అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యల కారణంగా భారత్‌లో నమోదయ్యే మొత్తం మరణాల్లో దాదాపు 27 శాతం గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయని WHO గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని ప్రత్యేక ఆహారాలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బీట్రూట్లో ఉండే డైటరీ నైట్రేట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలు వ్యాకోచం చెందేలా చేస్తాయి. ఫలితంగా రక్తప్రసరణ మెరుగుపడి, ధమనులపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
వాల్‌నట్స్‌లోని ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ఒక రకమైన ఒమేగా-3), యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్నును నియంత్రించి, రక్తనాళాల్లో ఫలకం ఏర్పడకుండా నివారించడంలో దోహదపడతాయి.
క్యాబేజీ, బ్రకోలీ వంటి కూరగాయల మైక్రోగ్రీన్స్‌లో సల్ఫోరఫేన్ అనే సమ్మేళనం అధికంగా లభిస్తుంది. ఇది కణస్థాయిలో యాంటీఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థను ఉత్తేజపరిచి, రక్తనాళాల వాపును తగ్గించేందుకు సహాయపడుతుంది.
సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఈపీఏ, డీహెచ్ఏ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను, రక్తనాళాల వాపును తగ్గించడంలో దోహదపడతాయి.
70 శాతం కంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాల్స్ అనే మొక్కల ఆధారిత సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్త ఫలకికలు ఒకదానికొకటి అంటుకోకుండా కాపాడతాయి.
అయితే ఈ ఆహారాలు విడివిడిగా కాకుండా కలిపి ఒకదానికొకటి తోడుగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం మానేయడం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం వంటి జీవనశైలి మార్పులను చేసుకోవాలని చెబుతున్నారు.