నేటి బిజీ లైఫ్‌లో రెండు పూటలకి కలిపి ఉదయాన్నే వంట చేసుకుంటున్నారు. మధ్యాహ్నం వేడిగా తిని.. రాత్రికి చల్లారిన వంటలను మళ్లీ ఒకసారి వేడి చేసుకుని తింటున్నారు. ఇలా వేడి చేసుకొని తినడం మంచిదేనా.. దీనిపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.
పానీయాలు అయినా, ఆహారం అయినా.. చాలా మంది రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుని ఒకసారి వండిన ఆహారాన్ని పలుమార్లు వేడి చేసుకుని తినేస్తున్నారు. ఆహారాన్ని రిఫ్రిజిరేటర్ నుండి తీసిన తర్వాత రూం టెంపరేచర్‌కు చేరుకున్నాక వేడి చేసి తినడం మంచిదే.
అయితే కొన్ని ఆహారాలు, పానీయాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం వల్ల అవి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వేడి చేసిన కొన్ని ఆహారాలు తినడం ఆరోగ్యానికి మేలు చేసినా.. మరికొన్ని ఆహారాలను వేడి చేసి తినడం వల్ల తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయట.
ముఖ్యంగా మిగిలిపోయిన అన్నం, పాలకూర, ఉడికించిన కోడి గుడ్డు, బంగాళా దుంపలు, మాంసాహారాలు వంటివి ఒకసారి వండిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయకపోవడమే మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు వండుకుని వేడిగా తింటే పోషకాలు సరైన రీతిలో అందుతాయి.
ఆహారం, పానీయాల ఉష్ణోగ్రత కూడా ఆరోగ్యంపై విభిన్న ప్రభావాలను చూపుతుంది. కొందరు వేడి ఆహారం తినడం మంచిదని భావిస్తే.. మరికొందరు చల్లని ఆహారం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం వేడి పానియాలు రుచికరంగా ఉండటమే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం చూపిస్తుందట. వేడి పానీయాలు ఉద్రిక్తత, ఒత్తిడి, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇక టీ, కాఫీ లేదా ఏదైనా ఇతర వేడి పానీయాలను వేడిగా తాగడం వల్ల మంచిదని చెబుతున్నాయి.
ఇక, శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆహారం.. చల్లటి ఆహారాలు తిన్న వారు నిరాశ, నిద్రలేమితో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. అదే సమయంలో శీతాకాలంలో వేడి పానీయాలు తిన్న వారికి అలాంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.