Vasudhaiva Kutumbakam: వసుదైవ కుటుంబకమ్ అనునది గీర్వాణ వాక్యం. అంటే “ప్రపంచం అంతా ఒకే కుటుంబం” అని అర్థం. ఇది మహా ఉపనిషత్తు నుండి ఉద్భవించిన భారతీయ తత్వశాస్త్రం. జాతి, మతం, దేశంతో సంబంధం లేకుండా, లింగ భేదం పాటించకుండా ప్రపంచంలోని ప్రజలందరినీ ఒకే కుటుంబంగా భావించి, ప్రేమ, ఐక్యత, శాంతిని పెంపొందించుకోవాలని ఇది బోధిస్తుంది. వసుదైవ అనే ప్రాచీన భావన నేటికీ సందర్భోచితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ప్రపంచ దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యక్తిగత లేదా కుటుంబ ప్రయోజనాల కంటే ఉన్నతమైన ప్రయోజనానికి ప్రాధాన్యత ఇస్తుంది.
ఇది ఇతరుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవడాన్ని, వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధి, శాంతి, భిన్నత్వాల పట్ల సహనం వంటి వివిధ సమస్యలపై ప్రపంచ ఐక్యతను, బాధ్యతను పెంపొందించడాన్ని ప్రోత్సహిస్తుంది. వసుధైవ కుటుంబకం కేవలం మానవులకు మాత్రమే సంబంధించినది కాదు, కానీ అన్ని జీవ రూపాలను కలిగి ఉంటుంది. మానవులు, జంతువులు, మొక్కలు, మొత్తం సహజ ప్రపంచం. ఈ పరస్పర అనుసంధానం సరిహద్దులకు లేదా హద్దులకు పరిమితం కాదు. ఇది మొత్తం విశ్వాన్ని ఆవరించి ఉంటుంది. ఈ విశ్వమంతా ఉమ్మడి కుటుంబమే.
‘వసుదైవ కుటుంబకమ్’ అంటే…
మహా ఉపనిషత్తులోని ఆరవ అధ్యాయం, 71-72 సుప్రసిద్ధ శ్లోకం ఇది.
అయం నిజః పరో వేతి:
గణనా లఘుచేతసామ్।
ఉదారచరితానాం తు:
వసుధైవ కుటుంబకమ్॥
(సంకుచితమైన మనస్తత్వం గలవారికి ఇది నాది, ఇతడు నా వాడు, ఇది నాది కాదు, ఇతడు పరాయివాడు అనే భావన ఉంటుంది. కాని ఉదారమైన మనస్తత్వం కలిగిన వారికి ఈ వసుధ అంటే ఈ భూమి, విశ్వం లేదా ప్రపంచమంతా ఓకే కుటుంబంలా కనబడుతుంది. అంటే ఈ విశ్వం మొత్తం ఒక కుటుంబం అని భావన.)
ఈ విష వలయంలో నుంచి మనం బయటపడలేమా?
మనము ఒక అత్యంత అందమైన, అద్భుతమైన ప్రపంచంలో నివసిస్తున్నాము. మితిలేని ప్రేమనందించే అమ్మ. అన్ని బాధ్యతలు తీసుకునే నాన్న. అవసరానికి అండగా నిలిచే బంధు బలగం. కష్టసుఖాల్లో తోడుగా నిలిచే మిత్ర పరివారం. ప్రకృతి, పంచ భూతాలు, పువ్వులు, పరిమళాలు, రంగులు, రసాలు, జీవ వైవిధ్యం, వర్ణ వైవిధ్యం ఇలా ఎన్నెన్నో… అంతులేనన్ని.. ఇవన్నీ పెట్టుబడి లేకుండానే, మన ప్రయత్నం లేకుండానే, మనకన్నా ముందుగానే మన కొరకు సిద్ధంగా ఉన్నాయిక్కడ. కొంత ప్రణాళికతో, మరికొంత ప్రయత్నంతో వాటన్నింటినీ సంతోషంగా సౌకర్యవంతంగా మనం తేలికగా అనుభవించవచ్చు, అందుకు అడ్డేమీ లేదు. ఆటంకం అసలే లేదు. కానీ మన బాధ్యతారాహిత్యంతో తప్ప మిగిలిన జీవరాశులకు వాటిని తగినంత అందుకునేందుకు తగిన సహజ వనరులు ఉన్నాయి. వసతులు ఉన్నాయి. చాలు! వాటిది చాలా నిరాడంబర నిర్ణిత జీవనం. కానీ మన మనుషులకు అలా కాదు. అవసరాన్ని మించిన ఆశలు. ఆశలను మించిన దురాశలు. అందువల్లనే అవధుల్లేని నిరాశలు. ఇంకా నిర్వేదాలు, నిస్తేజాలు, చివరకు హత్యలు. అంతకు మించి ఆత్మహత్యలు. ఈ విష వలయంలో నుంచి మనం బయటపడలేమా! అనే సందేహం మేధావులను సైతం వేధిస్తున్న ప్రశ్న?
మితిమీరిన అహంకారమే మనిషి పతన హేతువు!
