Saturday, October 5, 2024
Homeఫీచర్స్Who is Bina ? ఎవరీ బీనా తివారి?

Who is Bina ? ఎవరీ బీనా తివారి?

ఇరవై ఎనిమిదేళ్ల మేజర్ బీనా తివారి ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. టర్కీలో సంభవించిన భయంకరమైన భూకంపంలో తీవ్రగాయాలపాలైన ఎందరో బాధితులకు భారత ఆర్మీ బ్రుందంలోని వైద్యురాలిగా మేజర్ బీనా సేవలందిస్తున్నారు. బాధితులకు అండగా నిలబడి రేయింబవళ్లు ఆమె వైద్యసేవలు అందిస్తున్న తీరు అక్కడి ప్రజల మనసులకు ఆమెను ఎంతో దగ్గరచేసింది. మేజర్ బీనాపై అక్కడి వారు కురిపిస్తున్న అంతులేని ప్రేమాప్యాయతలు సోషల్ మీడియాలో కూడా ఎంతో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రుడూన్ కు చెందిన బీనా తివారి కుటుంబం మూడు తరాలుగా భారత ఆర్మీలో పనిచేస్తూ దేశానికి సేవలందిస్తున్నారు. బీనా తండ్రి మోహన్ చంద్ర తివారి కుమాన్ రెజిమెంటులో సుబేదార్ మేజర్ గా సేవలందించి ఉద్యోగ విరమణ చేశారు. బీనా తాతగారు ఖిలానంద్ తివారి కూడా కొడుకు పనిచేసిన రెజిమెంటులోనే సుబేదారుగా పనిచేసి రిటైర్ అయ్యారు. భారత ప్రభుత్వం ఆపరేషన్స్ దోస్త్ పేరుతో టర్కీ భూకంప బాధితులకు సహాయం, రక్షణ కార్యకలాపాలను అందించేందుకుగాను 99 మందితో కూడిన వైద్య బ్రుందాన్ని తుర్కియాకు పంపింది. వారిలో మేజర్ బీనా తివారి కూడా ఉన్నారు. తమ కూతురు భూకంప బాధితులకు అందిస్తున్న సేవలకు తాను ఎంతో గర్వపడుతున్నామని బీనా తల్లి ఆనందాన్ని వ్యక్తంచేశారు. తమ కూతురు అక్కడ విధినిర్వహణలో ఎంత బిజీగా ఉంటుందో గ్రహించగలమన్నారామె. తండ్రి మోహన్ తివారి మాట్లాడుతూ భూకంపబాధితులకు తమ కూతురు అందిస్తున్న సేవలకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

సైనికాధికారుల కుటుంబం నుంచి వచ్చిన బీనా తను వేసుకున్న యూనిఫామ్ ఎంత బాధ్యాతాయితమైనదో బాగా ఎరిగినదని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నతనం నుంచీ సైన్యంలో చేరి సేవలందించాలని బీనా కలలు కనేదిట. ఆ దిశగా ఢిల్లీలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబిబిఎస్ పూర్తిచేసింది. 2018లో ఆర్మీ మెడికల్ కార్ప్సె లో చేరింది. దిబ్రూగర్హ్ లో ఆమె తొలి పోస్టింగ్.ఆమె భర్త కూడా ఆర్మీలో వైద్యులే. అతను కూడా ఆర్మీ మెడికల్ కార్ప్సెలో పనిచేస్తున్నారు.

టర్కీలోని ఇస్కందరన్ సిటీలో భారత సైన్యం నిర్వహిస్తున్న ఆసుపత్రిలో భూకంప బాధితులకు బీనా వైద్య సేవలను అందించడమే కాదు వారిని ప్రేమగా పలకరిస్తూ, ధైర్యం చెబుతూ గాయపడ్డ వారి మనసులకు సాంత్వన ఇస్తున్నారు. వారిగుండెల్లో మానసిక ధైర్యాన్ని సైతం బీనా నింపుతున్నారు. బాధితులకు బీనా అందిస్తున్న అద్భుతమైన సేవలను చూసి ముగ్ధురాలైన తుర్కియా మహిళ ఒకరు ప్రేమతో బీనాను ఆలింగనం చేసుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ ఫోటోను భారత ఆర్మీ అధికారి ‘వి కేర్’ అనే కాప్షన్ తో ట్విటర్ లో పోస్టు చేయడం, అది పెద్ద ఎత్తున వైరల్ అవడం అందరికీ తెలిసిన విషయమే. భారత సైన్యం ఏర్పాటుచేసిన పేరా ఫీల్డ్ అసుపత్రిలో భూకంప బాధిత చిన్నారిని బీనా సంరక్షింస్తున్న ఫోటోను ట్విటర్ లో షేర్ చేస్తూ రక్షణ, శాంతిస్థాపనా కార్యకలాపాల్లో భారతదేశ సైన్య అనుభవం అపారమైందని, ఇది ఇండియన్ ఆర్మీ గ్లోబల్ ఇమేజ్ కు నిదర్శమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర చేసిన పోస్టు కూడా పలువురిని ఆకర్షిస్తోంది. టర్కీలో భారత సైనిక బలగాలు భూకంప బాధితులకు అందిస్తున్న సహాయకార్యక్రమాలు, వైద్యసేవలు భారత సైన్యం వారికి అందిస్తున్న స్నేహ హస్తాన్ని తెలుపుతోంది.

మేజర్ బీనా అక్కడి భూకంప బాధితుల గురించి మాట్లాడుతూ ‘ మొదట్లో భూకంప శిధిలాలలో చిక్కుకుని పోయి తీవ్రంగా గాయపడిన ఎందరో బాధితులకు మేం వైద్య సేవలు అందిస్తూ వచ్చాం. ఇపుడు మాదగ్గరకు భూకంప దుర్ఘటన రేకెత్తించిన పోస్ట్ ట్రమాటిక్ డిజార్డర్ తో, ఒత్తిడిలతో మానసికంగా బాగా కుంగిపోయిన వారు మాదగ్గరకు ఎక్కువగా వస్తున్నారు’ అని చెప్పారు. 2015లో నేపాల్ లో సంభవించిన భూకంపంలో బాధితులకు సహాయం చేసేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ మైత్రిలో పాల్గొన్న వైద్యబ్రుందంలో కూడా బీనా ఉన్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా తుర్కియాలో భూంకప బాధితులకు వైద్యసేవల్లో మునిగిపోయిన మేజర్ బీనాది ఎందరిలోనూ స్ఫూర్తిని నింపే గొప్ప వ్యక్తిత్వం అనడంలో సందేహం లేదు….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News