిన పరివర్తన తో మనిషి జ్ఞానామృతం పంచే గురువుగా భాసిల్లుతాడు. తన గమ్యస్థానాన్ని చేరుతాడు.
కొన్ని అనుకోని సంఘటనలతో మనిషి స్వభావంలో మార్పు మొదలు
రత్నాకరుడు దారి దోపిడీలు చేసే ఓ గజదొంగ. నారద మహర్షి బోధనల వల్ల తన పాప పంకిల జీవితానికి స్వస్తి పలికాడు. ఋషి వాల్మీకిగా మారాడు. క్రౌంచ పక్షుల వియోగాన్ని చూసి జగద్విఖ్యాత ఇతిహాస కావ్యమైన రామాయణం రచించి మహాకవిగా, బ్రహ్మజ్ఞానిగా కీర్తి పొందాడు. సద్గురువుల బోధనల వల్లే కాకుండా, జీవితాన జరిగిన కొన్ని అనుకోని సంఘటనల ప్రేరణల వల్ల కూడా తమ స్వభావాన్ని మార్చుకొని శాంతి సందేశాన్ని ఇచ్చిన వారు మనకు చరిత్రలో కనిపిస్తారు. కలింగ యుద్ధానంతరం కదన రంగంలో మరణించిన సైనికులను చూసి అశోక చక్రవర్తి చలించిపోయాడు. అతనిలో పశ్చాత్తాపం రగిలింది. అప్పటి నుంచి అహింసా మార్గం చేపట్టాడు. ప్రజోపకరమైన పనులు చేపట్టి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు.
మంచి మాటలు జీవిత వెలుగు బాటలు
అహంకారం, మూర్ఖత్వం మనిషికే అపకారం చేస్తాయి. వీటి నుంచి బయటపడకపోతే మనిషి ఏది సాధించలేడు. జీవితం నిరర్థకం అవుతుంది. పురుషోత్తముడైన శ్రీరాముడితో వైరం మాని శరణకోరాల్సిందిగా రావణాసురుడికి హనుమంతుడు, అంగదుడు హితవు పలికారు. సోదరుడైన విభీషణుడు అమృత సమానమైన హితోక్తులు చెప్పాడు. కాదని కాలదన్నాడు రావణాసురుడు. చివరికి రాక్షస వీరులను, లంకను పోగొట్టుకొని సర్వనాశనమయ్యాడు. ఎవరు మంచి మాటలు చెప్పినా సహృదయంతో వినాలి. అందలి మంచిని స్వీకరించాలి. అలా స్వీకరించగలిగిన ఆ మంచి మాటలు మనిషి జీవితానికి వెలుగు బాటలు అవుతాయి.
పరివర్తనతో మనిషి ప్రవర్తనలో మార్పు
పరివర్తన చెందిన మనిషి ఉదాత్తమైన ఆశయాలతో ముందుకు సాగుతాడు. ఉత్తమ విలువల నిర్మాణానికి సహాయపడతాడు. రాజకుమారుడైన సిద్ధార్థుడు రాజధాని నగరంలో రథసంచారం చేస్తుంటే కనిపించిన దృశ్యాలు అతన్ని భోగ విముఖుణ్ణి చేశాయి. అతన్ని తత్వచింతన వైపు నడిపించి, మహా బోధకుడిగా మార్చాయి. పరివర్తన మనిషి అజ్ఞానపు ఆలోచనలను మారుస్తుంది. సన్మార్గం వైపు నడిపిస్తుంది. కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడి హితబోధ వల్ల అర్జునుడి మనసు మారింది. స్వధర్మం యొక్క గొప్పతనాన్ని గ్రహించి కర్తవ్యోన్ముఖుడయ్యాడు అర్జునుడు. భారత యుద్ధంలో విజయం సాధించి విజయుడుగా కీర్తి పొందాడు.
పరివర్తనతో జీవిత సార్థక్యం
జీవితాన ఎదగాలనుకున్న మనిషి మాత్రమే మారుతాడు. అలా మారిన మనిషి ధర్మం వైపు అడుగులు వేస్తాడు. జ్ఞానామృతం పంచే గురువుగా మారి, శాశ్వత కీర్తిని పొందుతాడు. ఈ సృష్టిలో క్రూర జంతువులు సాధు జంతువులు గా మారవు. కానీ ఒక దుర్జనుడు సజ్జనుడిగా మారడం కేవలం మానవ జాతిలోనే సాధ్యపడుతుంది. మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి తప్పకుండా మారాలి. ఆ మార్పు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అప్పుడే ఆ మనిషి ఆదర్శమూర్తిగా ఈ భూమ్మీద శాశ్వతంగా నిలిచిపోతాడు.
“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

