పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపి.. కేసీఆర్ హ్యాట్రిక్ విజయానికి సడెన్ బ్రేక్ వేసి స్వతంత్ర తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించారు ఎనుముల రేవంత్ రెడ్డి. నవంబర్ 8న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
1969 నవంబరు 8న, తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామంలో ఎనుముల రేవంత్ రెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు ఎనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో AV కళాశాల నుంచి ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో బీఏ పూర్తి చేశారు. కాలేజీ రోజుల నుంచే రేవంత్ రెడ్డి రాజకీయాలపై ఆసక్తితో ఉన్నారు.
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని ప్రేమించి, పెద్దల సమక్షంలో 1992లో వివాహం చేసుకున్నారు. వారికీ ఒక కుమార్తె నైమిషా రెడ్డి.
మొట్టమొదటగా 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
అనంతరం టీడీపీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో రెండోసారి గెలిచారు. 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
2018 డిసెంబరులో శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయినా.. 2019 మేలో కాంగ్రెస్ తరఫున మల్కాజిగిరి ఎంపీగా గెలుపు బావుటా ఎగురవేశారు. ఆ ప్రభావంతో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను అధిష్ఠానం నియమించింది. 2021 జులై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారు. రేవంత్‌రెడ్డి కొడంగల్, కామారెడ్డి నుంచి పోటీ చేశారు. కామారెడ్డిలో ఓడిపోగా.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అనూహ్య గెలుపుతో రేవంత్ రెడ్డి సీఎల్పీ నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023, డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
సీఎంగా అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే డిసెంబర్ 9, 2023న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం 200 యూనిట్ల వరకూ ఉచిత బిల్లు, రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు సన్న బియ్యం పథకాలు అందిస్తున్నారు.
ఫిబ్రవరి 10, 2024న 13,444 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అక్టోబర్ 2024లో రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో టీచర్లుగా ఎంపికైన 10,006 మంది అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు.
ఇటీవల గ్రూప్-1 ఫలితాలను సైతం ప్రకటించారు. 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.