దేశంలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో వర్షాలు ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి
రాజస్థాన్లో రుతుపవనాలు వేగవంతమయ్యాయి. కోట, బుండి, బరాన్, ఝలావర్, టోంక్, చిత్తోర్గఢ్, సవాయి మాధోపూర్తో సహా అనేక జిల్లాల్లో వరదల వంటి పరిస్థితులు ఉన్నాయి.
రాజస్థాన్లో రుతుపవనాల బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యకలాపాల కోసం NDRF, పోలీసు బృందాలను మోహరిస్తున్నారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ప్రభావితమైన పంటలపై ప్రత్యేక గిర్దావారీ చేపడతామని ఆయన అన్నారు.
రాబోయే మూడు రోజులు దక్షిణ, ఆగ్నేయ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఆగస్టు 22 -29 మధ్య పశ్చిమ రాజస్థాన్లోని బికనీర్ డివిజన్లో వర్షాకాలం పెరిగే అవకాశం ఉంది.
సవాయి మాధోపూర్, టోంక్, కోట, బరాన్, బుండి, ఝలావర్, భిల్వారా, చిత్తోర్గఢ్, దుంగార్పూర్, బన్స్వారా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు సెలవు ప్రకటించింది.
ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు తెరవకూడదని విద్యాసంస్థలకు సూచించింది ప్రభుత్వం. వర్షాలు ఇలాగే కొనసాగితే మరిన్ని సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.