తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్నా పెద్దా భక్తి భావంతో, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు.
మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో అందంగా అలంకరించుకుని బతుకమ్మను అరచేతుల్లో ఎత్తుకుని ఆయా ప్రాంతాల్లో గుళ్ల వద్దకు వచ్చారు. సాక్షాత్తు గౌరమ్మే వచ్చిందా అన్నట్లుగా పరిసరాలన్నీ భక్తి భావంతో ఉట్టిపడుతున్నాయి.
మహిళలు గౌరమ్మను వివిధ రూపాల్లో అలంకరించి సద్దుల బతుకమ్మకు నూతన వైభవం తీసుకొచ్చారు. అమ్మ అలంకరణను చూసేందుకు రెండు కళ్లూ చాలవేమో
తెలంగాణ జానపద పాటలకు గొంతు కలుపుతూ మహిళలు, యువతులు కోలాటాలు, బతుకమ్మను వేశారు. వందల సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాంప్రదాయ దుస్తుల్లో యువతులు సెల్ఫీలకు పోజులిస్తూ సద్దుల బతుకమ్మను సెలబ్రేట్ చేసుకున్నారు. వెన్నెల కాంతుల్లో ఆ దృశ్యాలు కన్నుల పండువగా ఉన్నాయి.
చివరిగా గౌరమ్మను సంతోషంగా గంగమ్మ ఒడిలో కలిపి మళ్లీ ఏడాది బతుకమ్మ కోసం ఎదురుచూస్తూ ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.