India Post Dak Sewa App: ఇకపై అరచేతిలోనే పోస్టల్ సేవలు.. ‘డక్ సేవా’ యాప్‌లో సకల సదుపాయాలు
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ భారతీయ పోస్టల్ శాఖ కూడా అందుకు అనుగుణంగా అప్డేట్ అవుతూ వస్తోంది. పోస్టల్ తమ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందించేందుకు తపాలా శాఖ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
పోస్టల్ సేవలన్నిటినీ స్మార్ట్‌ఫోన్‌లో అందించేలా తపాలా శాఖ ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘డాక్ సేవ’ పేరుతో సేవలు అందనున్నాయి. ‘ఇకనుంచి పోస్టాఫీసు మీ జేబులోనే’ అంటూ తన అధికారిక ఖాతా ‘X’లో పోస్టు చేసింది. ఇకపై మొబైల్ నుంచే అన్ని రకాల పోస్టల్ సేవలను అందుకోవచ్చు.
ప్రస్తుతం పోస్టల్ శాఖ అందిస్తున్న అన్ని సదుపాయాలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. పోస్టేజ్ కాలిక్యులేషన్, కంప్లయింట్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్, పార్సిల్ ట్రాకింగ్ లాంటి సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. స్పీడ్‌పోస్టు, మనీఆర్టర్ వివరాలను కూడా ట్రాక్ చేయవచ్చు.
అదేవిధంగా దేశీయ, అంతర్జాతీయ పార్శిల్ సదుపాయాలకు ఛార్జీ వివరాలను ఈ యాప్ అందిస్తుంది. ఇకపై గంటల తరబడి క్యూలైన్లో నిల్చునే పని లేకుండా స్పీడ్‌పోస్ట్, రిజిస్టర్డ్ పోస్టు, పార్శిల్ బుకింగ్ లాంటి సేవలకు యాప్ వినియోగించవచ్చు.
అంతేకాకుండా GPS సాయంతో సమీపంలోని పోస్టాఫీసు వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లో Dak Sewa App అని టైప్ చేయాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న అధికారిక యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో రిజిస్టర్ అయి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇండియా పోస్ట్ సూచించింది. మరిన్ని సేవల కోసం www.indiapost.gov.in అధికారిక సైట్లో కూడా వివరాలు అందుబాటులో ఉన్నాయి.