వర్షాకాలం, చలికాలంలో వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు ఇంట్లో బియ్యం, పప్పులు, పిండి వంటి నిల్వ ఆహార పదార్థాల్లో చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
పురుగులు పట్టిన బియ్యం, పిండి లేదా పప్పులను శుభ్రమైన వస్త్రం లేదా పెద్ద ట్రేపై పలుచగా పరిచి రెండు నుంచి మూడు గంటల పాటు ఎండలో ఉంచాలి. దీంతో తేమ తొలిగిపోయి వేడికి పురుగులు పారిపోతాయి.
బియ్యం కింద, పైన కొద్దిగా కల్లు ఉప్పు చల్లడం ద్వారా అందులోని తేమతో పాటు పురుగులు సైతం పరారవుతాయి.
ఒక చిన్న గిన్నెలో కొద్దిగా తెల్ల వెనిగర్, పావు టీస్పూన్ ఇంగువ వేసి కలిపి.. పురుగులు పట్టిన బియ్యం మధ్యలో ఉంచడం ద్వారా ఆ వాసనకి పురుగులు పారిపోతాయి.
బిర్యానీ ఆకులు సహజమైన కీటక నాశినిగా పనిచేస్తుంది. బియ్యం నిల్వ చేసే డబ్బాలో రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను వేయడం ద్వారా ఇక పురుగులు వాటి వైపు చూడవు.
పొట్టు తీయని ఐదు, ఆరు వెల్లుల్లి రెబ్బలను బియ్యం, పిండి, పప్పుల్లో వేయడం ద్వారా.. వాటి ఘాటుకు పురుగులు దరిచేరవు.