కొందరికి అతిగా చేతులు కడుక్కునే అలవాటు. అయితే ఇది హానికరమని మీకు తెలుసా.. అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి రోజూ వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చాక, భోజనం చేసేముందు చేతులు కడుక్కోవడం మంచి అలవాటే. కానీ అతిగా చేతులు కడుక్కుంటే ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల చర్మం పై పొర దెబ్బతింటుంది. తద్వారా చికాకు, దురద, కొన్నిసార్లు బొబ్బలకు కూడా దారితీస్తుంది. మన చర్మంలోని సహజ నూనెలు తొలగిపోయి చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది.
ఎక్కువగా చేతులు కడుక్కోవడం వల్ల చర్మం వాపు, దురద ఏర్పడుతుంది. ఎరుపు రంగులోకి మారుతుంది. ఇప్పటికే తామర ఉన్నవారికి, తరచుగా చేతులు కడుక్కోవడం తీవ్రమైన సమస్యకి దారి తీసే అవకాశం ఉంది.
చర్మం పగుళ్లు లేదా పగిలిపోయినప్పుడు, అతిగా చేతులు కడుక్కుంటే క్రిములు శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇది ఇన్ఫెక్షన్కు దారి తీస్తుంది.
టాయిలెట్ ఉపయోగించిన తర్వాత, తినడానికి లేదా భోజనం తయారుచేసే ముందు, బయటి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తాకిన తర్వాత, తుమ్మిన, దగ్గిన తర్వాత చేతులు కడుక్కోవడం మంచిది.
కాగా, చేతులు కడుక్కోవడానికి సరైన మార్గం సబ్బు, పంపు నీటితో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలి. వేళ్ల మధ్య, వేలు గోళ్ల కింద, చేతుల వెనుక భాగాన్ని పూర్తిగా రుద్ది శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.