ఉన్నదాన్ని ఆనందంగా స్వీకరిస్తే, మనకు లేని దాన్ని, మనది కానిదాన్ని నిర్వికారంగా నిరాకరిస్తే, మనసున్న మనిషి కన్నా ఈ భూమిపై మరే జీవి ఆనందంగా జీవించలేడు. నిజానికి మనిషి ఆనంద స్వరూపుడు. తన అత్యంత సహజ తత్వాన్ని మరిచిపోవడం అతని దురదృష్టం. తల్లిదండ్రులు ఆడపిల్లకు పెళ్లి చేసి అన్నిసారెలు, సంభారాలు ఇచ్చి అత్తవారింట్లో దింపినట్లు, భగవంతుడు అన్నీ అమర్చి లోకమనే అందమైన, అద్భుతమైన గృహంలో మనలను దించాడు. అనుభవించడం ఒక్కటే మనం చేయాల్సిన పని. కానీ అనుభవించలేక ఏమిటో అనవసరమైన అవస్థలు, దుఃఖాలు, బాధలు, విషాదం. పక్కవాడిని పరాయి వాడనుకోవడం మనం చేస్తున్న పెద్ద తప్పు. అయినవాడిని కానివాడు అనుకోవడమే మనకు మనం చేసుకుంటున్న ముప్పు. ప్రకృతి పంచ భూతాల రూపంలో ప్రపంచంలోని ప్రతి అణువును తనకు తాను సమానంగా పంచి ఇచ్చింది. అలాంటిది అన్నీ నావే! అనే అధికారం మనిషికి ఎవడిచ్చాడు? అదే కాకుండా మనుషుల్లోనూ కుల, మత, జాతి, ప్రాంత, భాషా,లింగ భేదాలు కలిగే దుర్లక్షణాలు ఎన్నో.
విశ్వంలో ప్రతి ఒక్కటి పరస్పరం ఆధారితం
అసలు ఒకరి సహాయం ఒకరి సహకారం లేకుండా ఈ లోకంలో ఏ జీవైనా మనగలదా? మొక్కకు ఆకాశంలోని మేఘం నుంచి నీళ్లు కావాలి. మేఘాలు కదలాలన్నా, కరగాలన్నా వాయువు కావాలి. వాయువుకు వృక్షాలు, వృక్షాలకు మళ్ళీ మేఘాలు, మళ్లీ వాయువు ప్రతి ఒక్కటీ ఈ సృష్టిలో పరస్పర ఆధారితం! బయటకు స్వయం ప్రతిపత్తి ఉన్నట్లు కనిపించినా అంతర్ముఖంలో మాత్రం ఒక అజ్ఞాతహస్తం అద్భుతమైన సమన్వయం చేస్తూ ఉంటుంది. అతడే పరమాత్మ. పరస్పర సహకారానికి, పరస్పర భాగస్వామ్యానికి, పరస్పరం పంచుకోవడానికి నిష్పక్షపాతంగా ఏర్పాటు చేసి ఉంచింది. మనకు కావలసింది విజ్ఞత. దుర్విచక్షణ లేకపోవడం మాత్రమే! ఇక మిగిలిన జీవరాసులు ఆ ఏర్పాటును ఎంతో విధేయతతో తలదాల్చి తనకు తెలియకుండానే తూచా తప్పకుండా వినియోగించుకుంటున్నాయి. ఏదో గొప్పగా ఆచరిస్తున్నాం అనుకుని మనం మాత్రమే అతి తెలివితో ఉన్న మతిని పోగొట్టుకొని దుఃఖాల పాలవుతున్నాం.
మనిషి విజ్ఞతతో తన పాత్రను సమర్థవంతంగా పోషించాలి
ఈ విశ్వమనే ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండవలసింది కేవలం మనుషులమైన మనం మాత్రమే కాదు. మనతో పాటు బ్రతుకుతున్న సమస్త జీవజాలం, చరాచర, జంగమాదులు కూడా ఈ లోకంలో ఒక్క అణువు కదలాలన్నా అందుకు మిగిలిన సమస్త లోక సహకారం ఉండడం తప్పనిసరి. అప్పుడే ఆ అణువు నిర్దేశించిన స్థానానికి చేరుకుంటుంది. ఎందుకు మనం భగవంతుడి నిర్దేశిత సహకారాన్ని కాలదన్నుకుంటున్నాం! పునాదులు వేసిస్తాను. ఇటుకలతో మీరు భవనాలు పేర్చుకోండి! అంటున్నాడు పరమాత్ముడు. మొక్కలు నేనే ఇస్తాను. చెట్లు మీరు పెంచుకోండి! వానలు నేనే పంపిస్తాను. పంటలు చక్కగా పండించుకోండి! పరమాత్ముడు ఎంతటి దయామయుడు? జంతువులను తగిన విధంగా వాడుకోండి!
అంతేకానీ వాటిని కోసుకొని తినకండి. అవి మీకు ఆహారం ఎంత మాత్రం కాదు అంటున్నాడు. పశువులతో పాడి, వ్యవసాయం పనులు చేయించుకోండి! పక్షులతో ఆనందించండి! అంతరిక్షంతో సహా సమస్త ప్రకృతిని మీరు సుఖ జీవనానికి వినియోగించుకోండి! కానీ మితిమీరిన మీ తెలివితేటలతో, దురహంకారంతో ప్రకృతిని కించపరచకండి! లోకమనే ఈ అందమైన, అద్భుతమైన గృహంలో అందరూ సహజీవనం చేయండి! సంతోషంగా జీవించండి! అని దయామయుడు అయిన ఆ పరమాత్ముడు మన నుండి ఆశిస్తున్నాడు. మనలను ఆశీర్వదిస్తున్నాడు. మనమంతా విజ్ఞులమై పరమాత్ముని లీలలను అర్థం చేసుకొని తగిన విధంగా స్పందించి మన పాత్రను మనం సమర్థవంతంగా పోషించి, ప్రకృతిని పరిరక్షిస్తూ ఈ విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావనతో జీవిద్దాం!

