స్త్రీ లేకపోతే జననం లేదు.. స్త్రీ లేకపోతే గమనం లేదు.. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు.. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు.. ఈ సృష్టికి మూలం స్త్రీ.. ఒకప్పుడు వంటింటికి పరిమితమైన స్త్రీ.. నేడు అంతరిక్షం అంచులను తాకి వస్తోంది. మహిళల త్యాగం, ప్రేమ, తపన అసమానమైనవి. ప్రతి ఏడాది మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ఆమెకి మనం ఇచ్చే గొప్ప గౌరవం. పురుషుడే బలవంతుడని.. స్త్రీ బలహీనురాలని భావించే రోజులు పోయాయి. పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందడుగు వేస్తున్నారు. విజయాలు సాధిస్తున్నారు. ఉన్నత శిఖరాలకు చేరుతున్నారు.
అమ్మని పూజించాలి.. భార్యను ప్రేమించాలి.. సోదరిని దీవించాలి.. ప్రతి స్త్రీని రక్షించడం ప్రతి పురుషుడి బాధ్యత. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు.. దేని కోసం.. ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం. వాస్తవానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతోంది.
అసలు మహిళా దినోత్సవం పుట్టుకకు 1908లో బీజం పడింది. పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం.. న్యూయార్క్‌లో మహిళలు ప్రదర్శనలు చేశారు. ఈ నిరసనల్లో దాదాపు 15వేల మంది పాల్గొన్నారంట. నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటి సారి ప్రకటించింది. అయితే మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్ నగరంలో 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి.
ఈ క్రమంలో 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకలను ప్రతి ఏటా ఏదో థీమ్‌తో నిర్వహించుకుంటున్నారు. ‘రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్‌మెంట్’ అన్నది 2025 మహిళా దినోత్సవ థీమ్. మన పురాణాల్లో కూడా స్త్రీకి ఎంతో గౌరవం ఇచ్చారు. స్త్రీని శక్తి స్వరూపంగా భావిస్తారు. స్త్రీ ఎక్కడ గౌరవాన్ని పొందుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే మీ చుట్టూ ఉన్న మహిళలను గౌరవించండి. అడ్డంకులను అధిగమించి ప్రపంచాన్ని మెరుగుపరచడం కోసం కష్టపడుతున్న మహిళలందరికీ తెలుగు ప్రభ తరపున హ్యాపీ ఉమెన్స్ డే.